ఊరూరా కొనుగోలు కేంద్రాలు

ABN , First Publish Date - 2020-10-19T09:50:36+05:30 IST

అన్నదాతకు ఈ వానాకాలం వరిసాగుకు కలిసి వచ్చింది. అదనుగా వర్షాలు పడడంతో పంట దిగుబడి ఆశాజనకంగా వస్తుందని భావిస్తున్నారు.

ఊరూరా కొనుగోలు కేంద్రాలు

ఇరు జిల్లాల్లో 6లక్షల 60వేల మెట్రిక్‌ టన్నుల ధాన ్యం సేకరణ లక్ష్యం

రైతుల వివరాలన్నీ ఆన్‌లైన్‌లోనే.. 48 గంటల్లోనే చెల్లింపులు

ధాన్యం రవాణాకు ప్రత్యేక చర్యలు

అక్టోబరు చివరి వారం నుంచి కొనుగోళ్లు

643  కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణకు సన్నాహాలు


కొత్తగూడెం/ఖమ్మం కలెక్టరేట్‌, అక్టోబరు 18:  అన్నదాతకు ఈ వానాకాలం వరిసాగుకు కలిసి వచ్చింది. అదనుగా వర్షాలు పడడంతో పంట దిగుబడి ఆశాజనకంగా వస్తుందని భావిస్తున్నారు. ఈ సారి అంచనాలకు మించి కూడా వరి సాగవ్వడంతో దిగుబడులు వస్తాయని వ్యవసాయశాఖ అంచనాలు వేస్తోంది. అయితే గత యాసంగిలో ప్రభుత్వం ప్రతీగ్రామం నుంచి ధాన్యం కొనుగోళ్లను చేపట్టి విజయవంతంగా నిర్వహించడంతో ఈ సారి వానాకాలంలోనూ రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజనూ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలో 438, భద్రాద్రి కొత్తగూడెంలో 205 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కలెక్టర్ల సారథ్యంలో ప్రతి గ్రామానికో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇవన్నీ దాదాపు  ఈనెలాఖరు నుంచి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.


దిగుబడి అంచనాలు ఇలా

ఖమ్మం జిల్లాలో వాస్తవానికి 2లక్షల83వేల713 ఎకరాల్లో వరి సాగు కావాల్సి ఉండగా మొత్తం 2లక్షల 83వేల713 ఎకరాల్లోనూ వరి సాగయ్యింది. ఎకరాకు 2.64 టన్నుల ధాన్యం ఉత్పత్తితో మెత్తంగా 7లక్షల 31వేల 696మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనాలు వేస్తున్నారు. వీటలో ఇతరత్రా అవసరాలు, ప్రైవేటు వ్యాపారులు విక్రయాలు మినహాయిస్తే 5లక్షల 60వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. వీటి నుంచి ప్రభుత్వం కనీసం 4లక్షల 60వే ల మెట్రిక్‌ టన్నులను సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నారు. 

 

438 కొనుగోలు కేంద్రాలు 

ఈ వానాకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కలెక్టర్‌ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్‌ ఎన్‌.మధుసూదన్‌ ఆధ్వర్యంలో  జిల్లా పౌరసరఫరాల సంస్థ సన్నాహాలు చేస్తోంది. జిల్లాలో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల, డీసీఎంఎస్‌, మార్కెట్‌కమిటీల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది 4లక్షల 60వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలన్న లక్ష్యంతో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబరు నెలాఖరు నుంచి  జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. 


మద ్దతు ధర ఇలా

ఏటా ప్రభుత్వం పంటలకు మద్దతు ధరను ప్రకటిస్తుంది. ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో క్వింటాకు ఏ గ్రేడ్‌ రకం రూ.1888కి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. గతేడాది క్వింటాకు రూ 1835 కొనుగోలు చేసింది. జిల్లాలో కొనుగోలు చేసే ధాన్యానికి కోటి 15లక్షల గన్నీ సంచులు అవసరం ఉంటుందని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనాలు వేశారు. వీటిలో కొత్తవి 62లక్షల 10వేలు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే సిద్దంగా ఉన్నవి 52లక్షల 90వేలు గోదాముల్లో నిల్వ ఉన్నాయి.రేషన్‌ దుకాణాల నుంచి 1లక్ష 57వేల 064 సేకరించాలని నిర్ణయించారు. మొత్తంగా 57లక్షల 6706 గన్నీ సంచులు జిల్లాకు సరఫరా కావాల్సి ఉంది.


