నేటి సార్వత్రిక సమ్మెకు సై

ABN , First Publish Date - 2020-11-26T04:31:13+05:30 IST

కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని, రైతుల నడ్డివిరిచేలా నూతన వ్యవసాయ చట్టాన్ని చేసిందని నిరసిస్తూ కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి.

నేటి సార్వత్రిక సమ్మెకు సై

బంద్‌కు పిలుపునిచ్చిన రాజకీయ పార్టీలు, కార్మిక, ప్రజా సంఘాలు 

కదంతొక్కనున్న సింగరేణి కార్మిక సంఘాలు 

నై అంటున్న బీఎంఎస్‌.. 

నష్టం జరుగుతుందంటున్న సింగరేణి సంస్థ 

ఖమ్మం / కొత్తగూడెం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని, రైతుల నడ్డివిరిచేలా నూతన వ్యవసాయ చట్టాన్ని చేసిందని నిరసిస్తూ కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు కార్మిక సంఘాలతో పాటు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పక్షాలు కూడా మద్దతు ప్రకటించి సమ్మెను విజయవంతం చేసేందుకు ఇప్పటికే విస్తృత ప్రచారం, నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. రైతులను నష్టపరిచేలా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని, విద్యుత్‌ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని, పంట నష్టపరిహారం ఇవ్వాలని, కార్మిక వ్యతిరేక నిర్ణయాలను మానుకోవాలని డిమాండ్‌ చేశాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలు, పట్టణాల్లో బైక్‌, ఆటో ర్యాలీతో నాయకులు హోరెత్తించారు. మెడికల్‌షాపులు మినహా అన్ని వ్యాపార సంస్థలు, బస్సులు బంద్‌పాటించాలని కోరారు. గ్రామాల్లో కూడా రైతులు, వ్యవసాయ కూలీలు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలంటూ విపక్ష శ్రేణులు చైతన్యం కలిగిస్తూ ప్రచారం నిర్వహించారు. 

సై అంటున్న సింగరేణి కార్మిక సంఘాలు

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు వివిధ రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలతోపాటు సింగరేణిలోని జాతీయ కార్మిక సంఘాలు సై అన్నాయి. దీంతో సింగరేణి సంస్థపై ఈ సమ్మె ప్రభావం పడనుంది. అయితే ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, ఇఫ్టూ కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొనాలని ఇప్పటికే పిలుపునిచ్చాయి. బొగ్గుగని కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే తప్పనిసరిగా ఈ సమ్మెకు మద్దతివ్వాలని కోరాయి. కానీ సింగరేణిలో బీఎంఎస్‌ కార్మిక సంఘం మాత్రం ఈ సమ్మెలో పాల్గొనవద్దని పిలుపునిచ్చింది. అవసరమైతే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని ఆ సంఘం నాయకులు చెబుతున్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) కూడా సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 

సమ్మెతో సింగరేణిపై ప్రభావం!

సార్వత్రిక సమ్మె వల్ల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడి కార్మికులకు నష్టం వాటిల్లే ప్రమాదముందని, ఈ సమ్మెలో పాల్గొనవద్దని సింగరేణి యాజమాన్యం కూడా కార్మికులను కోరింది. ఇప్పటికే కరోనా లాక్‌డౌన్‌ సమయంలో కార్మికులు విధులకు దూరంగా ఉండటం, ఆ తర్వాత సడలింపులు వచ్చినా కరోనా వ్యాప్తి భయం ఉన్న నేపథ్యంలో సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడిందని వివరించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో అనుకున్న బొగ్గు ఉత్పత్తి సాధించడంలో కొంత వరకు వెనుకబడిందని చెబుతుండగా.. మళ్లీ ఒక రోజు సార్వత్రిక సమ్మెతో సింగరేణి వ్యాప్తంగా సుమారు 2లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడటం, సింగరేణి కార్మికులు కూడా ఒక రోజు వేతనం కోల్పోయే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, టీఆర్‌ఎస్‌ పార్టీలతోపాటు సీఐటీయూ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్‌, ఐఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూ కార్మిక సంఘాలతోపాటు ప్రజా సంఘాల నాయకులు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా మోటారు సైకిళ్ల ర్యాలీలు నిర్వహించారు. బొగ్గుగనుల వద్ద కార్మిక సంఘాల నేతలను కలిసి మద్దతు కోరారు. 

Read more