మట్టిలో మాణిక్యం
ABN , First Publish Date - 2020-10-04T09:30:27+05:30 IST
ఆమె కడు బీద కుటుంబంలో జన్మించింది. కానీ ఉన్న లక్ష్యం చేరాలనే పట్టుదల ఉంటే ఆ బీదరికం అడ్డుకాదని నిరూపించింది పాల్వంచకు
ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో సీటు సాధించిన పాల్వంచ విద్యార్థిని
చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన తేజశ్రీ
పాల్వంచ రూరల్ అక్టోబర్ 3: ఆమె కడు బీద కుటుంబంలో జన్మించింది. కానీ ఉన్న లక్ష్యం చేరాలనే పట్టుదల ఉంటే ఆ బీదరికం అడ్డుకాదని నిరూపించింది పాల్వంచకు చెందిన తేజశ్రీ.. ఎంఎస్‌సీ చదివే వారికి చిరకాల స్వప్నమైన డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్సిట్యూట్ కాలేజ్‌లో సీటు సంపాదించి తన ప్రతిభను చాటుకుంది. ఆగస్టు 30న నిర్వహించిన ఆన్‌లైన్ పరీక్షల్లో భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ పట్టణానికి చెందిన యేరువ తేజశ్రీ అత్యధిక మార్కులతో సీటుదక్కించుకుంది. చిన్ననాటినుంచే చదువుపై మక్కువతో ఉన్న తేజశ్రీ 10వ తరగతిలో 9.8 జీపీఏ, ఇంటర్‌లో 98శాతం మార్కులు సాధించింది.
హైదరాబాదులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్సిట్యూట్‌లో బీఎస్‌సీ ఫారెస్ట్రీలో 89శాతం మార్కులు సాధించింది. అంతటితో ఆగకుండా డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్సిట్యూట్‌లో సీటు దక్కించుకుని తెలంగాణ రాష్ర్టానికే గర్వకారణమైంది. దేశ వ్యాప్తంగా 200సీట్ల కోసం జరిగిన పరీక్షలో 1700 మంది విద్యార్థులు పోటీ పడగా తాను పోటీపడ్డ విభాగంలో 40సీట్లే ఉన్నా మొదటి దశలోనే సీటు దక్కించుకుంది. సామాన్య ఫోటో గ్రాఫర్ అయిన తన తండ్రి శ్రీనివాసరావు, సామాన్య గృహిణి అయిన తన అమ్మ సుజాతల ప్రోత్సాహంతోనే తాను ఇన్ని విజయాలు సాధించానని తేజశ్రీ గర్వంగా చెప్పుకుంటోంది.