వైద్యశాఖలో ‘ఆర్‌బీఎస్‌కే’ లొల్లి
ABN , First Publish Date - 2020-09-22T05:37:45+05:30 IST
ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే.. మరో వైపు ఖమ్మం జిల్లా వైద్యశాఖలో రాజుకున్న వాహనాల వివాదం మానవహక్కల
ఆ ఐదు వాహనాల నిర్వహణపై ఆరోపణలు
కొవిడ్ విధుల కేటాయింపుపై విమర్శలు
మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన వాహనదారులు
వచ్చేనెల 19న హాజరుకావాలని ఖమ్మం కలెక్టర్, డీఎంహెచ్‌వోకు నోటీసులు
ఖమ్మం సంక్షేమవిభాగం, సెప్టెంబరు 21 : ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే.. మరో వైపు ఖమ్మం జిల్లా వైద్యశాఖలో రాజుకున్న వాహనాల వివాదం మానవహక్కల కమిషన్ వరకు వెళ్లింది. సకాలంలో బిల్లులు ఇవ్వటం లేదని, వాహనాల నిర్వహణలో నిబంధనలు పాటించటం లేదని వాహనాల యజమానులు ఆరోపిస్తున్నారు. కానీ తాము నిబంధనలు, కలెక్టర్ ఆదేశాల ప్రకారమే వాహనాలను వినియోగిస్తున్నామని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరీక్షలకు ఆర్‌బీఎస్‌కే..
పాఠశాల స్థాయిలోని బాలబాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి ఉన్న వ్యాధులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే) సంచార ఆరోగ్య బృందాలను 2016లో ఏర్పాటు చేసింది. జిల్లాలో ఆర్‌బీఎస్‌కే విధులు నిర్వహణకు 12వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్‌బీఎస్‌కే వాహనాల ద్వారా పాఠశాలల్లో ఉన్న బాలబాలికలకు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు ప్రతీ వాహనంలో ఇద్దరు డాక్టర్లు, ఒక ఫార్మసిస్టు, ఒక ఏఎన్‌ఎంతో బృందం ఏర్పాటు చేశారు. రెండు మండలాలకు ఒక వాహనం చొప్పున కేటాయించారు.
వైద్యశాఖ పరిధిలోని వాహనాలతో లొల్లి..
ఖమ్మం జిల్లాలోని ఆర్‌బీఎస్‌కేలో నిర్వహణలో ఉన్న 12వాహనాల్లో ఐదు వాహనాలు జిల్లా వైద్యఆరోగ్యశాఖ పరిధిలో ఉండగా.. పలు హోదాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు వారి బంధువుల పేరిట నిర్వహిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే జిల్లాలో కరోనా కేసులు నమోదైన తర్వాత ఆర్‌బీఎస్‌కేలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, నర్సింగ్ ఉద్యోగులకు కొవిడ్ కేర్ సెంటర్లలో విధులు కేటాయించారు. వాహనాలు మాత్రం ఖాళీగా ఉండటంతో ఆర్‌బీఎస్‌కే వాహనాలను కూడా కొవిడ్ వైద్యసేవలు వినియోగించలని కలెక్టర్ కర్ణన్ సూచించారు. ఇక్కడే లొల్లి మొదలైంది. కొవిడ్ విధులు నిర్వహించాల్సిన 12ఆర్‌బీఎస్‌కే వాహనాలకు ఒకే విధమైన విధులు వేయటం లేదని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు.
కొవిడ్ విధులు నిర్వహించే వాహనాలు అవసరాన్ని బట్టి హైదరాబాద్ వెళ్లి కొవిడ్-19 కిట్లు, మందులు, ఇతర సామగ్రి తీసుకరావాల్సి ఉంటుంది. హైదరాబాద్ వెళ్లిన వాహనాలకు టోల్‌గేట్ ఖర్చులు కూడా ఇవ్వటం లేదు. ఇదిలా ఉంటే ఆ ఐదు వాహనాలకు హైదరాబాద్ వెళ్లేందుకు విధులు కేటాయించలేదు. పైగా ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఆరు నెలల పాటు ఆర్‌బీఎస్‌కే వాహనాలకు బిల్లులు చెల్లించలేదు. బిల్లుల కోసం వెళ్లిన వాహన యజమానులను అధికారులు కనీసం మాట్లాడేందుకు అనుమతి ఇవ్వటం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మానవ హక్కుల కమిషన్ నోటీసులు
ఆర్‌బీఎస్‌కే వాహనాలకు చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వడం లేదని, నిబంధనల మేరకు ఆర్‌బీఎస్‌కే వాహనాల నిర్వహణ చేయటం లేదని ఆర్‌బీఎస్‌కే వాహన యజమానుల సంఘం అధ్వర్యంలో రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో స్పందించిన కమిషన్ ఆక్టోబరు 19న హాజరు కావాలని కలెక్టర్ కర్ణన్, రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ కమిషనర్‌కు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతికు నోటీసులు ఇచ్చారు. దీంతో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనే వైద్యశాఖలో వాహనాల లొల్లి విమర్శలకు దారితీసింది.
నిబందనల మేరకు విధులు..అలివేలు, ఆర్‌బీఎస్‌కే ఖమ్మం జిల్లా సమన్వయకర్త
జిల్లాలో నిబంధనల మేరకు ఇప్పటివరకు ఆర్‌బీఎస్‌కే వాహనాలను వినియోగిస్తున్నాం. ఆర్‌బీఎస్‌కే వైద్యసేవల నిలుపుదలతో కలెక్టర్ కర్ణన్ ఆదేశాల మేరకు వాహనాలను కరోనా విధులకు కేటాయించాం. వాహనాల నిర్వహణలో ఎలాంటి వివక్ష, దుర్వినియోగం లేదు. బిల్లులు కూడా వారం రోజుల్లోగా బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి.