మావోయిస్టుల పేరుతో వసూళ్లు.. మెదక్‌ జిల్లాకు చెందిన ముగ్గురి అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-07-20T18:05:22+05:30 IST

మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌ సీఐ ఏ.రమాకాంత్‌, ఎస్‌ఐ గజ్జల నరేష్‌ విలేకరుల

మావోయిస్టుల పేరుతో వసూళ్లు.. మెదక్‌ జిల్లాకు చెందిన ముగ్గురి అరెస్ట్‌

రూ.2.80లక్షల నగదు, రెండు కార్లు, ఏయిర్‌ ఫిస్టల్‌, గన్‌లైటర్‌ స్వాధీనం


సత్తుపల్లిరూరల్‌(ఖమ్మం): మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌ సీఐ ఏ.రమాకాంత్‌, ఎస్‌ఐ గజ్జల నరేష్‌ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సత్తుపల్లి ఓసీ పరిధిలోని మహాలక్ష్మి ఓబీ క్యాంప్‌ మేనేజర్‌ జితేందర్‌ను మావోయిస్టు వీరన్న అలియాస్‌ లచ్చన దళం పేరుతో బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడినట్లు వచ్చిన సమాచారంతో కాల్‌డేటా, వెహికల్‌ నంబర్లు, సాంకేతిక వివరాల ఆధారంగా విచారణ నిర్వహించారు. ఈ నెల 5వ తేదీన వెపన్స్‌తో మెదక్‌ జిల్లా టేక్మల్‌ మండలం ఎలుపుగొండ గ్రామానికి చెందిన మనోజ్‌కుమార్‌ అలియాస్‌ శ్రీకాంత్‌ (కార్‌డ్రైవర్‌), వీరన్న అనే పేరుతో ఇద్దరు వ్యక్తులు మహాలక్ష్మి ఓబీకి కారులో వచ్చి బెదిరించి రూ.50లక్షలు డిమాండ్‌ చేయడంతో రూ.5లక్షలు ఓబీ నిర్వహకులు ఇచ్చారు. ఆతర్వాత హెచ్‌ఆర్‌ మేనేజర్‌ జితేందర్‌కుమార్‌ సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కల్లూరు ఏసీపీ ఎన్‌.వెంకటేష్‌, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ వెంకట్రావ్‌, సీఐ వెంకటస్వామి, సత్తుపల్లి పోలీసుల సహాయంతో విచారణ నిర్వహించారు. ఈ క్రమంలో ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి కారులో వచ్చి డబ్బులు ఇవ్వాలని బెదిరించారని తెలిపారు. 


పదేపదే మేనేజర్‌ జితేందర్‌కుమార్‌కు బెదిరింపు కాల్స్‌ చేయడం, రామగుండంలోని తమ మేనేజర్లను సైతం క్యాంపును బ్లాస్ట్‌ చేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు సీఐ చెప్పారు. మిగతా డబ్బులను అరెంజ్‌ చేసుకోవాలని చెప్పిన మనోజ్‌కుమార్‌, తన బావమరిది హరీష్‌తో కలసి ఈనెల 18వ తేదీన వెపన్స్‌తో బెదిరించి రూ.2లక్షలు వసూలు చేసినట్లు సమాచారం అందుకున్న పోలీసులు పకడ్బందీగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులు మనోజ్‌, హరీష్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. గోదావరిఖని ఏరియాలోని ఐఎన్‌టీయూసీ నాయకురాలిగా చెప్పుకుంటున్న తాటిపాముల విజయలక్ష్మి అనే మహిళ ఆధ్వర్యంలో ఆమె ఇచ్చిన సలహాలు, సూచనల మేరకు ఈ వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. వసూలు చేసిన డబ్బును ఆమెకు ఇచ్చినట్లు మనోజ్‌ తెలపగా రూ.35వేలు తనకు, మరో వ్యక్తికి రూ.1.25వేలు ఇచ్చినట్లు విచారణలో తేలింది.


ఈక్రమంలో ఎస్‌ఐ గజ్జల నరేష్‌, సిబ్బంది ఆమె హైదాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్నట్లు సమాచారం అందగా అరెస్ట్‌ చేసి వారి నుంచి రెండు వాహనాలు, రూ.2.80లక్షల నగదు, లైసెన్స్‌ ఫిస్టల్‌, గన్‌లైటర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వసూళ్లకు పాల్పడిన మనోజ్‌కుమార్‌, హరీష్‌, విజయలక్ష్మిలను అరెస్ట్‌ చేయగా మరో వ్యక్తి అలియాస్‌ వీరన్న పేరుతో వ్యక్తి పరారీలో ఉండగా పూర్తి విచారణ కొనసాగుతుందని, మరికొంత  సొత్తు రికవరీ చేయాల్సి ఉందన్నారు. విచారణలో సహకరించిన ఎస్‌ఐ నరేష్‌తో పాటు క్రైమ్‌ సిబ్బంది ఎన్‌.లక్ష్మణ్‌, టీ.గోపాలకృష్ణ, కే.రామకృష్ణ బృందాన్ని సీఐ అభినందించారు.

Updated Date - 2020-07-20T18:05:22+05:30 IST