సరిహద్దు తనిఖీలేవీ ?
ABN , First Publish Date - 2020-04-08T10:00:00+05:30 IST
ఒక మనిషి చర్ల నుంచి భద్రాచలం రావాలంటే ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఎన్నో తనిఖీలను ఎదుర్కొని చేరుకోవాల్సి ఉంటుంది. అలాంటిది చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో

యథేచ్ఛగా సాగుతున్న మద్యం అక్రమ రవాణా
చర్ల, దుమ్ముగూడెం మండలాలనుంచి భద్రాచలానికి తరలింపు
డేషీట్, బ్యాచ్‌నెంబర్లు తనిఖీ చేస్తేనే వాస్తవాలు వెలుగులోకి
భద్రాచలం, ఏప్రిల్ 7: ఒక మనిషి చర్ల నుంచి భద్రాచలం రావాలంటే ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఎన్నో తనిఖీలను ఎదుర్కొని చేరుకోవాల్సి ఉంటుంది. అలాంటిది చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఉన్న మద్యం దుకాణాల నుంచి లక్షల రూపాయలు విలువైన మద్యం బాటిళ్లు భద్రాచలానికి యథేచ్ఛగా చేరుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో భద్రాచలంలోని మద్యం సిండికేట్ నిర్వాహకులు కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చిన వారిని యక్ష ప్రశ్నలు వేసే అధికారులు కార్లలో పట్టపగలు మద్యం బాటిళ్లను తరలిస్తున్నా పట్టించుకోకపోవడం పట్ల సర్వత్రా ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అక్రమ రవాణాను అడ్డుకోవాల్సి ఎక్సైజ్‌శాఖ అధికారులే తమకేం పట్టనట్లు వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
అక్రమంగా తరలించిన మద్యాన్ని ఎమ్మార్పీకంటే నాలుగురెట్లు అధికంగా అమ్ముతున్నా అడిగే వారే లేరని మందుబాబులు ఆరోపిస్తున్నారు. చర్ల నుంచి భద్రాచలానికి మద్యం బాటిళ్లను తీసుకొస్తుండగా సోమవారం తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లోని కన్నాయిగూడెం వద ్ద యటపాక పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటనతో జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు మంగళవారం భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా యటపాక పోలీసులను సైతం ఈ కేసు విషయంలో కలిసి వారి నుంచి వివరాలు రాబట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బ్యాచ్ నెంబరు, డే షీట్ల ఆధారంగా ఆ మద్యం బాటిళ్లు ఏ మండలంలో ఏ దుకాణం నుంచి తెచ్చారో తెలుసుకొని సంబంధిత దుకాణంలో తనిఖీ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ఎక్సైజు శాఖ అధికారులు ఈ కోణంలో విచారణ చేస్తే వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది.