దర్జాగా దావత్‌.. ‘ఫంక్షన్‌’హాలులో పంచాయతీ కార్యదర్శుల విందు

ABN , First Publish Date - 2020-06-22T22:11:54+05:30 IST

అసలే కరోనా సమయం.. అందులోనూ ఆదివారం సూర్యగ్రహణం. ప్రజలు ఎవరూ బయటకు రారనుకున్నారో ఏమో ఆ అధికారులు. ఓ అధికారపార్టీ కార్పొరేటర్‌కు చెందిన ఫంక్షన్‌ హాలులో విందు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

దర్జాగా దావత్‌.. ‘ఫంక్షన్‌’హాలులో పంచాయతీ కార్యదర్శుల విందు

లాక్‌డౌన్‌ ఆంక్షలను మరిచి మరీ విందుకు సై

అధికారపార్టీ కార్పొరేటర్‌కు చెందిన ఫంక్షన్‌ హాలులో ఏర్పాట్లు

స్థానికులు వీడియోలు తీయడంతో వాగ్వాదం

బయటకు పొక్కడంతో పోలీసుల రంగంప్రవేశం


ఖమ్మం (ఆంధ్రజ్యోతి) : అసలే కరోనా సమయం.. అందులోనూ ఆదివారం సూర్యగ్రహణం. ప్రజలు ఎవరూ బయటకు రారనుకున్నారో ఏమో ఆ అధికారులు. ఓ అధికారపార్టీ కార్పొరేటర్‌కు చెందిన ఫంక్షన్‌ హాలులో విందు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంకేముంది లాక్‌డౌన్‌ ఆంక్షలను పట్టించుకోకుండా దానికి తగ్గట్టుగా తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. ఆదివారం ఉదయం నుంచే పనులు ప్రారంభించారు. ఆ విషయం ఆ నోట ఈ నోట చేరి బయటకు పొక్కింది. దాంతో వారు చేసుకోవాలనుకున్న విందు కాస్త ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. రఘునాథపాలెం మండలంకు చెందిన ఓ పంచాయతీకార్యదర్శి ఉద్యోగంలో చేరి యేడాది అయిన సందర్భంగా తోటి ఉద్యోగులకు, సన్నిహితులకు విందు ఏర్పాటు చేయాలనుకున్నాడు. దానికోసం ఖమ్మం అర్బన్‌ పరిధిలోని ఓ కార్పొరేటర్‌కు చెందిన ఫంక్షన్‌హాలులో ఏర్పాట్లు చేసుకున్నాడు. 


ఆ ఫంక్షన్‌కు హాజరుకావాల్సిన వారిలో దాదాపు సగం మంది ఉదయమే అక్కడకు చేరుకున్నారు. అది తెలుసుకున్న కొందరు వ్యక్తులు వీడియో తీస్తుండటంతో కొందరు అధికారులు అక్కడి నుంచి పారిపోయారని సమాచారం. కాగా మిగిలిన వారు సంబంధిత వ్యక్తులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు అక్కడకు చేరుకున్న సమయంలో పదిమంది అధికారులు అక్కడ ఉండగా అందులో ఓ మహిళా అధికారి కూడా ఉన్నట్టు సమాచారం. పోలీసులు అక్కడ ఉన్న మాంసం, ఇతర కూరగాయలు వంటి సామగ్రిని పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు. ఫంక్షన్‌ను నిలిపివేసి ఆయా పంచాయతీ కార్యదర్శులను వెనక్కి పంపించేశారు. అయితే ఆ ఫంక్షన్‌కు కొందరు ఉన్నతాధికారులు కూడా హాజరుకానునట్టు సమాచారం. 


విందు నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం. పోలీసులు, ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకోకుండా ఉండేలా కొందరు యూనియన్‌ నాయకులు పావులు కదుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో అసలు ఫంక్షన్‌హాళ్లకు అనుమతులే ఇవ్వడంలేదు... కాని ప్రస్తుతం ఆ ఫంక్షన్‌ హాలులో ఏర్పాట్లు చేయడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2020-06-22T22:11:54+05:30 IST