కొను‘గోల్‌మాల్‌’

ABN , First Publish Date - 2020-06-16T10:23:45+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంచాయతీలకోసం చేపట్టిన ట్రాక్టర్ల కోనుగోళ్లలో భారీగా కమీషన్ల బేరం సాగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొను‘గోల్‌మాల్‌’

పంచాయతీ ట్రాక్టర్ల కొనుగోళ్లలో భారీగా కమీషన్ల పర్వం 

సర్పంచ్‌ల ప్రమేయం లేకుండానే కొనుగోళ్లు..

రూ.1.20లక్షల ట్యాంకర్లు, ట్రక్కులకు రూ.1.71లక్షల చెల్లింపులు

పంచాయతీ నిధులపై జిల్లా అధికారుల పెత్తనం 

ఆగ్రహిస్తున్న సర్పంచ్‌లు, కలెక్టర్‌కు ఫిర్యాదు


అశ్వారావుపేట, జూన్‌ 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంచాయతీలకోసం చేపట్టిన ట్రాక్టర్ల కోనుగోళ్లలో భారీగా కమీషన్ల బేరం సాగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రాక్టర్ల కొనుగోళ్ల విషయంలో సర్పంచ్‌లతో సంబంధం లేకుండా జిల్లా స్థాయిలోనే నిర్ణయాలు జరిగిపోతున్నాయనే వ్యాఖలు వినిపిస్తున్నాయి. జిల్లా స్థాయిలో ఆయా కంపెనీలు, తయారీదారులతో ఓ ధరకు అంగీకారం కుదుర్చుకొని వాటిని సర్పంచ్‌లతో కొనుగోలు చేయించాల్సిందిగా మండలస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ అవుతున్నాయి. ఆ అఽధికారులు సర్పంచ్‌లను నయానో భయానో నచ్చజెప్పి వాటిని కొనుగోలు చేయిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక భారీ మొత్తంలో కమీషన్ల బేరం నడుస్తోందని పలువురు సర్పంచ్‌లు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. 


రూ.1.20లక్షల ట్రక్కు, ట్యాంకర్‌ను రూ.1.70లక్షలకు కొనుగోలు

ప్రతి పంచాయతీ తప్పనిసరిగా ట్రాక్టర్‌ను కొనుగోలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం కొందరు అధికారులకు కాసులు కురిపించింది. జిల్లాస్థాయిలో కొందరు అధికారులు ట్రాక్టర్‌ల కంపెనీలతో నేరుగ ధరను మాట్లాడుకొని అక్కడ నుండే ట్రాక్టర్‌లను సరఫరా చేశారు. వీటికి ట్రక్కులు, వాటర్‌ ట్యాంకర్లును కూడ కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వాటిని కూడా జిల్లాస్థాయి అధికారులు భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాలలో తయారు చేయించి అందరికీ సరఫరా చేస్తున్నారు. ట్రాక్టర్‌ కొనుగోళ్లలో ఒక్కో ట్రాక్టర్‌కు పలు దశల్లో రూ.40నుంచి రూ60వేల వరకు కమిషన్లు నడిచాయనే ఆరోపణలు ఉన్నాయి. మార్కెట్‌లో రూ.1.10 లక్షల నుంచి రూ.1.20 లక్షల వరకు మంచి గేజ్‌, నాణ్యమైన ఇనుము ప్లేట్లతో మంచి ట్రక్కులు, ట్యాంకర్లు తయారు చేసి ఇస్తున్నారు. కానీ అధికారులు మాత్రం రూ.1.71లక్షలకు ధరను నిర్ణయించి కొనుగోలు చేశారు. అవికూడా నాసిరకంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంటే ఒక్కోదానిలో రూ.50వేలకు పైగా వివిద మార్గాలలో పలువురి జేబుల్లోకి వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇటీవలే అశ్వారావుపేట మండలానికి చెందిన పలువురు సర్పంచ్‌లు జిల్లాస్థాయి అధికారిపై బహిరంగానే ఆరోపణలు చేసి కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశారు.  


పంచాయతీలపై అధికారుల పెత్తనం.. 

పేరుకే అంతా సర్పంచ్‌దే పెత్తనం. కానీ క్షేత్రస్థాయిలో సర్పంచ్‌లు నామ మాత్రంగానే మిగిలిపోతున్నారు. అధికారులే అంతా తామై పెత్తనం సాగిస్తున్నారు. ట్రాక్టర్‌లు, ట్రక్కులు, ట్యాంకర్ల కొనుగోలు నుంచి బ్లీచింగ్‌ పౌడరు కొనుగోలు వరకు సర్పంచ్‌లకు తెలియకుండానే నేరుగా జిల్లా స్తాయిలో నిర్ణయాలు జరిగిపోతున్నాయి. రికార్డు ప్రకారం అన్ని సక్రమంగానే కనబడుతున్నా పంచాయతీ నిధులపై పరోక్షంగా జిల్లాలోని కొందరు అధికారులు పెత్తనం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిరాకరించిన సర్పంచ్‌లకు బెదిరింపులు కూడా వస్తున్నట్టు సమాచారం. 


సరఫరా కాకుండానే వాయిదాల చెల్లింపులు 

 ఇప్పటి వరకు సగం పంచాయతీలకు ట్రక్కులు, ట్యాంకర్లు అందనేలేదు. అయితే వీటి కొనుగోళ్ళుకోసం ఆయా పంచాయతీలకు బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించి, బ్యాంకుల నుండి తయారీదార్లకు చెల్లింపులు మాత్రం చేశారు. దీంతో బ్యాంకర్లు ప్రతి నెల పంచాయతీల నుంచి రుణానికి సంబంధించి వాయిదాలను వసూలు చేస్తున్నారు. ఇది పంచాయతీలకు భారంగా మారుతోంది.


డీపీవో ఆశాలత ఏమన్నారంటే..

ట్రాక్టర్ల కొనుగోలుపై డీపీఓ ఆశాలతను వివరణ కోరగా ఆరోపణలను ఖండించారు. అన్నిటిని నిబంధనలమేరకే కొనుగోలు చేశామని, పంచాయతీ తీర్మానాలు కూడా ఉన్నాయని తెలిపారు.  

Updated Date - 2020-06-16T10:23:45+05:30 IST