ఇరుజిల్లాల్లో ముసురు
ABN , First Publish Date - 2020-11-27T05:08:19+05:30 IST
నివర్ తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం ఉదయం నుంచి పలు చోట్ల జల్లులు పడుతున్నాయి. కొన్ని చోట్ల మబ్బులు కమ్ముకుని ఉండడం, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం పడుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
‘నివర్’ ప్రభావంతో పలు చోట్ల వర్షం
పంటలు నష్టపోతామోనన్న ఆందోళనలో రైతులు
స్తంభించిన ధాన్యం కొనుగోళ్లు
ఖమ్మం/ కొత్తగూడెం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : నివర్ తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం ఉదయం నుంచి పలు చోట్ల జల్లులు పడుతున్నాయి. కొన్ని చోట్ల మబ్బులు కమ్ముకుని ఉండడం, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం పడుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంటలు చేతికి వచ్చే సమయంలో పడుతున్న ఈవర్షం మరింత పెరిగితే తీవ్రంగా నష్టపోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండునెలల క్రితం పడిన భారీ వర్షాలతో సుమారు 1.20లక్షల ఎకరాలకుపైగా పంటలు దెబ్బతినగా.. రైతులు రూ.50కోట్లకుపైగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో మళ్లీ నివర్ తుఫాన్ ఉధృతమై.. భారీ వర్షాలు పడితే చేలో పంటలు చేలోనే దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ఇరు జిల్లాల్లో ప్రస్తుత సీజన్‌లో వరి 3.30లక్షల ఎకరాలు, పత్తి 3.50లక్షలు, మిర్చి 65వేల ఎకరాలు, ఇతర పంటలు సుమారు 40వేల ఎకరాల్లో వేయగా.. వరి కోత దశలో, పత్తి తీత దశలో, మిర్చి పూత, కాత దశలో ఉన్నాయి. ఈ క్రమంలో భారీ వర్షాలు, గాలి ఉధృతంగా వీస్తే వరి నేలకు ఒరిగే పరిస్థితి ఉండగా, ధాన్యం తడిచి నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పలు చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లను ఆపేశారు. రైతులు కూడా ధాన్యాన్ని తెచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఇక పత్తి చెట్టుపైనే నీరుగారి రంగుమారే ప్రమాదం ఉందని, తద్వారా నాణ్యత దెబ్బతిని ధర తగ్గే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందతున్నారు. మిర్చితోటలు పూత, కాత ఉండగా.. వర్షాలు, చలిగాలులకు కాయ నాణ్యత దెబ్బతింటందని చెబుతున్నారు.