జోరుగా ఫైనాన్స్‌ దందా.. రూ. 10నుంచి రూ.15 వడ్డీ వసూలు

ABN , First Publish Date - 2020-07-27T21:47:04+05:30 IST

ఒక పక్క కరోనా వైరస్‌ కారణంగా అనేక మంది పేదలు, చిరు వ్యాపారులు ఉపాధి లేక అవస్థలు పడుతున్నారు. కొంత మందికి పూట గడవని పరిస్థితి. కానీ ఇవన్నీ పట్టించు కోని ఫైనాన్స్‌, తాకట్టు, చిట్టీల వ్యాపారులు వారి దందాను జోరుగా సాగిస్తున్నారు

జోరుగా ఫైనాన్స్‌ దందా.. రూ. 10నుంచి రూ.15 వడ్డీ వసూలు

యథేచ్ఛగా తాకట్టు, చిట్టీ వ్యాపారాలు

పోలీసులు స్పందించాలని బాధితుల వేడుకోలు


చర్ల (ఖమ్మం): ఒక పక్క కరోనా వైరస్‌ కారణంగా అనేక మంది పేదలు, చిరు వ్యాపారులు ఉపాధి లేక అవస్థలు పడుతున్నారు. కొంత మందికి పూట గడవని పరిస్థితి. కానీ ఇవన్నీ పట్టించు కోని  ఫైనాన్స్‌, తాకట్టు, చిట్టీల వ్యాపారులు వారి దందాను జోరుగా సాగిస్తున్నారు. ఇదే క్రమంలో చిట్టీలు పాడినవారు, ఫైనాన్స్‌ తీసుకున్న వారు నగదు ఇవ్వకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇంట్లో వస్తువులు కూడా లాక్కుపోతామంటూ బెదిరింపులను పాల్పడుతున్నారని బాదితులు వాపోతున్నారు. తాకట్టు వ్యాపారాలు కూడా రూ.15 వడ్డీ వసూలు చేస్తున్నారు. గిరిజనుల నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తూ, బెదిరిపులకు పాల్పడుతున్న వ్యాపారుల పైన చర్ల పోలీసులు చర్యలు తీసుకోవాలని బాదితులు కోరుతున్నారు.


చర్లలో 110 మంది వ్యాపారులు

చర్ల మండలంలో సుమారు 55 మంది ఫైనాన్స్‌, 25 మంది చిట్టీ, 30 మంది తాకట్టు  వ్యాపారులు ఉన్నారు. ఫైనాన్స్‌ ఇచ్చే 55 మందిలో ఆంధ్రా నుంచి వచ్చి ఫైనాన్స్‌ ఇస్తున్న వారే అధికం. సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతీ గ్రామం, వీది తిరుగుతూ ఫైనాన్స్‌ ఇస్తున్నారు. ఇదే క్రమంలో అమాయక గిరిజనుల నుంచి రూ.10 నుంచి రూ. 15 వడ్డీ వసూలు చేస్తున్నారు. ఈ వారం నగదు కట్టలేం అని ఎవ్వరైనా వారికి చెబితే అసభ్యకరంగా మాట్లాడుతున్నారని, అవసరమైతే వస్తువులు లాక్కు పోతామంటూ బెదిరిస్తున్నారని స్థానికులు చెబతున్నారు. ముఖ్యంగా శనివారం, ఆదివారం, సోమవారం ఆంధ్రాప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు బెదిరింపులు ఎక్కువ అవ్వుతున్నాయంటున్నారు. 


పోలీసులు దృష్టి సారించాలి

చిట్టీ, ఫైనాన్స్‌, తాకటట్టు వ్యాపారాలపై చర్ల పోలీసులు దృష్టి సారించాలి. లేని పక్ష్యంలో వ్యాపారుల బెదిరింపులు అధికమై, పరువు కోసం ప్రాణాలు పొయ్యే అవకాశం కనిపిస్తోందని పలువురు అంటున్నారు. అనుమతలు లేకుండా పేదల నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారుల పై చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు. 


చర్యలు తీసుకుంటాం: టి. సత్యనారాయణ,  చర్ల సీఐ

 అనుమతులు లేకుండా ఫైనాన్స్‌, చిట్టీ, తాకట్టు వ్యాపారాలు చేస్తే చర్యలు తీసుకుంటాం. నగదు కట్టాలని ఎవ్వరైనా బెదిరిస్తే కేసులు నమోదు చేస్తాం. బాధితులు ఎవరైనా ఉంటే చర్ల స్టేషన్‌లో  ఫిర్యాదు చేయాలి. 

Updated Date - 2020-07-27T21:47:04+05:30 IST