టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం రాష్ట్ర అభివృద్ధి కోసమే

ABN , First Publish Date - 2020-04-28T10:42:00+05:30 IST

రాష్ట్ర అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించిం దని, రాష్ట్రసాధన ఉద్యమస్ఫూర్తితో, సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం రాష్ట్ర అభివృద్ధి కోసమే

కేసీఆర్‌ పాలనలో తెలంగాణ మున్ముందుకు

పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ 

పేదలకు నిత్యావసరాల పంపిణీ.. జిల్లా ఆసుపత్రిలో శ్రేణుల రక్తదానం

‘కరోనా’ నేపథ్యంలో ఇరుజిల్లాల్లో నిరాడంబరంగా వేడుకలు

ఇళ్లవద్ద జెండాలు ఆవిష్కరించిన నాయకులు 


ఖమ్మం, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : రాష్ట్ర అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించిం దని, రాష్ట్రసాధన ఉద్యమస్ఫూర్తితో, సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుంచగలి గామని రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం పార్టీఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ఖమ్మం జిల్లా కార్యాలయంలో పార్టీజెండాను ఆవిష్కరించారు. అంతకుముందు తన నివాసంలో కూడా జెండా ఎగురవేసిన మంత్రి భక్తరామదాసు కళాక్షేత్రంలో పువ్వాడ ఫౌండేషన్‌ తరుపున వెయ్యిమంది పేదలకు, చేతి, కులవృత్తుల వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్య కర్తలు పలువురు జిల్లా ఆసుపత్రిలో రక్తదానం చేశారు.


ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ ప్రసంగిస్తూ ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని ఎదిరించి, ప్రజలబతుకులు బాగుచేయాలని భావించి పార్టీని స్థాపించిన కేసీఆర్‌... ఉద్యమనేతగా.. రాష్ట్ర సాధనకోసం పోరాడారని గుర్తు చేశారు. శాంతియుత ఉద్య మంతోనే జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి అందరి మద్దతు కూడగట్టి.. అప్పటి కేంద్రంపై ఒత్తిడి పెంచి రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు. అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుంచేందుకు అహర్నిశలు కృషి చేశారని, అందుకే అభివృద్ధి చెందిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ దేశంలోనే ముందుందన్నారు. సీఎం కేసీఆర్‌ మరో వెయ్యేళ్లు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగి స్తున్నారన్నారు.


కరోనా తరుణంలో ప్రతీ పేదవాడికి 12కిలోల బియ్యం, రూ.1500 నగదు అందించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ఉద్యమనేత అయిన కేసీఆర్‌ కేబినేట్‌ లో తాను మంత్రిగా పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.  కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం మేయర్‌ పాపాలాల్‌, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఖమర్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల శేషగిరిరావు, కమర్తపు మురళి, ఆర్‌జేసీ కృష్ణ, బొమ్మెర రామ్మూర్తి,  డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, మద్దినేని స్వర్ణకుమారి, పాలెపు వెంకట రమణ, కార్పొరేటర్‌ పాలెపు సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.


ఇరుజిల్లాల్లో నిరాడంబరంగా కార్యక్రమాలు

లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇరుజిల్లాల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. పలువురు నేతలు తమ ఇళ్లపై పార్టీ జెండా ఎగురవేశారు. టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర రావు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాదులోని తన నివాసం లో జెండా ఎగురవేశారు. ఇక ఖమ్మం నగరంలోని నాయకులు, కార్పొరేటర్లు తమ డివిజన్లలో, ఇళ్ల వద్ద పార్టీ జెండాలు ఆవిష్కరించారు.


ఎంపీ పొంగులేటి క్యాంపు కార్యాలయం లో కార్యాలయ ఇన్‌చార్జ్‌ దయాకరెడ్డి,ఖమ్మంరూరల్‌ మండలంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, మధిరలో జడ్పీచైర్మన్‌ కమల్‌రాజ్‌, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్‌, మార్క్‌ఫెడ్‌ వైస్‌చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియ, జడ్పీచైర్మన్‌ కోరం కనకయ్య, కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, దమ్మపేటలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, మణుగూరులో ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలంలో రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకటరావుతో పాటు ఆయా మండలనాయకులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ జెండాలను ఆవిష్కరించారు. 


Updated Date - 2020-04-28T10:42:00+05:30 IST