ఆన్‌లైన్‌ద్వారానే రైతుల వివరాలు

 ఈ ఏడాది కొనుగోలు కేంద్రాల్లో రైతుల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు.  కేంద్రానికి తీసుకొచ్చిన రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయగానే ఆ రైతు వివరాలతో పాటు మిల్లుకు రవాణా చేసే కాంట్రాక్టర్‌, వాహనం వివరాలను కొనుగోల కేంద్రం ఇన్‌చార్జ్‌ ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. క్షణాల్లో ఆ వివరాలన్నీ జిల్లా కేంద్రానికి చేరుకుంటాయి. వీటికోసం 12 మంది సాంకేతిక సిబ్బందిని ఇప్పటికే నియమించారు.  దీంతో ఆ రైతులకు బ్యాంకు ఖాతాల్లో 48 గంటల్లో చెల్లింపులు చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు సరఫరా చేసేందుకు ఎనిమిది ఏజెన్సీల ద్వారా 400 వాహనాలను సిద్ధంంగా ఉంచుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో అటు రైతులు, ఇటు సిబ్బంది ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు చేపడుతున్నారు. 


కొనుగోళ్లకు అంతా సిద్ధ..సోములు, జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌, ఖమ్మం

జిల్లాలో వానాకాలం సాగయిన ధాన్యాన్ని సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెలాఖరు నుంచి ప్రారంభించనున్నాం. జిల్లాలో 438 కొనుగోలు కేంద్రాలకు వైరా, సత్తుపల్లి, ముత్తగూడెం, మధిర మార్కెట్‌ గోదాముల్లో ఽధాన్యాన్ని నిల్వచేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అవసరమైన 57లక్షల 68వేల గన్నీ సంచులు అవసరం ఉంటుంది. కొత్త సంచులు, కొనుగోలుకు ప్రతిపాదనలు పంపించాం. త్వరలో జిల్లాకు చేరుకోనున్నాయి. కొనుగోలు  ధాన్యాన్ని మిల్లర్లకు సరఫరా చేసేందుకు టెండర్లు పూర్తిచేశాం.  రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. 


భద్రాద్రి జిల్లాలో 205 కేంద్రాలు

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వం 205 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు లక్ష్యంగా పెట్టుకుంది.  ఆళ్లపల్లి మండలంలో  రెండు  కొనుగోలు కేంద్రాలు, అన్నపురెడ్డిపల్లి మండలంలో ఏడు అశ్వాపురం మండలంలో 13 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.  అశ్వారావుపేట మండలంలో 11, భద్రాచలంలోని ఏఎంసీలో ఒక  కేంద్రం, బూర్గంపాడు మండలంలో 9 తొమ్మిది, చంద్రుగొండ మండలంలో ఆరు, చర్ల మండలంలో 31, చుంచుపల్లి మండలంలో ఐదు, దమ్మపేట మండలంలో 12 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించారు. దుమ్ముగూడెం మండలంలో 16, గుండాల మండలంలో మూడు, జూలూరుపాడు మండలంలో నాలుగు, కరకగూడెం మండలంలో తొమ్మిది, కొత్తగూడెం మండలంలో ఏఎంసీ కొత్తగూడెంలో ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.  లక్ష్మీదేవిపల్లి మండలంలో మూడు, మణుగూరు మండలంలో 10, ములకలపల్లి మండలంలో 15, పాల్వంచ మండలంలో తొమ్మిది కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించారు.  పినపాక మండలంలో 15, సుజాతనగర్‌ మండలంలో నాలుగు, టేకులపల్లి మండలంలో తొమ్మిది , ఇల్లెందు మండలంలో 10 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించారు.  

Updated Date - 2020-10-19T09:50:36+05:30 IST