ఆధార్ మార్చి.. అధికారులను ఏమార్చి!
ABN , First Publish Date - 2020-08-20T10:31:52+05:30 IST
ఖమ్మం నగరానికి కూతవేటు దూరంలో బల్లేపల్లి, రఘునాథపాలెం రెవెన్యూల్లో ఉన్న ఓ వెంచర్‌లో జరిగిన అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’లో

పక్కా ప్లాన్ ప్రకారమే రియల్ మాయ
వెంచర్ ప్లాన్‌లో మార్పులుచేసి అమ్మకాలు
కొనుగోలు చేసిన వారికి ఇంటి అనుమతులు కూడా?
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఇంకొన్ని విషయాలు వెలుగులోకి
ఖమ్మం, ఆగస్టు19: ఖమ్మం నగరానికి కూతవేటు దూరంలో బల్లేపల్లి, రఘునాథపాలెం రెవెన్యూల్లో ఉన్న ఓ వెంచర్‌లో జరిగిన అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం ప్రచురితమైన కథనంతో మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎప్పుడో వెంచర్ వేసి అమ్మకాలు పూర్తయినా అక్కడ భూమి ఖాళీగా కనిపించడంతో దానిపై కన్నేసిన సదరు రియల్ మాఫియా ఆ భూమిని కాజేసేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్న తర్వాతే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అందుకోసం తమ బ్యాచ్‌లోని ఓ వ్యక్తిని అన్నింటికీ సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. సదరు వ్యక్తి ఐడెంటిటీని సైతం పూర్తిగా మార్చి.. అధికారులను ఏమార్చినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో దేనికైనా గుర్తింపుగా ఆధార్‌కార్డును ఉపయోగిస్తున్నారు. అలాంటి ఆధార్ కార్డునే సదరు రియల్ మాఫియా బ్యాచ్ మార్చేసినట్టు తెలుస్తోంది. గతంలో హక్కుదారుడిగా ఉన్న హన్మంతరెడ్డి పేరిట కొత్తగా ఓ వ్యక్తికి గుర్తింపు కార్డు తయారుచేసి దొంగ రిజిస్ర్టేషన్లు చేసేందుకు ఉపయోగించినట్టు సమాచారం. కాగా రిజిస్ట్రేషన్ సమయంలో సదరు వ్యక్తి వెళ్లి రిజిస్టార్ దగ్గర తానే హన్మంతరెడ్డిగా రిజిస్ట్రేషన్లు పూర్తిచేయడం గమనార్హం.
అయితే అసలు హన్మంతరెడ్డికి, సదరు రియల్ బ్యాచ్ సృష్టించిన హన్మంతరెడ్డి ఫోటోలను పరిశీలిస్తే అసలు బాగోతం బయటకొస్తుందన్న విషయం స్పష్టమవుతోంది. అంతేకాదు 1990 నుంచి 1995 వరకు రిజిస్ట్రేషన్లు జరిగిన సమయానికే అసలు జీపీఏ పొందిన హన్మంతరెడ్డి వయసుకి.. రెండోసారి రియల్ మాఫియా తయారుచేయించిన నకిలీ హన్మంతరెడ్డి వయస్సును పరిశీలిస్తే దొంగ రిజిస్ట్రేషన్లు చేసే సమయంలోనే దానిని రిజిస్టర్ కార్యాలయ అధికారులు అడ్డుకుని ఉండేవారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర ఎంతనేది తేలాల్సి ఉండగా.. రిజిస్ట్రేషన్ చేసిన సమయంలో సాక్షులుగా సంతకాలు పెట్టినవారిని విచారిస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు దొంగ రిజిస్ట్రేషన్లు చేసే సమయంలో డమ్మీలను ముందుంచి అసలు రియల్ మాఫియా బ్యాచ్ తెరవెనుక ఉంటూ కాసులు కూడబెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి ప్రక్రియలో ఎక్కడైనా పట్టుబడితే.. అన్నీ తామే చూసుకుంటామంటూ సదరు బ్యాచ్.. డమ్మీలకు ఆర్థికపరమైన ఆఫర్లు ఇచ్చి తప్పులన్నీ తమపైనే వేసుకునేలా ఒప్పందాలు చేసుకుంటున్నట్టు సమాచారం.
వెంచర్ ప్లాన్‌లో మార్పులుచేసి అమ్మకాలు..
అంతేకాదు సదరు వెంచర్‌లో మొదట ఉన్న ప్లాన్‌ను పూర్తిగా మార్చేసిన తర్వాతే సదరు వ్యక్తులు అమ్మకాలు చేసినట్టు తెలిసింది. కాగా మొదటసారి ప్లాన్‌కి రెండోసారి ప్లాన్‌కు తేడా ఉండటంతో మొదటిసారి వెంచర్‌లో రోడ్లుగా ఉండగా.. ఆ తర్వాత రియల్ మాఫియా వేసిన ప్లాన్‌లో అవి ప్లాట్లుగా మారాయని కొందరు బాధితులు చెబుతున్నారు. మరికొందరు రెండోసారి కొనుగోలు చేసిన వారు ఇంటి అనుమతులు కూడా పొందినట్టు సమాచారం. ఆ తర్వాత విషయం తెలుసుకుని తాము కొనుగోలు చేసిన ప్లాట్లను విక్రయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇది వెలుగులోకి రావడంతో అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో అసలు యజమానులకు, రెండోసారి కొనుగోలు చేసిన వారికి ఇబ్బందికరంగా మారింది. మాఫియా బ్యాచ్ చేసిన పనికి మొదటిసారి కొనుగోలు చేసిన వారు పోలీస్ స్టేషన్లలో కేసులు పెడుతుండగా.. రెండోసారి కొనుగోలు చేసిన వారు ఏంచేయాలో తెలియక లబోదిబోమంటున్నారు. గతంలోనే భూ కబ్జాలపై, ల్యాండ్ మాఫియాపై దృష్టిసారించిన ఖమ్మం పోలీస్ కమిషనర్ అలాంటి వారిపై పీడీయాక్టు నమోదు చేయాలని కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీచేశారనీ, ఈ వ్యవహారంపైనా స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.