కోటిన్నర విలువైన ఎర్రమట్టి దోపిడీ

ABN , First Publish Date - 2020-12-30T05:06:26+05:30 IST

దమ్మపేటకు చెందిన కొందరు వ్యక్తులు సుమారు రూ. కోటిన్నర విలువైన ఎర్రమట్టిని అక్రమంగా తరలించుకొని పోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కోటిన్నర విలువైన ఎర్రమట్టి దోపిడీ
క్వారీని పరిశీలిస్తున్న మైనింగ్‌, రెవిన్యూ అధికారులు

రెండు ఎక్స్‌కవేటర్లు, 40 ట్రాక్టర్లతో మట్టి తోలకం

విచారణకు ఆదేశించిన కలెక్టర్‌

క్వారీని పరిశీలించిన తహసీల్దార్‌, మైనింగ్‌ అధికారులు

అశ్వారావుపేట, డిసెంబరు 29: దమ్మపేటకు చెందిన కొందరు వ్యక్తులు సుమారు రూ. కోటిన్నర విలువైన ఎర్రమట్టిని అక్రమంగా తరలించుకొని పోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దమ్మపేటకు చెందిన ఓ వ్యక్తికి చెందిన రెండు ఎక్స్‌కవేటర్లు, 40 ట్రాక్టర్‌లలో ఐదు రోజుల పాటు రాత్రి సమయంలో సుమారు 1400 ట్రక్కుల ట్రాక్టర్‌ల మట్టిని అక్రమంగా తరలించారు. అక్రమంగా తోలిన మట్టి అంతా  దమ్మపేట మండలంలోని ప్రైవేటు నర్సరీలకు వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని దోపిడి చేసిన సంఘటన వెలుగులోకి రావడంతో జిల్లా కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు.

క్వారీని పరిశీలించిన మైనింగ్‌, రెవిన్యూ అధికారులు

 అక్రమంగా మట్టిని భారీ ఎత్తున తోలుకొని పోయిన విషయం వెలుగులోకి రావడంతో కలెక్టర్‌ ఆదేశాలమేరకు అశ్వారావుపేట తహసీల్దార్‌ చల్ల ప్రసాదరావు, మైనింగ్‌ టెక్నికల్‌ అధికారి శోభరాణి మట్టిని తోలిన క్వారీని పరిశీలించారు. అక్రమంగా మట్టిని తోలినవారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడంతో పాటు, నర్సరీలకు నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ ప్రసాద్‌ తెలిపారు. క్వారీ కొలతలను అనుసరించి విలువను లెక్కించి, జరిమానా వసూలు చేస్తామని మైనింగ్‌శాఖ టెక్నికల్‌ అసిస్టెంట్‌ శోభరాణి తెలిపారు.  

Updated Date - 2020-12-30T05:06:26+05:30 IST