అలంకారప్రాయంగా కల్లూరు రెవెన్యూ డివిజన్‌

ABN , First Publish Date - 2020-12-28T04:28:59+05:30 IST

కల్లూరులో రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఈ డివిజన్‌కు అనుబంధంగా ప్రభుత్వం తరపున ఏర్పాటుకావాల్సిన కార్యాలయాలు నేటివరకు అందుబాటులోకి రాని పరిస్థితి.

అలంకారప్రాయంగా కల్లూరు రెవెన్యూ డివిజన్‌
కల్లూరు రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం

ఏర్పాటు కాని అనుబంధశాఖల కార్యాలయాలు 

 రెవెన్యూశాఖకే పరిమితమైన డివిజన్‌

కల్లూరు, డిసెంబరు 27: కల్లూరులో రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఈ డివిజన్‌కు అనుబంధంగా ప్రభుత్వం తరపున ఏర్పాటుకావాల్సిన కార్యాలయాలు నేటివరకు అందుబాటులోకి రాని పరిస్థితి. దీంతో ఈ డివిజన్‌ కార్యాలయం అలంకారప్రాయంగా మారింది. కల్లూరులో అఖిలపక్ష నాయకుల పోరాటాల ఫలితంగా స్పందించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2016నవంబరులో పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా అప్పట్లో జిల్లాకేంద్రాలు, డివిజన్‌ కేంద్రాలను ఏర్పాటుచేసింది. అందులో భాగంగానే కల్లూరులో డివిజన్‌ కార్యాలయం ఏర్పాటైంది. దీంతోపాటుగా పలు శాఖలకు సంబంధించి డివిజన్‌, సబ్‌డివిజన్‌ కార్యాలయాలు కూడా అప్పట్లో మంజూరయ్యాయి. వాటిని ఏర్పాటుచేసే క్రమంలో ఆయాశాఖల ఉన్నతాధికారులు కూడా ఇక్కడ భవనాలను కూడా పరిశీలించారు. కల్లూరుకు మంజూరైన సబ్‌ట్రెజరీ కార్యాలయం వేరే నియోజకవర్గ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధి ఒకరు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ఇక్కడ మంజూరైన కార్యాలయాన్ని అక్కడకు తరలించారు. ఇంకను వివిధ కార్యాలయాలను ఏర్పాటుచేసే క్రమంలో ఈ ప్రాంతం నుంచి ప్రాతినిథ్యం వహించిన కేంద్ర, రాష్ట్రస్థాయిలోని ప్రజాప్రతినిధులు ఇవన్నీ పట్టించుకోకపోవడంతో ఆయా కార్యాలయాలు ఇప్పటికీ కల్లూరు డివిజన్‌ పేరుమీదుగా కొనసాగుతున్నాయి. ఈప్రాంత ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకున్న అఖిలపక్ష నాయకులు తమ గళం విప్పి పోరాటం చేయగా రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం మాత్రమే ఏర్పాటైంది. ఈ కార్యాలయ ప్రారంభమైన సమయంలో నాటి మంత్రి తుమ్మల అనుబంధ కార్యాలయాల ఏర్పాటుపై హామీ కూడా ఇచ్చారు. ప్రభుత్వం ప్రజలకు పరిపాలన వికేంద్రీకరణ చేయాలనే లక్ష్యంతో ఏర్పాటైన డివిజన్‌ కార్యాలయం లక్ష్యానికి తూట్లు పొడిచినట్లుగా అయింది. వ్యవసాయ, వ్యాపార, వర్తకరంగంలో అభివృద్ధి చెందిన కల్లూరు పట్టణంలో భౌతిక, సామాజిక ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా ప్రభుత్వం అనుబంధశాఖల కార్యాలయాలను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఈ డివిజన్‌ కోసం ప్రభుత్వంపై పోరాడి ఉద్యమం చేసిన ప్రజాప్రతినిధులు అధికార పార్టీలో కొనసాగుతున్నప్పటికీ డివిజన్‌ విస్తరణపై నోరుమెదపని పరిస్థితి నెలకొన్నదని ప్రజల్లో సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. విపక్షాల ఆధ్వర్యంలో పట్టువదలని రీతిలో తిరిగి అనుబంధ కార్యాలయాల ఏర్పాటుపై తమ కార్యాచరణను కొనసాగిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రజాప్రతినిధులను కలుసుకొని వినతిపత్రాలు అందిస్తున్నారు. ఇప్పటికైనా పైస్థాయిలో ప్రజాప్రతినిధులు స్పందించి డివిజన్‌ విస్తరణ అనుబంధ కార్యాలయాల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


డివిజన్‌ సాధించినా ఫలితం లేదు

 పెద్దబోయిన దుర్గాప్రసాద్‌, విపక్ష నాయకుడు


అఖిలపక్షాల పోరాట ఫలితంగానే కల్లూరులో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు సాధ్యమైంది. ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా దీన్ని ఏర్పాటుచేశారు. కానీ అనుబంధ కార్యాలయాలు ఏర్పాటుచేయకపోవడంతో అలంకారప్రాయంగా మారింది. కల్లూరు డివిజన్‌ పేరుతో మంజూరైన కార్యాలయాలు వేరే ప్రాంతంలో కొనసాగుతున్నాయి. ఇవి ఎంతవరకు సమర్థనీయం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కల్లూరులో అనుబంధశాఖల కార్యాలయాలను ఏర్పాటుచేయాలి.


Updated Date - 2020-12-28T04:28:59+05:30 IST