భద్రాద్రి భేష్‌

ABN , First Publish Date - 2020-04-21T10:21:15+05:30 IST

కరోనా వైరస్‌ కట్టడి విషయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదర్శంగా నిలుస్తోంది.

భద్రాద్రి భేష్‌

కరోనా కట్టడిలో యంత్రాంగం సక్సెస్‌

జిల్లాలో జీరోకు చేరిన పాజిటివ్‌ కేసులు 

ఆసుపత్రులనుంచి నలుగురూ డిశ్చార్జ్‌

కలెక్టర్‌, ఎస్పీలను అభినందించిన కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి 

ప్రజలనుంచి వెల్లువెత్తుతున్న ప్రశంసలు


కొత్తగూడెం, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ కట్టడి విషయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదర్శంగా నిలుస్తోంది. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే రెండో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసు ఈ జిల్లాలోనే నమోదవ్వడంతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్పటినుంచి కట్టుదిట్టమైన చర్యలతో ఈ మహమ్మారి జిల్లాలో విస్తరించకుండా చేయడంతో కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, ఎస్పీ సునీల్‌దత్‌ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం విజయ వంతమైంది. కరోనా కట్టడి విషయంలో భద్రాద్రి జిల్లా యంత్రాంగం పనితీరును కేంద్రఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్‌అగర్వాల్‌ సైతం ప్రశంసించారు. 


విదేశాలనుంచే తొలికేసు..

భద్రాద్రి జిల్లాలో తొలికేసుగా విదేశాలనుంచి వచ్చిన మెడికల్‌ విద్యార్థిని నమోదైంది. అశ్వాపురం మండలానికి చెందిన సదరు విద్యార్థిని మార్చ్‌ మొదటి వారంలో జర్మనీనుంచి స్వస్థలానికి విచ్చేసింది. ఈ క్రమంలో ఆమె మార్చి 14తేదీన తొలి కరోనా పాజిటీవ్‌ కేసుగా నమోదైంది. ఆ తర్వాత మార్చి 22న ఈ జిల్లాలో రెండో పాజిటివ్‌ కేసు నమోదైంది. లండన్‌లో చదువుతూ స్వస్థలానికి విచ్చేసిన ఓ పోలీస్‌ అధికారి కుమారుడికి పాజిటివ్‌ రిపోర్టు రావడంతో హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ  తరువాత మార్చి 24న పోలీస్‌ అధికారికి వారి ఇంట్లో పనిచేసే వంటమనిషికి పాజిటీవ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలోనే నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదైన తొలిజిల్లాగా భద్రాదికొత్తగూడెం జిల్లా నిలవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఒకే ఇంట్లో మూడు పాజిటివ్‌ కేసులు రావడంతో సదరు పోలీసు అధికారికి సన్నిహితం ఉండే పోలీస్‌ సిబ్బంది, కుటుంబ సభ్యులు సుమారు 32మందికి పరీక్షలు  నిర్వహించారు.


వారందరీకి నెగెటివ్‌ రావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.  తరువాత జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టడంతో మార్చి 24నుంచి ఇంతర వరకు ఈ ల్లాల్లో మరో కొత్తకేసు నమోదు కాలేదు.  మొదట్లో నమోదైన నాలుగు పాజిటివ్‌ కేసులకు చికిత్స అనంతరం నెగెటివ్‌ రిపోర్టు రావడంతో వారిని డిశ్చార్జ్‌ చేశారు. జిల్లా నుంచి ఢిల్లీలోని మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లిన  10మందికి కూడా పరీక్షలు నిర్వహించగా వారికి నెగెటివ్‌ రిపోర్టు రావడంతో వారందరినీ ఇళ్లకు పంపించారు.


జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఇతర దేశాల నుంచి వచ్చినవారు వారి కుటుంబ సభ్యులను 243మందిని గుర్తించి వీరిలో 204మందిని 28రోజులపాటు హోమ్‌ క్వారంటైన్‌ చేశారు. వారి గడువు కూడా ముగిసింది. మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఐసోలేషన్‌ వార్డులుగా చేసి అక్కడే కొందరినీ క్వారంటైన్‌లో పర్యవేక్షించి ఇళ్లకు పంపించారు. 


తొలి లాక్‌డౌన్‌ జిల్లా..

కేంద్ర ప్రభుత్వం మొదట లాక్‌డౌన్‌ ప్రకటించిన 75 జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం ఉంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. కొత్తగూడెం పట్టణంలో ఒకే ఇంట్లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ రావడంతో అప్పట్లో కొత్తగూడెం పట్టణాన్ని కట్టడి ప్రాంతంగా, బఫర్‌ జోన్‌గా ప్రకటించారు. సుమారు మూడు నుంచి ఏడు కిలో మీటర్ల వరకు ఆయా ప్రాంతాల్లో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, పారిశుధ్య నిర్వహణ చర్యలు పూర్తిస్థాయిలో చేపట్టారు. మునిసిపల్‌ అధికారులు, జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ప్రతి రోజు క్లోరినేషన్‌, బ్లీచింగ్‌ తదితర పారిశుధ్య నిర్వహణ చర్యలతోపాటు ఆయా ప్రాంతాల్లో అనుమానితులుగా ఉన్న వారికి రక్తపు నమూనాల సేకరణ, పరీక్షలు చేశారు.


అధికార యంత్రాంగాన్ని కలెక్టర్‌ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎస్పీ సునీల్‌దత్‌ ఆధ్వర్యంలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేశారు. ఈ జిల్లా ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉండడంతో అక్కడినుంచి రాకపోకలను పక్కాగా నియంత్రించి వైరస్‌ దిగుమతి కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక మిగిలిన రోజుల్లోనూ లాక్‌డౌన్‌ను  పటిష్టంగా అమలు చేయాలని జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది.  


వలస కూలీలకు ఏర్పాట్లు

జిల్లాలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి వచ్చిన భారీగా వలస కూలీలు వరి, మిర్చి కోతలకు వచ్చారు. వారందరూ లాక్‌డౌన్‌తో ఇక్కడ చిక్కుకోవడంతో వారందరినీ ప్రత్యేక శిబిరాలకు తరలించి వసతులు కల్పించారు. ప్రభుత్వం నుంచి వారికి 12కిలోల బియ్యంతోపాటు రూ.500లు నగదు కూడా అందజేశారు. దీంతో కూలీలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థానికంగా పనులు చేస్తూ ఉంటున్నారు. 

 

అధికారులకు ప్రశంశలు

జిల్లాలో కరోనాను కట్టడి చేయడంలో భద్రాద్రి జిల్లా యంత్రాంగం విశేష కృషి చేస్తోంది. ఈ విషయంలో అధికారులు, ప్రజల మధ్య సమన్వయం కుదర్చడంలో జిల్లా కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి, ఎస్పీ సునీల్‌దత్‌ కృషిని పలువురు ప్రసంశిస్తున్నారు. వీరిద్దరూ పగలు, రాత్రి తేడా లేకుండా ఎప్పటికప్పుడు   మండలాలు, గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు ఈ వైరస్‌ పట్ల అవగాహన కల్పించారు. అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ ముందుకు సాగారు. వీరి కృషితో జిల్లా యంత్రాంగాన్ని కేంద్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం మే 7వ తేదీవరకు లాక్‌డౌన్‌ను పొడిగిండంతో ఈ రోజుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండేలా వీరు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు.


Updated Date - 2020-04-21T10:21:15+05:30 IST