మ్యుటేషన్..పరేషాన్
ABN , First Publish Date - 2020-10-31T06:37:35+05:30 IST
ఆస్తి క్రయ, విక్రయాలు జరిగి రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే నగరపాలక పాలక సంస్థ కార్యాలయంలో పేరుమార్పు (మ్యుటేషన్) జరగాలి.

పెండింగ్‌లో 400 పేరుమార్పిడి ఫైళ్లు
కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యమే కారణం
వారంలో పరిష్కరిస్తామంటున్న కమిషనర్
ఖమ్మం కార్పొరేషన్, అక్టోబరు 30: ఆస్తి క్రయ, విక్రయాలు జరిగి రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే నగరపాలక పాలక సంస్థ కార్యాలయంలో పేరుమార్పు (మ్యుటేషన్) జరగాలి. కానీ మ్యుటేషన్‌కు సంబంఽధించిన 400 ఫైళ్లు పెండింగ్‌లో ఉండటంతో ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదు ప్రక్రియపై ఆందోళన వ్యక్తంఅవుతోంది. మ్యుటేషన్ల ప్రక్రియ పెండింగ్‌లో పడటంతో ఆస్తి కొనుగోలు చేసినా, పాత యజమాని పేరుమీదే పోర్టల్‌లో ఉంటుందని ఆస్తులు కొనుగోలు చేసిన వారు వాపోతున్నారు. ఒకసారి ధరణిలో నమోదు అయితే ఇక మార్చరని జరుగుతున్న ప్రచారంతో ఆందోళన చెందుతున్నారు. కాగా అధికారులు మాత్రం ధరణి పోర్టల్‌లో నమోదు ఆస్తికి సంబంధించిన క్రయ విక్రయాల వివరాలు నమోదు చేస్తామని చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో నెలల తరబడి పేరుమార్పు ప్రక్రియ పెండింగ్‌లో ఉండటంతో ప్రస్తుతం గందరగోళం నెలకొంది.
రిజిస్ట్రేషన్.. వెంటనే పేరుమార్పు
మ్యుటేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి కావాలనే ఉద్దేశ్యంతో ఆస్తి విక్రయం జరిగి, రిజిస్ర్టేషన్ అయిన వెంటనే, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి నగరపాలక సంస్థ కార్యాలయానికి వివరాలు పంపేలా గతంలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మ్యుటేషన్ కోసం నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన రూ.మూడు వేలను కూడా రిజిస్ట్రేషన్ సమయంలోనే కమిషనర్ పేరు మీదుగా డీడీ తీసి చెల్లించేలా జీవో జారీచేసింది. రిజిస్ట్రేషన్ సమయంలోనే అన్నిపనులు పూర్తి కావటంతో నగరపాలక సంస్థ కార్యాలయంలో వెంటనే పేరుమార్పు జరగాలన్నదే ప్రభుత్వ ఉద్ధేశ్యం. కానీమ్యుటేషన్లు చేయటంలో తీవ్రజాప్యం చేస్తున్నారు. ఫలితంగా ధరణి నమోదు గందరగోళంగా మారింది.
నిర్లక్ష్యంతోనే జాప్యం
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కాగానే, సంబంధిత వ్యక్తి చెల్లించిన డీడీని నగరపాలక సంస్థ కార్యాలయానికి పంపాలి. సదరు డీడీని బ్యాంకులో జమ చేసిన తరువాతే మ్యుటేషన్ చేస్తారు. అయితే నగరపాలక సంస్థ నుంచి సంబంధిత విభాగానికి చెందిన ఉద్యోగి వెళ్లి డీడీని తీసుకురావాలి. నగరపాలక సంస్థ సిబ్బంది వెళ్లకపోవటంతో పేరుమార్పు ప్రక్రియలో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. గతంలో ఇలాగే 100 డీడీలు తేవటంలో నిర్లక్ష్యం వహించారు. వాటి కాలపరిమితి తీరిపోవటంతో నగరపాలక సంసకు రూ.మూడు లక్షల నష్టం వచ్చింది. ఆ మ్యుటేషన్లు పెండింగ్‌లో పడ్డాయి. తరువాత మ్యుటేషన్లకు సంబంధించిన వివరాలను పక్కన పడేస్తున్నారు. ఇల్లు, ఇతర ఆస్తులు కొనుగోలు చేసినవారు సంబంధిత డాక్యుమెంట్ ను నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది. అయితే డీడీ చెల్లించాం కదా అని అని చాలామంది పట్టించుకోవటం లేదు.
దీంతో వారి ఫైల్‌ను పక్కన పడేస్తున్నారు. ఇలా వివిధ కారణాలతో మ్యుటేషన్లలో జాప్యం జరిగి, ధరణి నమోదు సమయంలో గందరగోళం ఏర్పడింది. అయితే వారంరోజుల్లో పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లను పరిష్కరిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్‌జయంతి చెబుతున్నారు. ధరణి నమోదులో విక్రయం అనే కాలమ్‌లో కొన్న వారి పేరు నమోదు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని పేర్కొంటున్నారు.