ప్రతినాయక పాత్రలు పోషించాలని ఉంది
ABN , First Publish Date - 2020-12-07T04:38:46+05:30 IST
సినిమాల్లో అవకాశం వస్తే అరవింద్‌స్వామిలా నెగిటివ్ క్యారెక్టర్స్ చేసి సత్తా చాటాలని ఉందని ప్రముఖ సినీ, టీవీ నటుడు సాయికిరణ్ పేర్కొన్నారు.

బుల్లితెరలో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నా
భద్రాద్రి రామక్షేత్రం అద్భుతంగా ఉంది
ఆంధ్రజ్యోతితో సినీ, టీవీ నటుడు సాయికిరణ్
భద్రాచలం, డిసెంబరు 6: సినిమాల్లో అవకాశం వస్తే అరవింద్‌స్వామిలా నెగిటివ్ క్యారెక్టర్స్ చేసి సత్తా చాటాలని ఉందని ప్రముఖ సినీ, టీవీ నటుడు సాయికిరణ్ పేర్కొన్నారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం ఒక డాక్యుమెంటరీలో నటించేందుకు వచ్చిన ఆయన కొద్దిసేపు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ‘ మాది విజయనగరం స్వగ్రామం. తండ్రి ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు రామకృష్ణ. ఎస్పీ బాలసుబ్రమణ్యం అంటే నాకు ఎంతో ఇష్టం. వారిని స్ఫూర్తిగా తీసుకొని పాటలు కూడా పాడటం నేర్చుకున్నా. దీంతో స్టేజీ, యూట్యూబ్ సింగర్‌గా కొనసాగాను. నటనలో అమితాబచ్చన్ ఆదర్శం. తొలి సినిమా నువ్వే కావాలి అవకాశం ప్రముఖ దర్శకులు కృష్ణవంశీ ద్వారా వచ్చింది. నా ఫొటో చూసి రవికిషోర్‌కు సిఫారసు చేయడంతో అవకాశం లభించింది ఆ సినిమాతో పాటు ప్రేమించు సైతం తనకు ఎంతగానో పేరు తెచ్చింది. ఇప్పటి వరకు 33 సినిమాల్లో నటించాను. తెలంగాణ పోలీసు శాఖ తీసే ఒక డా క్యుమెంటరీలో నటిస్తున్నా. అలాగే నెట్‌ఫ్లిక్స్ జనవరిలో తీసే హిందీ సినిమాలో నటిస్తున్నా. బుల్లితెర నటుడిగా చాలా బిజీబిజీగా ఉన్నా. కోయిలమ్మతో తనకు బ్రేక్ వచ్చింది. మళయాలంలో కోయిలమ్మ(వానంబాడీ) అనే సీరియల్ నాలుగేళ్ల పాటు ఏషియన్ నెట్‌లో అప్రతిహతంగా ప్రసారమైంది. ఆ సీరియల్ అక్కడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తమిళ్‌లో అపరంజి(తంగం) సీరియల్ ఐదేళ్లపాటు ప్రసారమైంది.. తాజాగా జీ ఛానెల్లో ఇంటిగుట్టు, స్టార్ మాలో ప్రసారమయ్యే గుప్పెడు మనస్సులో నటిస్తున్నాను. భద్రాచలం రావడం ఇదే తొలిసారి. నేపఽథ్యగాయకురాలు సుశీల తనకు నానమ్మ అవుతారని’ తెలిపారు.