‘డబుల్‌బెడ్‌రూం’తో మభ్యపెడుతున్న కేసీఆర్
ABN , First Publish Date - 2020-10-04T09:31:23+05:30 IST
అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్‌బెడ్‌రూం ఇల్లు ఇస్తామని ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
చింతకాని, అక్టోబరు 3: అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్‌బెడ్‌రూం ఇల్లు ఇస్తామని ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ తరువాత వాటి ఊసే మరిచారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని తిమ్మినేనిపాలెం, పాతర్లపాడు గ్రామాల్లో జరుగుతున్న డబుల్ ఇళ్ల నిర్మాణాలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన పేదలందరూ డబుల్ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారని ఇప్పటివరకు చింతకాని మండలంలో ఏడేళ్లలో కేవలం 274 ఇళ్లు నిర్మించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
గత ఎన్నికల సమయంలో సొంత స్థలాల్లో ఇంటి నిర్మాణానికి రూ.ఐదులక్షలు ఇస్తామని ప్రకటించి ప్రజలను మోసం చేశారని ఆక్షేపించారు. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత లేకపోవడంతో కొన్ని ఇళ్లు పగుళ్లు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ హయాంలో పేదప్రజల కోసం పటిష్టంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని, అవి ఇప్పటికీ చెక్కుచెదరలేదని గుర్తు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు పాల్గొన్నారు.