ఎకరానికి రూ.35లక్షలు ఇవ్వాల్సిందే

ABN , First Publish Date - 2020-11-19T06:27:51+05:30 IST

గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి అంశం మరోసారి ఆందోళకు దారితీసింది. అవార్డు ఎంక్వయిరీలో భాగంగా అధికారులు బుధవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో తుంబూరు గ్రామానికి చెందిన

ఎకరానికి రూ.35లక్షలు ఇవ్వాల్సిందే

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే గ్రామసభలో రైతుల డిమాండ్‌

ఎకరానికి రూ.23లక్షలు పరిహారం ప్రకటించిన జేసీ 

తొలుత కల్లూరులో రైతుల అరెస్ట్‌తో సత్తుపల్లిలో రాస్తారోరో


సత్తుపల్లి, నవంబరు 18: గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి అంశం మరోసారి ఆందోళకు దారితీసింది. అవార్డు ఎంక్వయిరీలో భాగంగా అధికారులు బుధవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో తుంబూరు గ్రామానికి చెందిన రైతులకు గ్రామసభ నిర్వహించారు. ఈ క్రమంలో ఎలాంటి ఆందోళనలు జరగకుండా ఉద్రిక్తత తలెత్తకుండా సత్తుపల్లి పోలీసులు తహసీల్దార్‌ కార్యాలయంలో బారీకేడ్లు, బందోబస్తు ఏర్పాటుచేశారు.  రూ.35లక్షలపైగా ఇస్తేనే తాము భూములను ఇచ్చేందుకు ముందుకు వస్తామని రైతులు భీస్మించారు. ఇదిలా ఉంటే తమ ప్రతినిధులతో పాటు ఆ గ్రామసభకు హాజరై తమ అభ్యంతరాలు తెలపాలని రైతులు నిర్ణయించుకున్నారు.


రైతులు తుంబూరు నుంచి తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకోగా.. రైతుల ప్రతినిధి, న్యాయవాది రాజశేఖర్‌రెడ్డి, వల్లపునేని రవి, వెంకటేశ్వర్లు ఖమ్మం నుంచి గ్రామసభకు హాజరయ్యేందుకు వెళుతుండగా వారిని కల్లూరులో పోలీసులు అరెస్ట్‌చేశారు. ఈ విషయంలో సత్తుపల్లి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఉన్న తుంబూరు రైతులకు తెలియండంతో వారు కోపోద్రిక్తులయ్యారు. తమ వారిని ఎందుకు అరెస్ట్‌ చేశారంటూ ఆందోళనకు దిగారు. ఆ సమయంలో రైతులు గ్రామసభలో కూర్చోవాలని ఆర్డీవో సూర్యనారాయణ సర్ది చెప్పినా రైతులు వినలేదు. అరెస్టు చేసిన వారిని వదిలిపెడితేనే గ్రామసభకు వస్తామంటూ పలువురు రైతులు ఆర్డీవో ఆర్డీవో కాళ్లపై పడ్డారు. అనంతరం జాతీయ రహదారిపై అరగంటలకు పైగా రాస్తోరోకో చేశారు. ఆ తర్వాత అధికారులలు వారితో చర్చలు జరిపగా.. మధ్యాహ్నం సమయానికి శాంతించిన రైతులు గ్రామసభకు హాజరయ్యారు. 


చట్టంప్రకారం వెళదాం : మధుసూదనరావు, జేసీ

గ్రీన్‌ ఫీల్డ్‌ జాతీయ రహదారికి భూములు కేటాయించే రైతులకు చట్టప్రకారం నష్టపరిహారం ప్రకటిస్తామని జేసీ మధుసూదనరావు అన్నారు. అవార్డు ప్రకారం ఎకరానికి రూ.15.50లక్షలు వస్తుందని జేసీ తెలపడంతో రైతులంతా నిరసన తెలిపారు. సరిహద్దు రాష్ట్రంలో ఒక రేటు.. ఇక్కడో రేటు ప్రకటించారని, రూ.50లక్షల విలువ చేసే భూములను జాతీయ రహదారి కోసం వదిలేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని రైతులు వాపోయారు. రూ.35లక్షలపైగా ఇస్తేనే తాము భూములను ఇచ్చేందుకు ముందుకు వస్తామని రైతులు తెలపగా జేసీ చివరగా రూ.23లక్షలు ఇస్తామని ప్రకటించారు.


ఈ నిర్ణయానికి అంగీకరించని రైతులు మెరుగైన పరిహారం కావాలని, లేదంటే భూములను ఇవ్వమని స్పష్టం చేయడంతో.. ఈ విషయంపై కలెక్టర్‌కు ఆప్పీల్‌ చేసుకోవాలని జేసీ చెప్పారు. దీంతో గ్రామసభ అర్ధంతరంగా ముగిసింది. సమావేశంలో ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్‌ కేవీఎంఏ.మీనన్‌, డీటీ సంపత్‌, గిర్దావర్లు విజయభాస్కర్‌, జగదీష్‌, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-11-19T06:27:51+05:30 IST