నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తాం
ABN , First Publish Date - 2020-11-26T04:49:45+05:30 IST
బీటీపీఎస్ విద్యుత్తు కర్మాగారానికి అవసరమైన బొగ్గు రవాణాకు నిర్మించే రైల్వేట్రాక్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తామని కలెక్టర్ ఎంవీ రెడ్డి అన్నారు.

అభివృద్ధికి సహకరించాలి: కలెక్టర్ ఎంవీరెడ్డి
కొత్తగూడెం కలెక్టరేట్, నవంబరు 25: బీటీపీఎస్ విద్యుత్తు కర్మాగారానికి అవసరమైన బొగ్గు రవాణాకు నిర్మించే రైల్వేట్రాక్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తామని కలెక్టర్ ఎంవీ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశపు మందిరంలో రైల్వేట్రాక్ నిర్మాణంలో భూముల కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం చెల్లింపుపై ఆర్ అండ్ ఆర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు ఏర్పాటుతో జిల్లా అభివృద్ధి చెందడమే కాకుండా స్థానికంగా పురోగతి ఉంటుందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి ప్రాజెక్టు అవసరాలకు భూములు అప్పగించాలన్నారు. ప్రజలకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు నిరంతరం విద్యుత్తు సరఫరాలో మనజిల్లా కేంద్ర బిందువుగా ఉన్నందున జిల్లా ప్రజలందరిని అభినందిచారు. పరిహారం చెల్లించే విషయంలో దళారుల మాటలు నమ్మి ఇబ్బందులు పడోద్దన్నారు. రైల్వె ట్రాక్ నిర్మాణానికి 129.20 ఎకరాలభూమి అవసరం ఉందన్నారు. సహాకరించాలని ప్రజలను కోరారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా,న్యాయపరంగా ఉండాలని, ఆదరా బాదరా భూములు తీసుకొనే ఆచారం కాదని ఏదైనా అభ్యంతరాలుంటే భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేయాలని సూచించారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి రైతులు భూములు అప్పగించారని ఈ సందర్బంగా వారిని కలెక్టర్ అభినందించారు. కమాటీ సభ్యులు మాట్లాడుతూ ట్రాక్ నిర్మాణంలో పొలాలకు వెళ్లడానికి వంతెనలు ఏర్పాటు చేయాలన్నారు. పొలాలకు నీరు సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో గౌతమ్, అదనపు కలెక్టర్‌లు వెంకటేశ్వర్లు, అనుదీప్, బీటిపీఎస్ సీఈ బాలరాజు, ఎస్‌ఈ రాంప్రసాద్, సింగారం సర్పంచ్ ఈశ్వరమ్మ, రవికుమార్, రాజు సతీ్‌ష, కృపాకర్ మోర్ స్వచ్చంద సంస్థ నిర్వాహాకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.