ఘాటెక్కిన ఉల్లి

ABN , First Publish Date - 2020-10-28T10:28:43+05:30 IST

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. కాని ఆ ఉల్లి ధర అమాంతం పెరిగి వినియోగదారుల కంట కన్నీరు పెట్టిస్తోంది. ప్రతి ఇంట్లో ఉల్లిగడ్డ ప్రాముఖ్యం ఏంటో వివరించాల్సిన అవసరం లేదు

ఘాటెక్కిన ఉల్లి

బహిరంగ మార్కెట్‌లో కిలో రూ. 100 

అదేబాటలో కాయకూరల ధరలు

బెంబేలెత్తుతున్న వినియోగదారులు


ఖమ్మం మార్కెట్‌/పాల్వంచ టౌన్‌,  అక్టోబరు 27: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. కాని ఆ ఉల్లి ధర అమాంతం పెరిగి వినియోగదారుల కంట కన్నీరు పెట్టిస్తోంది. ప్రతి ఇంట్లో ఉల్లిగడ్డ ప్రాముఖ్యం ఏంటో వివరించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చాలా మంది ఉల్లి లేకుండానే కూర చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. కారణం దాని రేటు ఆకాశాన్నంటడమేనని వినియోగదారులు వాపోతున్నారు. గత ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై మాసాల్లో కిలో రూ. 15 నుంచి రూ. 20లు పలికిన ఉల్లి ధరలు ఆగస్టు నెల నుంచి ప్రారంభమై ప్రస్తుతం కిలో ఉల్లి రూ. 100 నుంచి రూ. 120 లకు చేరుకోవడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులను నిషేధించినప్పటికి ధరల పెరుగుదల ఆగక పోవడం విశేషం. ఎడతెరిపిలేని వర్షాలతో ఉల్లి పంట దెబ్బతినగా, ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఉల్లిగడ్డలు తేమ అధికమై కుళ్లి పోవడంతో సరఫరా తగ్గి ధరలు పెరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. గత సంవత్సరం ధరలు కిలో రూ.150లకు పైగా పెరిగిన ఉల్లి ఈ ఏడాది దానికంటే మరింత పెరగే సూచనలు కనపడుతున్నాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నారు. 

 

కిలో రూ. 100 కి పైమాటే

ప్రస్తుతం ఉల్లి ధరలు బహిరంగ మార్కెట్‌లో సన్న రకాలు కిలో రూ. 100 లకు, లావు రకాలను కిలో రూ. 120 లకు వ్యాపారులు విక్రయిస్తుండగా రైతు బజార్లలో మాత్రం కిలో రూ. 90 నుంచి రూ. 100ల వరకు విక్రయిస్తున్నారు. ఉల్లి దిగుమతి చేసుకునే మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలోని అనంతపురం, కర్నూలు మార్కెట్‌లలో నిల్వల కొరత ఉంది. ఈఏడాది ఆయా ప్రాంతాల్లో కురిసిన అధిక వర్షాలతో ఉల్లి దిగుబడి సరిగ్గా రాకపోవడంతోనే ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. ఉల్లి ధరలకు రెక్కలు రావడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు.  అధికారులు స్పందించి ఉల్లి ధరలను నియంత్రించాలని వినియోగదారులు డిమాండ్‌ చేస్తున్నారు.


మండుతున్న కాయకూరల ధరలు

 కూరగాయలు ధరలు పరిశీలిస్తే కిలో టమాట రూ.35ల నుంచి రూ.50ల వరకు, పచ్చి మిర్చి మాత్రం అందుబాటు ధరల్లో లభ్యమవుతోంది. ఆలు గడ్డ కిలో రూ.80లు, ఒక సొర కాయ రూ.50లు, దోసకాయ కిలో రూ.50లు, చిక్కుడు కాయలు కిలో రూ.160లు, బీరకాయ రూ.60లు, బెండకాయ రూ.80లు, వంకాయ రూ.80లు, కాకర కాయ కిలో రూ.80లు, ఒక ములక్కాయ రూ.10లు, క్యారట్‌ కేజీ రూ.160లు, ఇతర కూరగాయలు కూడా ఇంచుమించు ధరలు పలుకుతున్నాయి.  


Updated Date - 2020-10-28T10:28:43+05:30 IST