రి‘లీవ్‌’ కావట్లే..!

ABN , First Publish Date - 2020-06-23T10:26:54+05:30 IST

ఖమ్మం జిల్లా పోలీసు శాఖలో సీపీ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఆయన నిర్ణయం అటాచ్‌మెంట్‌ ఉత్తర్వులకే

రి‘లీవ్‌’ కావట్లే..!

పోలీసుశాఖలో పాతుకుపోయిన సిబ్బంది

వేరేచోటుకి అటాచ్‌ చేసినా కదలనివైనం

ఉత్తర్వులు లేకున్నా యథాస్థానంలో విధులు

రిపోర్టుచేసి మళ్లీ అదేస్టేషన్‌లో దందా


ఖమ్మం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా పోలీసు శాఖలో సీపీ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఆయన నిర్ణయం అటాచ్‌మెంట్‌ ఉత్తర్వులకే పరిమితమవుతుండగా.. వాటిని కూడా పాటించని సిబ్బంది చాలామంది ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  గతంలో, ఇటీవల కాలంలో కమిషనరేట్‌ పరిధిలో జరిగిన అటాచ్‌మెంట్లలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, ఎన్నో ఏళ్లుగా ఒక్కచోటే తిష్టవేసుకున్న సిబ్బంది ఉన్నారు. అయితే ఆయా అటాచ్‌మెంట్ల జాబితాలో ఉన్నవారు మాత్రం తాము ఉన్న స్టేషన్లనుంచి రి‘లీవ్‌’ కావట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


‘పోలీసు సిబ్బంది అవినీతి ఆరోపణలకు గురైతే సహించేది లేదు. సిబ్బంది హద్దు మీరకుండా అవినీతి ఆరోపణలు దూరంగా ఉండాలి..’ ఇవి సాక్షాత్తు పోలీసు కమిషనర్‌ చెప్పిన మాటలు. ఆ మాటలకు అనుగుణంగానే డీజీ ఉత్తర్వుల మేరకు గతంలో జిల్లాలో పలు ప్రాంతాల్లో పనిచేస్తున్న సుమారు 100 మంది కానిస్టేబుళ్లను కమిషనరేట్‌ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలా అటాచ్‌ చేసిన వారిలో ఎస్‌ఐలు, ఐడీ పార్టీ సిబ్బంది ఉండగా.. వారిలో ఏళ్ల కొద్దీ ఒకే చోట పాతుకుపోయినవారు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారున్నారు. ఇటీవల కూడా అదేరకమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మరికొందరు సిబ్బందిని కూడా ఆయన సీపీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు. కానీ వారిలో సగానికిపైగా సిబ్బంది సంబంధిత స్థానాల్లో రిపోర్టు చేయడంలేదని, కొందరు చేసినా పాత స్థానాల్లోనే విధులు నిర్వర్తిస్తున్నారని, పనిచేసిన స్టేషన్లను అంటిపెట్టుకుని, అక్కడినుంచి కదలడంలేదని ఆ శాఖలోనే చర్చ జరుగుతోంది. 


అటాచ్‌మెంట్‌ అయినా అక్కడే తిష్ట

జిల్లా పోలీసు శాఖలో ఏదైనా ఆరోపణలు వచ్చిన సమయంలో ఆయా సిబ్బందిని వేరేస్థానానికి అటాచ్‌ చేస్తూ ఉంటారు. కానీ అటాచ్‌మెంట్‌ అయినా కొందరు సిబ్బందిమాత్రం అక్కడే తిష్ట వేస్తున్నట్టు సమాచారం. కొందరు సిబ్బంది పదుల ఏళ్ల సర్వీసు వరకు ఒకేచోట పనిచేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు ఒకవేళ ఎక్కడికైనా బదిలీ అయినా అక్కడకు వెళ్లి రిపోర్టుచేసి వెంటనే తిరిగి పాతస్థానంలోనే విధులు నిర్వర్తిస్తూ.. మరికొందరు ఒకటి రెండేళ్ల మినహా బయట చేసి మళ్లీ అదే స్థానానికి బదిలీ చేయించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకొందరు అయితే సాధారణ బదిలీల్లో వేరేప్రాంతాలకు వెళ్లాల్సి ఉన్నా రిలీవ్‌ కాకపోవడం వెనుక కారణాలేంటనే విషయం ఇటీవల సీపీ చేసిన అటాచ్‌మెంట్లతో చర్చనీయాంశంగా మారింది. ఇంకొన్ని చోట్ల ఉన్న సిబ్బంది సర్వీసు రికార్డుల్లో తప్పులు చూపించి జిల్లా బాస్‌ను పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


మామూళ్లు వారికి మామూలేనా?

అలా రిలీవ్‌ కాకుండా పాతస్థానాల్లో విధులు నిర్వర్తించే వారిలో బయట కొందరు వ్యాపారుల నుంచి  నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు జీరో బిజినెస్‌ చేస్తున్న వారినుంచి కూడా నెలవారీగా సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు అందిస్తున్నారన్న ఆరోపణలు లేకపోవు. అంతేకాదు కొందరయితే మందు విందు కూడా ఏర్పాటు చేసేస్థాయిలో ఆగడాలు సాగిస్తున్నారని సమాచారం. దాంతో వారిని రిలీవ్‌ చేసేందుకు సంబంధిత అధికారులు కూడా ఆసక్తి చూపడంలేదని, ఫలితంగా వారు తాము పనిచేస్తున్న స్థానాల్లోనే తిష్టవేసినట్టు తెలుస్తోంది.


అంతేకాదు మరికొందరు అధికారులు కూడా వారికి పైరవీలు చేసి తమ వద్ద పెట్టుకుంటుండంతో వారు ఆడిందేఆట పాడిందేపాటగా తయారైందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అలాంటివారిలో కొందరు స్టేషన్లలో వచ్చిన కేసుల్లో పేర్లు మార్చి కోర్టులో హాజరుపర్చడంలో దిట్టలుగా మారారన్న వాదన వినిపిస్తోంది. గతంలో, ఇటీవల కాలంలో అటాచ్‌మెంట్‌ చేసిన సిబ్బంది సర్వీసు బుక్స్‌ పరిశీలిస్తే చేస్తే అసలు బాగోతాలు బయట పడతాయని శాఖలోని కొందరు సిబ్బంది చెబుతుండటం గమనార్హం. 

Read more