ఐటీ విస్తరణతో ఉద్యోగావకాశాలు : మంత్రులు నిరంజన్‌రెడ్డి, పువ్వాడ

ABN , First Publish Date - 2020-12-14T04:53:35+05:30 IST

రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాలు ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయని, విద్య, వైద్యం, వ్యాపార రంగాల్లో కొత్త జిల్లాలు కూడా పురోగతి సాధిస్తున్నాయన్నారు. ఐటీ కార్యకలాపాలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, జిల్లా కేంద్రాలకు కూడా విస్తరించి.. ఐటీహబ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవచ్చన్నారు.

ఐటీ విస్తరణతో ఉద్యోగావకాశాలు : మంత్రులు నిరంజన్‌రెడ్డి, పువ్వాడ
ఐటీహబ్‌ గురంచి మంత్రి నిరంజన్‌రెడ్డికి వివరిస్తున్న పువ్వాడ అజయ్‌

అన్ని జిల్లా కేంద్రాల్లో ఐటీహబ్‌ల ఏర్పాటు.. త్వరలో ఖమ్మం ఫేజ్‌-2 పనులు ప్రారంభం

ఖమ్మం, డిసెంబరు 13 (ఆంద్రజ్యోతి ప్రతినిధి) : రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో  ఐటీహబ్‌ల ద్వారా ఐటీ రంగాన్ని అభివృద్ది చేసి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించటం జరుగుతుందని  రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఇటీవల ప్రారంభమైన ఖమ్మం ఐటీహబ్‌ను ఆదివారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ ఖమ్మం ఐటీహబ్‌ ప్రాముఖ్యం, అవసరత గురించి మంత్రి నిరంజన్‌రెడ్డికి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాలు ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయని, విద్య, వైద్యం, వ్యాపార రంగాల్లో కొత్త జిల్లాలు కూడా పురోగతి సాధిస్తున్నాయన్నారు. ఐటీ కార్యకలాపాలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, జిల్లా కేంద్రాలకు కూడా విస్తరించి.. ఐటీహబ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక  యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవచ్చన్నారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ఐటీ సాంకేతిక పరిజ్ఞానంతో అన్నిరంగాల్లో అభివృద్ధిచెందే అవకాశం లభిస్తుందని, ఖమ్మం ఐటీహబ్‌ కూడా మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. త్వరలోనే ఖమ్మం ఐటీహబ్‌ రెండోదశ పనులను ప్రారంభిస్తామని, ఇప్పటికే ఇక్కడ 16 కంపెనీలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని వివరించారు. రాష్ట్ర రాజధానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున జిల్లా కేంద్రాల్లో కూడా ఐటీహబ్‌లలో పనిచేసేందుకు నిరుద్యోగ యువత ఆసక్తిగా ఉందని, ఖమ్మంలో 5వేల మంది నిరుద్యోగులు ఇంటర్వూలకు హాజరుకావడం ఇందుకు నిదర్శనమన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 

27న డీసీసీబీ శతాబ్ధి వేడుక : మంత్రి పువ్వాడ

ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ (డీసీసీబీ) ఏర్పడి ఈ నెల 27వతేదీకి వందేళ్లు పూర్తవుతుందని, ఈ సందర్భంగా శతాబ్ధి వేడుకలను నిర్వహిస్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఈ వేడుక ద్వారా ఖమ్మం డీసీసీబీ విశిష్టతను చాటి చెబుతామని, ఈ వేడుకకు పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు తరలివస్తారన్నారు. 

Updated Date - 2020-12-14T04:53:35+05:30 IST