వేతనాలివ్వండి మహాప్రభో..!
ABN , First Publish Date - 2020-04-08T10:02:00+05:30 IST
గ్రామ స్థాయిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అత్యవసర వైద్యాన్ని అందిస్తున్న ‘104’ సిబ్బందికి వేతన వెతలు తప్పడం లేదు. నాలుగు నెలలుగా జీతాలు

నాలుగు నెలలుగా పెండింగ్‌లో ‘104వాహన’ సిబ్బంది జీతాలు
గ్రామీణ వైద్యంలో కీలకంగా వ్యవహరిస్తున్నా గుర్తింపు కరవు
కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 7: గ్రామ స్థాయిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అత్యవసర వైద్యాన్ని అందిస్తున్న ‘104’ సిబ్బందికి వేతన వెతలు తప్పడం లేదు. నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో పస్తులతో అవస్థలు పడుతున్నారు. ఆయా మండలాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్లో రోజంతా వైద్యసేవలందిస్తున్నా ప్రభుత్వం వేతనాలు మంజూరు చేయడంలేదు.
104 వాహన సిబ్బందిని మరిచారు
భద్రాద్రి జిల్లాలో మొత్తం 32 పీహెచ్‌సీల పరిధిలో సుమారు 75 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బందిని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ఎంత కష్టమైనప్పటికీ వెంటనే వేతనాలతో పాటు పారితోషకాన్ని ఇస్తామని ప్రకటించారు. అయితే ఆ శాఖకు అనుసంధానంగా పనిచేస్తున్న ‘104 వాహన సిబ్బంది’ని ఎందుకు మరిచారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. డిసెంబరు నుంచి మార్చి నెల వరకు నాలుగు నెలలుగా వేతనాలు పెండింగ్‌లు ఉన్నాయి. దీంతో సిబ్బంది అనేక అవస్థలు పడుతున్నారు.
విస్తృత వైద్య సేవలు
104వాహన సిబ్బంది గ్రామాల్లో రోగులను గుర్తించడమే కాకుండా వారికి కావల్సిన ఔషధాలను కూడా అందిస్తుంటారు. ఫార్మాటిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డేటాఎంట్రీ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటుంది. కరోనావైర్‌సను కట్టడి చేసేందుకు ప్రస్తుతం వైద్యశాఖ అత్యవసర సేవలకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డుల్లో కూడా 104 సిబ్బంది సేవలు అందిస్తున్నారు. కరోనావైరస్ అనుమానితుల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ వార్డులకు ల్యాబ్‌టెక్నిషియన్‌లుగా 104 సిబ్బంది అందిస్తున్న సేవలకు అదికారుల నుంచి మన్నలను పొందుతున్నారు.
వేతనాలివ్వాలని వేడుకోలు
2009 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు నిరుపేదల కోసం ఇంటింటికి అందుబాటులో వైద్యసేవలందించాలని ఉద్దేశ్యంతో 104 సేవలను ప్రవేశపెట్టారు. అప్పటినుంచి ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నా వేతనాలు చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో వైద్యశాఖ అధికారులతో పాటు తాము కూడా రాత్రింబవళ్లు కష్టపడుతున్నామని వివరించారు. వేతనాలు అందక కుటుంబాలను సాకలంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ విపత్కర పరిస్థితలో పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే మంజూరుచేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.