ప్రతీ క్రీడాకారుడు ఫిట్‌నెస్‌తో ఉండాలి

ABN , First Publish Date - 2020-10-03T11:24:38+05:30 IST

ప్రతీ క్రీడాకారుడు ఫిట్‌నెస్‌తో ఉండి క్రీడల్లో రాణించాలని రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

ప్రతీ క్రీడాకారుడు ఫిట్‌నెస్‌తో ఉండాలి

రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

 ఉత్సాహంగా ఫిట్‌ ఇండియా ర్యాలీ

మినీలకారం ట్యాంక్‌బండ్‌ ప్రారంభం


ఖమ్మం స్పోర్ట్స్‌, అక్టోబరు2:  ప్రతీ క్రీడాకారుడు ఫిట్‌నెస్‌తో ఉండి క్రీడల్లో రాణించాలని రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. జిల్లా స్పోర్ట్‌ అధారిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఫిట్‌ఇండియా ర్యాలీని  నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. క్రీడా జ్యోతితో ర్యాలీలో ఆయన స్థానిక సర్ధార్‌పటేల్‌ స్టేడియం నుంచి లకారం మినీ ట్యాంక్‌బండ్‌ వరకు పాల్గొన్నారు.  ప్రజలు, క్రీడాకారులు రోజు వారీ జీవితంలో క్రీడలను భాగస్వామ్యం చేసుకొని ఫిట్‌గా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఫిట్‌ ఇండియా - ఫిట్‌ తెంగాణా ఫ్రీడమ్‌ రన్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.


ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఆర్‌ వి. కర్ణన్‌, మేయర్‌ పాపాలాల్‌, సుడా ఛైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ బత్తుల మొరళీ ప్రసాద్‌, కార్పొరేటర్‌ కమర్తపు మొరళి, డీవైఎస్‌వో పరంధామరెడ్డి, బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు సిరిపురపు సుదర్శనరావు, యువజన సర్వీసుల డీటీ మురళీధర్‌, అథ్లెటిక్స్‌అసోసియేషన్‌ సెక్రెటరీ షఫీ, వాలీబాల్‌ అసోసియేషన్‌ సెక్రెటరీ గోవిందరెడ్డి, అథ్లెటిక్స్‌ కోచ్‌ గౌస్‌, వాలీబాల్‌కోచ్‌ అక్బర్‌అలీ, క్రికెట్‌ నెట్స్‌ ఇంచార్జి మతిన్‌, స్కేటింగ్‌ కోచ్‌ సురేష్‌, పలువురు పీఈటీలు, క్రీడాకారులు పాల్గోన్నారు.


పేదల ఇళ్లకు భద్రత కల్పించేందుకే నమోదు.

ఖమ్మంకార్పొరేషన్‌,అక్టోబరు2:పేదల ఇళ్లకు భద్రత కల్పించటంతో పాటు హక్కులు కల్పించేందుకు నిర్మాణాలను నమోదు చేస్తున్నారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని 2,3,4,5,6,42,44,45 డివిజన్లలో పర్యటించి, పేదలను కలిసి నూతన రెవెన్యూ చట్టంపై మంత్రి అవగాహన కల్పించారు. వ్యవసాయ తరహాలోనే వ్యవసాయేతర ఆస్తులకు కూడా పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. అధికారులు వేగంగా తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు.


అధికారులు, సిబ్బంది నిర్మాణాలు, కుటుంబ వివరాలు ఎలాంటి తప్పులు లేకుండా తీసుకోవాలని, ఎందుకంటే ఒకసారి ఆన్‌లైన్‌లో నమోదు అయితే దానిని మార్చటం కుదరదని మంత్రి స్పష్టం చేశారు. ఇంటి యజమాని చనిపోతే ఎలాంటి వివాదాలకు తావులేకుండా అతడి వారసుల పేరుమీద మ్యుటేషన్‌ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అనురాగ్‌ జయంతి, మేయర్‌ జీ.పాపాలాల్‌, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళి, జుడా ఛైర్మన్‌ బచ్చు విజయ్‌ కుమార్‌, కార్పొరేటర్లు కొనకంచి సరళ, సత్వాది వెంకన్న, నాగండ్ల కోటి, రుద్రగాని శ్రీదేవి, తోట ఉమారాణి పాల్గొన్నారు.


వాకర్స్‌ ప్యారడైజ్‌ క్లబ్‌తో ఆరోగ్యం, ఆహ్లాదం

మినీ లకారం ట్యాంక్‌బండ్‌ ప్రారంభోత్సవంలో మంత్రి అజయ్‌కుమార్‌


ఖమ్మం స్పోర్ట్స్‌, అక్టోబరు 2: నగరంలో మినీ లకారం ట్యాంక్‌బండ్‌లోని వాకర్స్‌ క్లబ్‌లో ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం లభిస్తుందని రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కోన్నారు. శుక్రవారం మినీ లకారం ట్యాంక్‌బండ్‌, వాకర్స్‌ ప్యారడైజ్‌ను ప్రారంభించారు. మినీలకారం ట్యాంక్‌బండ్‌ నగరానికి మరో మణిహారమన్నారు.  సుమారు రూ.2 కోట్ల నిధులతో పార్క్‌ను ఆధునికంగా నిర్మించి అందులో వాకింగ్‌, జాగింగ్‌, యోగా, ఓపెన్‌ జిమ్‌, గ్రీనరీ, ఆక్యుపంక్చర్‌ లాంటి అనేక సదుపాయాలను కల్పించినట్లు ఆయన పేర్కోన్నారు.


నగరంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌లో బల్క్‌చెత్తను సేకరించేందుకు వేస్ట్‌ ఆన్‌వీల్స్‌ కార్యక్రమ పోస్టర్‌ను కలెక్టర్‌ కర్ణన్‌, అదనపు కలెక్టర్‌ స్నేహలత, మున్సిపల్‌ కమీషనర్‌ అనురాగ్‌ జయంతితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఉత్తమ శానిటరీ వర్కర్లకు ప్రశంసా పత్రాలు, టోపీలు అందచేశారు. కార్యక్రమంలో మేయర్‌ పాపాలాల్‌, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ బత్తుల మొరళీ, కార్పొరేటర్లు చావా నారాయణరావు, కమర్తపు మొరళి, కొత్తపల్లి నీరజ, టీఆర్‌ఎస్‌ నాయకులు సిరిపురపు సుదర్శనరావు తదితరులు పాల్గోన్నారు.

Updated Date - 2020-10-03T11:24:38+05:30 IST