తిన్న సొమ్ము కక్కాల్సిందే

ABN , First Publish Date - 2020-12-12T04:24:13+05:30 IST

రాజారాంపేట సహకార సంఘ సమావేశం ఘర్షణకు దారితీసింది.

తిన్న సొమ్ము కక్కాల్సిందే
ఆగ్రహంతో వేదికపైకి దూసుకెళ్లిన సంఘ సభ్యులు

ఎరువుల కుంభకోణం సొమ్ములు చెల్లించాల్సిందే

రాజారాంపేట సొసైటీ సర్వసభ్య సమావేశం రసాభాస

వేదికపైకి దూసుకెళ్లిన సభ్యులు 

నేలకొండపల్లి, డిసెంబరు11: రాజారాంపేట సహకార సంఘ సమావేశం ఘర్షణకు దారితీసింది. ఇక్కడ జరిగిన ఎరువుల కుంభకోణంపై చర్చించటానికి శుక్రవారం సొసైటీ ఆవరణలో సభ్యుల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. కేకలు, అరుపులతో ఎవరేం మాట్లాడుతున్నారో వినిపించకుండా గందరగోళంగా సాగింది...  రాజారాంపేట సహకార సంఘంలో సేల్స్‌మెన్‌ ఈద శేఖర్‌రెడ్డి రూ.21,24,911 లక్షలు, సీఈఓ మారగాని శ్రీనివాసరావు రూ.2,77,540 లక్షలు అవినీతికి పాల్పడ్డారు. ఇటీవల  జిల్లా సహకార అధికారులు విచారణ జరపగా, ఇది వెలుగులోకి వచ్చింది. ఈ సొమ్మును వారి వద్ద నుంచి రికవరీ చేయాలంటూ సహకార సంఘం పాలకవర్గాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు పంపారు. జిల్లా సహకార అధికారులు పంపిన ఉత్తర్వులపై చర్చించి నిర్ణయం తీసుకోవటానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈక్రమంలో మాజీ అధ్యక్షుడు ఈవూరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సీఈఓ అవినీతికి పాల్పడితే సేల్స్‌మెన్‌ నుంచి రికవరీ చేయటం ఏంటంటూ నిలదీశారు. సీఈఓ రికార్డులు సరిగా నిర్వహించలేదని, డే బుక్‌లో నెలల తరబడి తన సంతకాలుతీసుకోలేదని, అంతేగాకుండా తీర్మానం పుస్తకంలో కొన్ని తీర్మానం పేజీలను చించివేసాడని, మొత్తం రికార్డులు సమావేశంలో పెట్టాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు కనమర్లపూడి రామకృష్ణ మాట్లాడుతూ కుంభకోణం విషయం ఆరు నెలలుగా నలుగతున్నా ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. అనంతరం సంఘం అధ్యక్షుడు పగిడిపత్తి శ్రీను మాట్లాడుతూ అధికారులు విచారణ జరిపారని, తప్పు చేశాడని తేలిన ఈద శేఖర్‌రెడ్డిని తొలగించారని, సీఈఓను ప్రస్తుతానికి సస్పెన్షన్‌లో పెట్టారని వివరించారు. కాజేసిన ఎరువుల డబ్బులు చెల్లించేందుకు   శ్రీను  అంగీకరించగా, శేఖర్‌రెడ్డి నిరాకరించాడు. శేఖర్‌రెడ్డి నుంచి కూడా వసూలు చేయాల్సిందేనంటూ సభ్యులు డిమాండ్‌ చేశారు. దీంతో సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకరికొకరు అరుచుకుంటూ వేదిక పైకి ఎక్కి అధ్యక్షుడితో వాగ్వాదానికి దిగారు. సహకార చట్టం ప్రకారం డబ్బులు వసూలు చేస్తామని అధ్యక్షుడు హామీ ఇవ్వటంతో గందరగోళం సద్దుమనిగింది. సమావేశానికి  చెర్వుమాధారం, మంగాపురంతండా, రాజారాంపేట నుంచి పెద్ద సంఖ్యలో సభ్యులు హాజరయ్యారు. చెర్వుమాధారం, మంగాపురంతండా సర్పంచ్‌లు ఈవూరి సుజాత, భూక్యా సుధాకర్‌ ఉప సర్పచ్‌ ఆకుల వెంకటేశ్వర్లుతో పాటు సంఘ డైరెక్టర్లు హాజరయ్యారు. 


Updated Date - 2020-12-12T04:24:13+05:30 IST