ప్రాణంతో చెలగాటం వద్దు
ABN , First Publish Date - 2020-12-11T05:26:55+05:30 IST
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సెంట్రల్ కౌన్సిలర్ ఫర్ ఇండియన్ మెడిసిన్ 2020 గెజిట్ నోటిపికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు దేశ వ్యాప్తంగా బంద్ నిర్వహించాలని ఐఎంఏ పిలుపునిచ్చింది.

సీసీఐఎం 2020 గెజిట్‌కు వ్యతిరేకంగా నేడు ప్రైవేట్ ఆసుపత్రుల బంద్
సాయంత్రం 6గంటల వరకు వైద్యసేవల నిలిపివేత
కొవిడ్ వైద్యసేవలకు మినహాయింపు
ఖమ్మంసంక్షేమ విభాగం, డిసెంబరు 10: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సెంట్రల్ కౌన్సిలర్ ఫర్ ఇండియన్ మెడిసిన్ 2020 గెజిట్ నోటిపికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు దేశ వ్యాప్తంగా బంద్ నిర్వహించాలని ఐఎంఏ పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 500వరకు ప్రైవేట్ ఆసుపత్రులు నేడు బంద్ పాటిస్తున్నాయి. అందులో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం 6గంటల వరకు వైద్య సేవలను నిలిపివేయనున్నారు. అయితే కొవిడ్ వైద్య సేవలను మాత్రం యథావిధిగా కొనసాగిస్తారు.
సీసీఐఎం గెజిట్‌లో ఏముందంటే..
దేశంలో రోగులకు వైద్యసేవలు అందించేందుకు ఆయుర్వేదం పూర్వకాలం నుంచి అందుబాటులో ఉంది. తర్వాత అల్లోపతి వైద్యసేవలు గ్రామస్థాయి వరకు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆయుర్వేద వైద్యసేవలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సీపీఐఎం గెజిట్ నోటిపికేషన్‌ను గత నెలలో విడుదల చేసింది. ఈ నోటిపికేషన్ ప్రకారం ఆయుర్వేద వైద్య విద్య పూర్తి చేసిన వారు 58రకాల ఆపరేషన్లు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఐఎంఏ వాదన ఇలా..
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌తో 58రకాల ఆపరేషన్లు నిర్వహించే ఆయుర్వేద వైద్యులు అపరేషన్ తర్వాత అవగాహన లేకుండా అలోపతి మందులు ఇస్తే రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆరోపిస్తున్నారు. ఏ వైద్యశాస్త్రానిక ఉండే ప్రాముఖ్యత దానికే ఉంటుందని, ఆయుర్వేద వైద్యులు అపరేషన్ చేస్తే ఆయుర్వేద మందులే ఇవ్వాలని ఐఎంఏ వాదిస్తోంది. సీసీఐఎం గెజిట్ నోటిపికేషన్ రద్దు చేయాలని బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే కొవిడ్ వైద్యసేవలను మాత్రం సడలింపు ఇచ్చారు. కరోనా బాధితులకు సేవలు అందించాలని నిర్ణయించారు.
ప్రజల వైద్యసేవల కోసమే..
డాక్టర్ కూరపాటి ప్రదీప్‌కుమార్, ఐఎంఏ, జిల్లా కార్యదర్శి
ఎంబీబీఎస్ తర్వాత రెండు సంవత్సరాలు పీజీ పూర్తిచేసి మళ్లీ ప్రాక్టికల్స్ విజయవంతంగా నిర్వహించిన వైద్యులకు మాత్రమే అలోపతిలో అపరేషన్ నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. కానీ సీసీఐఎం గెజిట్ నోటిపికేషన్ ద్వారా ఆయుర్వేద వైద్యులు అపరేషన్ నిర్వహించేందుకు అర్హత కల్పించారు. ఇది రోగుల ప్రాణాలకు ముప్పు తెస్తుంది. ప్రజల ఆరోగ్యం కోసమే సీసీఐఎం గెజిట్‌ను వ్యతిరేకిస్తున్నాం. అందుకే నేడు ఐఎంఏ తరుపున ప్రైవేటు ఆసుపత్రుల బంద్ నిర్వహిస్తున్నాం.