ఆక్యుపెన్సీ 60శాతమే

ABN , First Publish Date - 2020-12-16T05:21:00+05:30 IST

కరోనా వైరస్‌ ప్రభావంతో ఆర్టీసీ అతలాకుతలమైంది. ఇప్పటికీ ఇంకా జిల్లాలోని భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు డిపోలు నష్టాలబాటలోనే నడుస్తున్నాయి.

ఆక్యుపెన్సీ 60శాతమే
భద్రాచలం ఆర్టీసీ బస్టాండు

నష్టాల పథంలోనే ప్రగతి చక్రం

రోజుకు మూడు డిపోల్లో రూ.13 లక్షలు నష్టం

ఇంకా రోడ్డెక్కని 69 సర్వీసులు

భద్రాచలం, డిసెంబరు 15: కరోనా వైరస్‌ ప్రభావంతో ఆర్టీసీ అతలాకుతలమైంది. ఇప్పటికీ ఇంకా జిల్లాలోని భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు డిపోలు నష్టాలబాటలోనే నడుస్తున్నాయి. ప్రస్తుతం 60 శాతం ఆక్యుపెన్సీనే ఉంటోంది. మూడు డిపోల పరిధిలో రోజుకు రూ.13 లక్షల నష్టం వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మే 19 నుంచి ఆర్టీసీ రథచక్రాలు రోడ్డుపైకి ఎక్కగా నాటి నుంచి నేటి వరకు ఇంద్ర, సూపర్‌లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు దాదాపుగా అన్నీ తిరుగుతుండగా, మారుమూల గ్రామాలకు పల్లెవెలుగు బస్సులను తిప్పుతున్నారు. అయితే ఇంకా పూర్తిస్థాయిలో రోడ్డు ఎక్కని ఆర్టీసీ సర్వీసులు జిల్లాలో 69 ఉండటం గమనార్హం. కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో సైతం ఆర్టీసీ అధికారులు బస్సులను శానిటైజేషన్‌ చేసి ప్రయాణికులకు ఎటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని సమయాల్లో ప్రయాణీకులకు శానిటైజర్లు అందుబాటులో లేని పరిస్థితులు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటువంటి పరిస్థితుల ను అధిగమించేందుకు సత్వరం చర్యలు చేపడుతున్నామని, ప్రయాణికుల ఆరోగ్యమే లక్ష్యంగా సేవలను కొనసాగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

60 శాతం ఆక్యుపెన్సీనే..

మార్చి చివరి వారంలో కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన బస్సు సర్వీసులు మే 19 నుంచి క్రమ క్రమంగా రహదారులపై తిరగడం ప్రారంభించాయి. ఆరంభంలో కొద్దిపాటి సర్వీసులను మాత్రమే తిప్పిన అధికారులు అనంతరం అన్ని ప్రాంతాలకు సర్వీసుల సంఖ్యను పెంచారు. అయితే సాధారణ రోజుల్లో 75 శాతం పైగా ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ ఉండగా ప్రస్తుతం 60 శాతం దాటడం లేదని వారు పేర్కొంటున్నారు. జిల్లాలో అతిపెద్ద సర్వీసులు గల డిపో అయిన భద్రాచలంలో 105 సర్వీసులకు గాను 85 నడుస్తున్నాయి. అలాగే కొత్తగూడెం నుంచి 89 సర్వీసులకు గాను 80, మణుగూరు డిపో నుంచి 75 సర్వీసులకు గాను 35 సర్వీసులు నడుస్తున్నాయి.

ఇంకా నష్టాలబాటే..

జిల్లాలోని మూడు డిపోల పరిధిలో ఇంకా నష్టాలే వస్తున్నాయి. సాధారణంగా భద్రాచలం ఆర్టీసీ డిపో నుంచి రూ.18 లక్షల ఆదాయం రోజుకు రాగా ప్రస్తుతం రూ.12 లక్షలు మాత్రమే వస్తోంది. అలాగే కొత్తగూడెం డిపో నుంచి రూ.13 లక్షల ఆదాయం రావాల్సి ఉండగా రూ.10 లక్షలు, మణుగూరు నుంచి రూ. 14 లక్షలు రావాల్సి ఉండగా రూ.10 లక్షల ఆదాయం వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో మొత్తంగా రోజుకు రూ.13 లక్షల నష్టం ఆర్టీసీ చవిచూస్తోంది. మే నెల మూడో వారంలో రోజుకు ఒక్కొక్క డిపో నుంచి  రోజుకు రూ.మూడు నుంచి రూ.నాలుగు లక్షలు ఆదాయం రాగా, గతంతో పోలిస్తే గత ఏడు నెలల్లో ఆదాయం కొద్దిగా పెరిగింది. అయితే నష్టాలు మాత్రం ఇంకా వస్తూనే ఉండటం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో రోడ్డెక్కని 69 బస్సు సర్వీసులను సాధ్యమైనంత త్వరలో మళ్లీ పునః ప్రారంభించాలని భావిస్తున్నారు.

Updated Date - 2020-12-16T05:21:00+05:30 IST