రెడ్ సిగ్నల్
ABN , First Publish Date - 2020-05-09T10:23:18+05:30 IST
భద్రాచలం వద్ద ఏపీ సరిహద్దుల్లో వలస కూలీల అడ్డగింత కొనసాగుతోంది. శుక్రవారం మరోసారి ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు వెళ్తున్న వలస
ఏపీ సరిహద్దులో వలస కూలీల అడ్డగింత
మండుటెండలో జాతీయ రహదారిపై ఆదివాసీల బైఠాయింపు
పత్రాలు లేవనే కారణంతో అనుమతి నిరాకరణ
తెలంగాణ ఆధికారుల చొరవతో సమస్య పరిష్కారం
భద్రాచలం, మే 8: భద్రాచలం వద్ద ఏపీ సరిహద్దుల్లో వలస కూలీల అడ్డగింత కొనసాగుతోంది. శుక్రవారం మరోసారి ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు వెళ్తున్న వలస ఆదివాసీ కూలీలను ఏపీ అధికారులు అడ్డగించారు. తెలంగాణకు సరిహద్దులో ఏపీలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా యటపాక మండలం కొల్లుగూడెం వద్ద ఆదివాసీల రాకను ఏపీ అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. దీంతో వలస ఆదివాసీ కూలీలు విజయవాడ-జగదల్‌పూర్ జాతీయ రహదారిపై వారు బైఠాయించారు. గమ్యస్థానాలకు చేరేందుకు అనుమతించాలని అధికారులను వేడుకున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో తాగేందుకు నీరు సైతం లేకపోవడంతో ఈ విషయం తెలిసి జేడీ ఫౌండేషన్ ప్రతినిధులు చల్లటి నీటిని, బిస్కెట్లు వారికి అందజేశారు. ఈ విషయంపై తెలంగాణ అధికారులు.. ఆంధ్రా అధికారులతో మాట్లాడటంతో వలస ఆదివాసీ కూలీలు గమ్యస్థానాలకు వెళ్లేందుకు మార్గం సుగమం అయ్యింది.
ఎవరికి పట్టదా
ఆటోల్లో ఐదుగురు నుంచి ఆరుగురిని భద్రాచలం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని కుంటకు యథేచ్ఛగా తరలిస్తున్నా ప్రశ్నించే వారు, అడ్డుకునే వారు లేకపోవడం బాధాకరమని భద్రాద్రి వాసులువాపోతున్నారు. ఆటోల్లో వలస ఆదివాసీ కార్మికులను తరలిస్తున్న క్రమంలో అందులో ఎవరికైనా కరోనా పాజిటివ్ లక్షణాలుంటే ఆటో డ్రైవరుతో పాటు ఇతరుల పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.