నో ఎంట్రీ

ABN , First Publish Date - 2020-04-24T11:02:00+05:30 IST

ఏపీలోని కృష్ణా, పశ్చిమగోదావరి జిలాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సరిహద్దు గ్రామాలకు తీవ్ర

నో ఎంట్రీ

సరిహద్దులను మూసివేసిన పోలీసు అధికారులు

రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో బారికేడ్ల ఏర్పాట్లు

ఏ రూటులో వచ్చినా చెక్‌పోస్టు వద్దకు వచ్చేలా చర్యలు

ఏపీలో కరోనా విజృంభణతో అధికారుల కఠిన ఆంక్షలు


సత్తుపల్లి, ఏప్రిల్‌ 23 : ఏపీలోని కృష్ణా, పశ్చిమగోదావరి జిలాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సరిహద్దు గ్రామాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. ఈ క్రమంలో ఇరు జిల్లాల అధికారులు తెలుగురాష్ట్రాల సరిహద్దులను మూసివేసారు. గురువారం ఏపీ నుంచి తెలంగాణాలోకి వచ్చే రహదారులను గుర్తించి పూర్తిస్థాయిలో వాటిని దిగ్బంధించారు. దీంతో పాటు ఖమ్మం-భద్రాద్రికొత్తగూడెం జిల్లా సరిహద్దులను కూడా మూసివేసారు. ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాలు ఏపీలోని కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు సరిహద్దులో ఉండగా.. ఆ జిల్లాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కల్లూరు ఏసీపీ ఎన్‌.వెంకటేష్‌ ఆధ్వర్యంలో పలు కఠిన ఆంక్షలు విధించారు.


ఇప్పటి వరకూ అంతరాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టం చేసినా... పలు అడ్డదారుల్లో పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు రాకపోకలు సాగుతున్నాయి. ఈ క్రమంలో రెడ్‌జోన్‌లుగా ఆయా జిల్లాల రాకపోకలను నిలువరించేందుకు సత్తుపల్లి నియోజకవర్గ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు, కల్లూరు, తల్లాడ మండలాల నుంచి అన్ని దారులను మూసివేసారు. ఈక్రమంలోనే ఎవరు ఏ దారుల్లో ఎటువైపు నుంచి వచ్చినా.. చివరకు ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర చెక్‌పోస్టుల వద్దకు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. అలాగే పొరుగున ఉన్న భద్రాద్రి జిల్లా నుంచి వచ్చేవారికి కూడా పోలీసుల అనుమతులు తప్పనిసరి చేశారు.  


కూరగాయలు, పండ్ల వ్యాపారులకు అనుమతి లేదు....

ఏపీలోని పలు ప్రాంతాల నుంచి పండ్లు, కూరగాయల వ్యాపారులు పోలీసుల కళ్లుగప్పి అంతర్గత రహదారుల మీదుగా సత్తుపల్లి ప్రాంతానికి వస్తున్నారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాంతం నుంచి పుచ్చకాయ, జామ, సపోటా, కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతం నుంచి మామిడి, ఆకుకూరలు తెచ్చి సత్తుపల్లిలో విక్రయిస్తున్నారు. ఆయా జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు అధికంగా ఉన్న నేపథ్యంలో ఆంధ్రా నుంచి వ్యాపారులు రాకుండా కట్టడి చేసారు. అక్కడి నుంచి వ్యాపారులెవరైనా వచ్చి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సత్తుపల్లి మునిసిపల్‌ కమిషనర్‌ సుజాత ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. 


ప్రతీ ఒక్కరు సహకరించాలి..వెంకటేష్‌, ఏసీపీ, కల్లూరు

జిల్లాకు సరిహద్దున ఏపీలోని కృష్ణా, పశ్చిమగోదావరి జల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న దృష్ణా సరిహద్దులన్నింటినీ మూసేశాం. ఏపీ నుంచి వచ్చే వారు ప్రతీ ఒక్కరూ చెక్‌పోస్టు మీదుగా రావాల్సిందే. ఏ దారిలో వచ్చినా చివరకు చెక్‌పోస్టుల వద్దకు వచ్చేలా చర్యలు చేపట్టాం. అలాగే భద్రాద్రి జిల్లా సరిహద్దులను కూడా కట్టడి చేశాం. ఆయా జిల్లాల సరిహద్దుల్లోని రైతులు వ్యవసాయ పనులకు వెళ్లాల్సా ఉంటే వారు కూడా తప్పనిసరిగా పోలీసు శాఖ నుంచి  అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు గాను కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న యంత్రాంగానికి అందరూ సహకరించాలి. 


ఏపీ వ్యాపారులను ఆపేశాం..సుజాత, సత్తుపల్లి మునిసిపల్‌ కమిషనర్‌

సత్తుపల్లి పట్టణానికి పొరుగు రాష్ట్రమైన ఏపీలోని పలు ప్రాంతాల నుంచి పండ్లు, కూరగాయలు తెచ్చి విక్రయించే వారిని రావొద్దని ఇప్పటికే ఆదేశించాం. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చే మామిడి, కూరగాయల వ్యాపారులకు సత్తుపల్లి పట్టణంలోని రావొద్దని ఆదేశాలిచ్చాం. అలాగే స్థానికంగా పండ్లు, కూరగాయలు అమ్మే వారు కచ్చితంగా ఆధార్‌కార్డును దగ్గరపెట్టుకోవాలి. నిబంధనలు పాటించకుండా ఏపీ నుంచి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తెచ్చి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. 


Updated Date - 2020-04-24T11:02:00+05:30 IST