ఆగని ఐపీఎల్‌ బెట్టింగ్‌

ABN , First Publish Date - 2020-10-03T11:14:01+05:30 IST

ఐపీఎల్‌ ప్రారంభమైన నాటి నుంచి క్రికెట్‌ బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు కేవలం ఫోను, వాట్సాప్‌ కాల్స్‌, మెసేజ్‌ల ద్వారా ఈ ..

ఆగని ఐపీఎల్‌ బెట్టింగ్‌

పోలీసులు దాడులు చేస్తున్నా కొనసాగుతున్న దందా 

ఓ యాప్‌ సాయంతో వేరే రాష్ట్రాల వారితో పందాలు కాస్తున్న యువత

రూ.లక్షలు చేతులు మారుతున్న వైనం

ఖమ్మంలో పదిమంది బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌


ఖమ్మం క్రైం, ఆక్టోబరు 2: ఐపీఎల్‌ ప్రారంభమైన నాటి నుంచి క్రికెట్‌ బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు కేవలం ఫోను, వాట్సాప్‌ కాల్స్‌, మెసేజ్‌ల ద్వారా ఈ దందా నడిపిన బెట్టింగ్‌ రాయుళ్లు.. కొత్తదారి ఎంచుకున్నారు. ఓ యాప్‌ను వినియోగిస్తూ ఆన్‌లైన్‌లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో పందాలు కాస్తున్నారు. ఈ క్రమంలో రూ.లక్షలు చేతులు మారుతున్నట్టు సమాచారం. అయితే జిల్లాలోని పలు ప్రాంతాల్లో బెట్టింగులు నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులు దాడులను విస్తృతం చేసి పలువురిని ఆరెస్టు చేస్తున్నా.. ఈ బెట్టింగ్‌ దందా మాత్రం అగడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బెట్టింగ్‌ను వ్యసనంగా మార్చుకున్న యువత జేబులు గుల్లవుతుండగా, కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో ఓ స్థావరం ఏర్పాటు చేసుకొని గుంపులుగా ఉండి బెట్టింగ్‌లు నిర్వహించేవారు. ప్రస్తుతం కరోనా భయం నేపథ్యంలో ఎవరికి వారు స్మార్ట్‌ ఫోన్లు వినియోగిస్తూ ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా భారీ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఓ యాప్‌ ద్వారా బెట్టింగులకు పాల్పడుతున్న ఖమ్మానికి చెందిన పది మందిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

 

చేతులు మారుతున్న రూ.లక్షలు

జిల్లాలో ఐపీఎల్‌ బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్న నేపథ్యంలో యువత రూ.లక్షల్లో పందాలు కాస్తున్నారు. ఏరోజుకారోజు జరుగుతున్న మ్యాచ్‌లకు పోటీపడుతూ ఒకరిని మించి మరొకరు పందాలు కాస్తూ.. ఆన్‌లైన్‌ ద్వారా నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో యువత శక్తి, స్థాయిని మించి అప్పులు చేస్తున్నారు. ఒక్కోసారి నగదు లేకపోతే స్నేహితుల వద్ద తమ సెల్‌ఫోన్లు, బంగారు ఆభరణాలు, బైకులు, ఇతర ఖరీదైన వస్తువులను తాకట్టు పెట్టి మరీ అవతలి వ్యక్తులకు డబ్బు చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ లావాదేవీల వ్యవహారంలో మధ్యవర్తులు కీలకంగా మారుతున్నారు. ఇరు వర్గాల నుంచి ఫోన్ల ద్వారా బెట్టింగ్‌ నగదను ఫిక్స్‌ చేసి ఇద్దరి నుంచి నగదు వసూలు చేస్తూ.. పర్సంటేజీలు తీసుకుంటున్నారు. 


పది మంది అరెస్టు

ఖమ్మం నగరంలోని పంపింగ్‌వెల్‌రోడ్డులో ఐపీఎల్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న పదిమందిని త్రీటౌన్‌ పోలీసులు శుక్రవారం అరెస్టుచేశారు. ఓ స్థావరం వద్ద బెట్టింగ్‌ జరుగుతోందని వచ్చిన సమాచారంతో త్రీ టౌన్‌ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో దాసరి నాగభూషణం, దాసరి కోటేశ్వరరావు, బండి వెంకటేశ్వర్లు, నూనె క్రాంతితో పాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 12సెల్‌ఫోన్లు, రూ.60వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో  త్రీటౌన్‌ సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐలు శ్రీకాంత్‌, శ్రావణ్‌, తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-10-03T11:14:01+05:30 IST