గ్రానైట్ కార్మికులకు ఇబ్బంది కలిగిస్తే సహించం
ABN , First Publish Date - 2020-04-26T10:46:18+05:30 IST
గ్రానైట్ కార్మికులకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని కార్మిక శాఖ అధికారులు

లేబర్ అసిస్టెంట్ కమిషనర్ నర్సింహారావు
ఖమ్మం ఖానాపురం హవేలి, ఏప్రిల్ 25: గ్రానైట్ కార్మికులకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని కార్మిక శాఖ అధికారులు హెచ్చరించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ‘కార్మికుల ఆకలి కేకలు’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శనివారం సంబంధత గ్రానైట్ పరిశ్రమకు వెళ్లి కార్మికులు పడుతున్న ఇబ్బందులు స్వయంగా తెలుసుకున్నారు. యాజమాన్యాన్ని పిలిపించి కార్మికులు పడుతున్న ఇబ్బందులను వెంటనే తీర్చాలని లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేశారు. ఈసందర్భంగా లేబర్ అసిస్టెంట్ కమిషనర్ నర్సింహారావు మాట్లాడుతూ జిల్లాలోని వలస కార్మికులకు ప్రభుత్వపరంగా అందాల్సిన అన్ని సౌకర్యాలు అందిస్తున్నామని అన్నారు. కార్మికులకు 12కిలోల బియ్యం, రూ.500నగదు అందించామన్నారు. జిల్లాలో 14వేల మంది వలస కార్మికులకు ప్రభుత్వ అండగా ఉందన్నారు.
అనంతరం గేట్లు తెరిపించి పరిశ్రమ లోపలికి కార్మికులను పంపించారు. ఆవరణలోని మినరల్‌వాటర్ ప్లాంట్ కూడా ఓపెన్ చేసి కార్మికులకు మంచినీటి సౌకర్యం ఏర్పాటుచేయిచారు. కార్మికులకు అందాల్సిన సౌకర్యాలను గ్రానైట్ యాజమాన్యం చూసుకోవాలని సూచించారు. మరోసారి గ్రానైట్ కార్మికులకు ఇబ్బందులు కలిగితే పరిశ్రమలను సీజ్ చేస్తామని యాజమాన్యంపై కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల ఇన్‌చార్జ్ జీఎం సీతారాం, మైనింగ్ ఏజీ గంగాధర్, రాయల్టీ ఇన్స్‌పెక్టర్ రాజారెడ్డి, ప్రమోద్, తదితరులు పాల్గొన్నారు.