రైతు వేదికలు పూర్తయ్యాయి..

ABN , First Publish Date - 2020-11-26T04:28:21+05:30 IST

రైతులను సంఘటితం చేసి.. సాగుబాటలో అనుక్షణం అండగా ఉండే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రైతువేదికల నిర్మాణాలు ఉమ్మడి జిల్లాలో పూర్తయ్యాయని పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ జి.సీతారాములు పేర్కొన్నారు.

రైతు వేదికలు పూర్తయ్యాయి..
పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ జి.సీతారాములు

పీఎంజీఎస్‌వై కింద రోడ్లకు మళ్లీ ప్రతిపాదనలు

నెలాఖరులోగా అందుబాటులోకి వైకుంఠధామాలు

‘ఆంధ్రజ్యోతి’తో పీఆర్‌  ఉమ్మడిజిల్లాఎస్‌ఈ సీతారాములు

ఖమ్మం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : రైతులను సంఘటితం చేసి.. సాగుబాటలో అనుక్షణం అండగా ఉండే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రైతువేదికల నిర్మాణాలు ఉమ్మడి జిల్లాలో పూర్తయ్యాయని పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ జి.సీతారాములు పేర్కొన్నారు. ఆయన తన శాఖ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను బుధవారం ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. వైకుంఠధామాల నిర్మాణాలు కూడా చురుగ్గా సాగుతున్నాయని, త్వరలోనే ఇవి ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇక పీఎంజీఎస్‌వై కింద మళ్లీ కొత్తగా రహదారులకు ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. పలు అంశాలపై ఆయన జరపిన సంభాషణ ఆయన మాటల్లో.. 

ఆంధ్రజ్యోతి: రైతువేదికల నిర్మాణాల పరిస్థితి ఏంటి? 

ఎస్‌ఈ: ఉమ్మడి జిల్లాలో రైతు వేదికల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. కొన్నిచోట్ల మిగులు పనులు ఉండగా.. వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నాం. ఖమ్మం జిల్లాలో రూ.28.30కోట్లతో 129 రైతువేదికలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.14.70కోట్లతో 67 రైతువేదికలు నిర్మించాం. ఒక్కో రైతువేదికకు సుమారు రూ.22లక్షలు ఖర్చుచేశాం. వీటిలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు కూడా వినియోగించాం. దశలవారీగా అన్ని రైతువేదికలను ప్రారంభించి రైతులకు సేవలు అందించనున్నాం. 

ఆంధ్రజ్యోతి: పీఎంజీఎస్‌వై కింద రహదారులకు నిధులు రాకపోవడానికి కారణం?

ఎస్‌ఈ: జిల్లాలో పీఎంజీఎస్‌వై కింద ప్రతిపాదనలు చేసి సాంకేతిక అనుమతుల కోసం వరంగల్‌ నిట్‌కు పంపాం. అక్కడ జరిగిన జాప్యంతో నిధులు మంజూరుకాలేదు. భద్రాద్రి జిల్లాకు సంబంధించిన ప్రతిపాదనలు జేఎన్‌టీయూ టెక్నికల్‌ కమిటీకి పంపడంతో అక్కడ త్వరగా పరిశీలించి మంజూరు చేశారు. దీంతో ఆజిల్లాలో పీఎంజీఎస్‌వై రహదారుల పనులు మొదలయ్యాయి. ఖమ్మంజిల్లాకు సంబంధించి మళ్లీ ప్రతిపాదనలు చేస్తున్నాం. 

ఆంధ్రజ్యోతి: ఉమ్మడి జిల్లాలో పంచాయతీరాజ్‌ పరిధిలో ఎన్ని రహదారులున్నాయి?

ఎస్‌ఈ: ఖమ్మం జిల్లా పరిధిలో మొత్తం 2730కి.మీ. మేర 1,061 రహదారులు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 2,416కి.మీ. మేర 809 రహదారులున్నాయి. వీటిలో కొన్ని బీటీ కాగా మరికొన్ని మట్టిరోడ్డు ఉన్నాయి. 

ఆంధ్రజ్యోతి: ఇటీవల వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రహదారులకు నిధులొచ్చాయా? 

ఎస్‌ఈ: ఇటీవల పడిన భారీ వానలు, వచ్చిన వరదలతో ఉమ్మడి జిల్లాలోని పలు రహదారులు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. దీంతో వీటి మరమ్మతుల కోసం రూ.37.76కోట్లతో ప్రతిపాదనలు పంపాం. ఇందులో భద్రాద్రి జిల్లాలో రూ.31.71కోట్లు, ఖమ్మంజిల్లాలో రూ.5.71కోట్లు అంచనా వేశాం. 

ఆంధ్రజ్యోతి: వైకుంఠధామాల పనులు ఎప్పటిలోగా పూర్తయ్యే అవకాశాలున్నాయు? 

ఎస్‌ఈ: ఉమ్మడి ఖమ్మంజిల్లాలో వైకుంఠధామాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెలాఖరులోగా అన్ని గ్రామ పంచాయతీల్లో పనులు పూర్తిచేస్తాం. ఉమ్మడి జిల్లాలో రూ.96కోట్లతో మొత్తం 772శ్మశానావటికలను నిర్మిస్తున్నాం. ఇందులో ఖమ్మంజిల్లాలో 388, భద్రాద్రి జిల్లాలో 384 శ్మశానవాటికలున్నాయి. గతంలోలా కాకుండా కొత్త శ్మశానవాటికల్లో అన్ని వసతులు సమకూరుస్తున్నాం. వీటి కోసం ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులను వెచ్చిస్తున్నాం. 

Updated Date - 2020-11-26T04:28:21+05:30 IST