రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు యువకుల మృతి
ABN , First Publish Date - 2020-12-16T04:41:08+05:30 IST
కల్లూరు మండలంలోని పోచవరం- చినకోరుకొండి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు.

కల్లూరు/పెనుబల్లి రూరల్, డిసెంబరు 15: కల్లూరు మండలంలోని పోచవరం- చినకోరుకొండి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. వివరాలు.. చినకోరుకొండి గ్రామానికి చెందిన రెడ్డి రామకృష్ణ(36), ఇంటి గొపి (24) వ్యవసాయా పనులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా రహదారిపై ఆగిఉన్న ట్రక్కును ఢీ కొనడంతో అక్కడిక్కడే మృతిచెందారు. రామకృష్ణకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గోపి డిగ్రీ పూర్తి చేసి ఇటివద్దే ఉంటున్నారు. యువకులు మృతిచెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కల్లూరు పోలీసులు ఘటన స్థలాన్ని సందర్శించి విచారణ నిర్వహిస్తున్నారు.
పెనుబల్లిరూరల్: ఆగివున్న టిప్పర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనదారుడు చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఉప్పలచెలకకు చెందిన టిప్పర్ డ్రైవర్ పైల గణేష్ (25) పెనుబల్లి వెళ్తుండగా గ్రామంలో టైర్ పంక్చర్ కోసం నిలిపి ఉంచిన బొగ్గు టిప్పర్‌ను వెనుక నుంచి ఢీకొన్నాడు. తీవ్రగాయాలైన గణేష్‌ను పెనుబల్లి ఏరియా వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో ఒకరికి తీవ్ర గాయం
తల్లాడ: తల్లాడ బస్టాండ్ సమీపంలోని రాష్ట్రీయ ప్రధాన రహదారిలో మంగళవారం టీవీఎస్ మోపెడ్‌ను ఆవు తగలడంతో అదుపుతప్పి కిందపడిన ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. తల్లాడకు చెందిన తలారి నాగభూషణం టీవీఎస్ మోపెడ్‌పై బస్టాండ్ సెంటర్ నుంచి ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా ఆవు అడ్డువచ్చి తగిలింది. నాగభూషణంను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.