భయమేదీ..?
ABN , First Publish Date - 2020-05-13T06:39:56+05:30 IST
కరోనా వ్యాప్తి నియంత్రణకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడంతో సుమారు 48రోజులుగా వాహనాలు కదల్లేదు.

లాక్‌డౌన్ సడలింపుతో నిబంధనలు తూచ్
తేలికగా తీసుకుంటున్న వాహనదారులు
నగరంలో మామూలు రోజుల్లో మాదిరిగా ట్రాఫిక్
సాయంత్రం ‘ఆరు’ తర్వాతా యథేచ్ఛగా రోడ్లపైకి జనం
పోలీసులు, అధికారులు హెచ్చరిస్తుస్తున్నా ఫలితం శూన్యం
ఖమ్మం క్రైం, మే 12 : కరోనా వ్యాప్తి నియంత్రణకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడంతో సుమారు 48రోజులుగా వాహనాలు కదల్లేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కానీ ఈ నెల 6న లాక్‌డౌన్ నుంచి కాస్త సడలింపు ఇవ్వడంతో ఒక్కసారిగా జనం నిబంధనలను పక్కనపెట్టి.. వాహనాలతో రోడ్డెక్కారు. ఫలితంగా ఖమ్మం నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. ఎక్కువశాతం మంది కనీస జాగ్రత్తలు, నిబంధనలు కూడా పాటించని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో మళ్లీ కరోనా ముప్పు ఏర్పడుతుందేమోనన్న ఆందోళన అందరిలో కనిపిస్తోంది. సోమవారం మాత్రం ప్రధాన నగరాలకు దీటుగా ఖమ్మంనగరంలోని వైరారోడ్డు వాహనాలతో కిక్కిరిసిపోయింది. వివిధ పనుల కోసం వచ్చిన వారితో మామూలు రోజుల్లో మాదిరిగా రద్దీగా కనిపించింది.
పోలీసు చెక్‌పోస్టుల ఎత్తివేత..
లాక్‌డౌన్ విధించిన నాటి నుంచి ప్రజలు రోడ్లపైకి పోలీసులు పకడ్బందీగా వ్యవహరించారు. ప్రధాన రహదారులు, కూడళ్లలో చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి.. 24గంట పాటు నిరంతరాయంగా నిఘా పెట్టారు. కరోనా నియంత్రణలో తమవంతు కృషిచేసి.. అందరి ప్రశంసలు అంకుకున్నారు. కానీ ఈనెల 6న లాక్‌డౌన్ సడలింపులు రావడంతో నగరంలోని ఏర్పాటు చేసిన చెకపోస్టులను ఒక్కసారిగా తీసేశారు. నగరంలోకి వచ్చే ప్రధాన ప్రాంతాల్లో మాత్రమే చెక్‌పోస్టులను ఉంచారు. దీంతో నగరంలో వాహనదారులు విచ్చలవిడిగా రాకపోకలు సాగిస్తున్నారు.
ఆరుదాటిన తర్వాతా రోడ్లపైకి..
లాక్‌డౌన్ సడలించినా.. సాయంత్రం ఆరుదాటిన తర్వాత కర్ఫ్యూ కట్టుదిట్టంగా ఉంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సాయంత్రం ఆరుదాటిన తర్వాత ఎవరూ రోడ్లపైకి రావద్దంటూ పోలీసులు, అధికారులు హెచ్చరిస్తున్నా ప్రజలు మాత్రం యథేచ్ఛగా రోడ్లపైకి వస్తున్నారు. మాస్కులు లేకుండా కనిపిస్తే జరిమానా విధించాలన్న నిబంధన ఉన్నా.. దాన్నీ లెక్కచేయడం లేదు. కొందరైతే మాస్కులు లేకుండానే రోడ్లపైకి వస్తున్నారు. దీంతో నగరంలోని పలుప్రాంతాలలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి మాస్కులు లేకుండా రోడ్లపైకి వచ్చిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. అత్యవసరమైతేనే మాస్కులు ధరించి మరీ బయటకు రావాలని సూచిస్తున్నారు.