రేపటి నుంచి యాసంగికి సాగర్‌ నీరు

ABN , First Publish Date - 2020-12-14T04:52:02+05:30 IST

రేపటి నుంచి యాసంగికి సాగర్‌ నీరు

రేపటి నుంచి యాసంగికి సాగర్‌ నీరు
నీటిపారుదల అడ్వైజరీ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

నీటిపారుదల సలహామండలి సమావేశంలో మంత్రి పువ్వాడ

ఖమ్మం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : యాసంగి పంటల సాగుకు గాను ఖమ్మం జిల్లాలోని నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టుకు బుధవారం నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఆదివారం టీటీడీసీ సమావేశ మందిరంలో జరిగిన నీటిపారుదల సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్‌ 15నుంచి ఏప్రిల్‌ 17వరకు వారబందీ పద్ధతిన నీటిని విడుదల చేస్తామన్న ఆయన యాసంగి యాక్షన్‌ ప్లాన్‌, ఎన్నెస్పీ జలాల విడుదల, భారీ, చిన్న మధ్యతరహా నీటి పఽథకాలు, యాసంగిలో ఎరువుల సరఫరా తదితర అంశాలపై సమీక్షించారు. యాసంగికి సంబంధించి ఎన్నెస్పీ ఆయకట్టు పరిధిలోని చివరి ఆయకట్టుకు సాగునీరు అందేలా 30 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. వారబందీ పద్ధతిన నీటివిడుదలకు అధికారులు సిద్ధంగా ఉండాలని, జిల్లాలోని చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు, చెరువులను పూర్తిస్థాయిలో నింపాలని సూచించారు. ఏన్కూరు మండలం తిమ్మారావుపేట లో లెవల్‌చప్టా పనులకు రూ.30లక్షలు మంజూరు చేస్తున్నామని, గత సీజన్‌లాగే ఈ యాసంగికి సాగునీటి సమస్య లేదన్నారు. సీతారామ ప్రాజెక్టు పనుల్లో భాగంగా బ్యారేజ్‌ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్నామన్నారు. కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ మాట్లాడుతూ యాసంగిలో ఎన్నెస్పీ ఆయకట్టుకు వారబందీ పద్ధతిన 30 టీఎంసీల నీటిని ప్రణాళికాయుతంగా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అన్ని చెరువులను నింపేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. యాసంగికి 41వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని 18వేల మెట్రిక్‌ టన్నులను సిద్ధంగా ఉంచామన్నారు. సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌,  వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌, డీసీసీబీ చైర్మన్‌ నాగభూషనం, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శేషగిరిరావు, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌రావు, ఎన్నెస్పీ, సీతారామ ప్రాజెక్టు, నీటిపారుదలశాఖ, ఎన్నెస్పీ, వ్యవసాయశాఖ, ఇంజనీరింగ్‌ శాఖల ఎస్‌ఈలు, సీఈలు, ఈఈలు, ఏడీలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-14T04:52:02+05:30 IST