మంత్రుల పర్యటనలో నిరసన సెగలు

ABN , First Publish Date - 2020-12-08T05:28:56+05:30 IST

పలు అభివృద్ధి పనుల ప్రారంభానికి గాను ఖమ్మం వచ్చిన నలుగురు రాష్ట్ర మంత్రులకు బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ఈజీఎస్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్ల నుంచి నిరసనలు ఎదురయ్యాయి.

మంత్రుల పర్యటనలో నిరసన సెగలు
కేటీఆర్‌ సభలో నిరసన తెలుపుతున్న ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్లు, నో ఎల్‌ఆర్‌ఎస్‌ నో టీఆర్‌ఎస్‌ అంటూ ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తలు, కాంగ్రెస్‌ కార్యకర్తల నిరసన

కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తల ప్రయత్నం

ఖమ్మం, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : పలు అభివృద్ధి పనుల ప్రారంభానికి గాను ఖమ్మం వచ్చిన నలుగురు రాష్ట్ర మంత్రులకు బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ఈజీఎస్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్ల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. ఆయా పార్టీల కార్యకర్తలు నగరంలోని పలుచోట్ల మంత్రుల కాన్వాయ్‌ అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని సాయంత్రానికి వదిలివేశారు. మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ, మహమూద్‌అలీ, ప్రశాంత్‌రెడ్డి రఘునాధపాలెంలో ప్రారంభోత్సవంలో పాల్గొని ఖమ్మం వస్తుండగా ఎన్‌ఎస్‌పీ వాకింగ్‌ట్రాక్‌ ప్రారంభం సందర్భవంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ‘నో ఎల్‌ఆర్‌ఎస్‌, నో టీఆర్‌ఎస్‌’ అంటూ ఫ్లకార్డులు పట్టుకుని కాన్వాయిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం నగరంలో ఐటీహబ్‌ ప్రారంభించేందుకు మంత్రుల కాన్వాయ్‌ వెళుతుండగా జూబ్లీక్లబ్‌, కాంగ్రెస్‌ భవనం వద్ద ‘మాకొద్దు పాలన.. టీఆర్‌ఎస్‌ పాలన. నిరుద్యోగ భృతి, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలి. ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దుచేయాలి’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఐటీహబ్‌ ప్రారంభం అనంతరం జరిగిన సభలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగం మొదలుకాగానే ఎదుట కూర్చున్న ఈజీఎస్‌ ఫీల్డ్‌అసిస్టెంట్లు నిరసన తెలిపారు. తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేయడంతో పోలీసులు వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతివ్వడంతో వారు శాంతించారు. గ్రీన్‌ఫీల్డ్‌ రహదారికి భూములు కోల్పోతున్న రైతులు కూడా రహదారి వద్దంటూ నిరసన తెలిపారు. రహదారి కారణంగా తమ పచ్చని భూములు పోతున్నాయని, ప్రభుత్వం నుంచి సరైన పరిహారం రావడం లేదని, అలాంటప్పుడు తమకు నష్టం చేసే రహదరి వద్దని నినాదాలు చేశారు. 

Updated Date - 2020-12-08T05:28:56+05:30 IST