23 నుంచి మార్కెట్ కార్మికుల సమ్మె?
ABN , First Publish Date - 2020-06-22T10:31:34+05:30 IST
నగరంలోని వ్యవసాయ మార్కెట్‌లో పనిచేస్తున్న కార్మికులు సమ్మెకు దిగబోతున్నారా? అందుకు అవుననే అంటున్నాయి మార్కెట్

దిగుమతి కార్మికులకు పనిదొరకదని ఆందోళన
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్న మార్కెట్ ఛైర్మన్ మద్దినేని
ఖమ్మం మార్కెట్, జూన్ 20: నగరంలోని వ్యవసాయ మార్కెట్‌లో పనిచేస్తున్న కార్మికులు సమ్మెకు దిగబోతున్నారా? అందుకు అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. మార్కెట్‌లో ఖరీదు వ్యాపారుల వద్ద ఎగుమతి విభాగంలో పనిచేసే కార్మికులు హమాలీ రేట్లు పెంచాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యులకు సమ్మె నోటీసు అందించారని సమాచారం. సమ్మె ఈనెల 22 అర్ధరాత్రి 12 గంటల నుంచి అమలు చేయనున్నట్లు కార్మికులు వ్యాపారులకు సమ్మెకు వెళుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని కొందరు వ్యాపారులు పేర్కోంటున్నారు. మరోవైపు మార్కెట్‌లో ఎగుమతి కార్మికులు సమ్మెకు దిగనుండటంతో దిగుమతి శాఖ ( కమీషన్ వ్యాపారుల ) వద్ద పని చేసే కార్మికులు డోలాయమానంలో పడ్డారు. ఖరీదు వ్యాపారులు మార్కెట్‌లో, కోల్డ్‌స్టోరేజీలలో పంట కొనుగోలు చేయకపోతే తమకు పని దొరకదని, రైతులు సైతం పంటను మార్కెట్‌కు తీసుకురారని ఆందోళన చెందుతున్నారు. సమ్మె వల్ల వ్యవసాయ మార్కెట్‌లోని మిర్చీ, పత్తి, రైస్‌మిల్లులు, దాల్, ఆయిల్ మిల్లులలో పని చేసే హమాలీల పై కూడా ప్రభావం ఉంటుండటంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. నగరంలోని మార్కెట్‌లో ఎగుమతి కార్మికులు సమ్మెకు దిగితే రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్ళు యధావిధిగా నిర్వహించేందుకు మార్కెట్ అధికారులు విధివిధానాలను రూపొందిస్తున్నారు. కార్మికులు ఛాంబర్ ప్రతినిధులకు ఇచ్చిన సమ్మె నోటీసు మార్కెట్ కమిటీకి ఇవ్వకపోవడంతో సమ్మె కొనసాగుతుందో లేదో అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. హమాలీ ధరలు పెంచితే రైతులపై మరింత భారం పడుతుందని రైతు సంఘం నాయకులు సైతం వాపోతున్నారు.
వాయిస్ రైతులకు ఇబ్బందులకు గురి చేయెద్దు..మద్దినేని వెంకటరమణ, మార్కెట్ కమిటీ ఛైర్మన్
నగరంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఎగుమతి కార్మికులు రైతులను ఇబ్బందులు గురిచేయవద్దు. కార్మికులు సమ్మె విషయాన్ని పునరాలోచించుకోవాలి. హమాలీ ధరలు వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కంటే ఖమ్మంలోనే ఎక్కువ చెల్లిస్తున్నారు. కార్మికులు సమ్మెకు పోయే విషయం మార్కెట్ కమిటీకి తెలియదు. ప్రస్తుత కరోనా వైరస్ కష్ట కాలంలో రైతులను హమాలీలు ఇబ్బందులు గురిచేయడం మంచిది కాదు. కొంత సమయం ఇస్తే కార్మికులకు న్యాయం చేస్తాం. ప్రస్తుతం పెట్టుబడుల సీజన్‌లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన భాధ్యత మార్కెట్ కమిటీతో పాటు కార్మికులకు, వ్యాపారులకు ఉంది.
వివిద మార్కెట్‌లలో హమాలీ ధరలు క్రింది విధంగా
పంట రకం వరంగల్ మార్కెట్‌లో ఖమ్మం మార్కెట్‌లో
మిర్చీ బస్తాకుఅడ్డాలో
దిగుమతి, నెట్టు కట్టుటకు రూ. 2. 26 పై రూ. 8. 02 పై
బస్తా రిపేరు, రంగుకు రూ. 7. 61 పై రూ. 8. 97 పై
లారీ లోడింగ్‌కు రూ. 5. 96 పై రూ. 6. 98 పై
కోల్‌స్ట్టోరేజీలో
బస్తా లోపల పెట్టినందుకు రూ. 11. 53 పై రూ. 14. 45 పై
బయటకు తీసి తిరిగి నెట్ కడితే రూ. 14. 10 పై రూ. 19. 01 పై
మరొక ప్లోర్‌కు బస్తాను మార్చితే రూ. 6. 15 పై రూ. 11. 56 పై
మిర్చీ లారీకి లోడింగ్ చేస్తే రూ. 5. 98 పై రూ. 6. 41 పై
ట్రాక్టర్, డీసీఎంకు లోడింగ్ చేస్తే రూ. 3. 68 పై రూ. 6. 41 పై
పత్తిలో
కోత, కుట్టుడు, ఎగుమతికి రూ. 6.50 పై రూ. 8. 00 లు
అపరాలలో 60 కేజీల వరకు రూ. 9. 48 పై రూ. 11. 65 పై