జాతిపిత త్యాగం వృథాకావొద్దు
ABN , First Publish Date - 2020-10-03T11:26:30+05:30 IST
దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు పూజ్య మహత్మాగాంధీ ఎన్నోత్యాగాలు చేశారని, ఆయన త్యాగాలు ..
కేంద్ర వ్యవసాయచట్టంతో కార్పొరేట్ శక్తులకే ప్రయోజనం
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
ఖమ్మంలో సంతకాల సేకరణ ప్రారంభం
కొత్తగూడెంలో పర్యటించిన సీనియర్‌నేత వి.హన్మంతరావు
వ్యవసాయచట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన
ఖమ్మం / కొత్తగూడెం, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు పూజ్య మహత్మాగాంధీ ఎన్నోత్యాగాలు చేశారని, ఆయన త్యాగాలు వృథా కావొద్దని, బాపూజీ కన్న కలలు నిజం చేసేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు(వీహెచ్) పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని గాంధీచౌక్‌లో ని బాపూ విగ్రహానికి మల్లు భట్టి విక్రమార్క, భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం ఎంజీరోడ్డులోని గాంధీ విగ్రహానికి వీహెచ్ నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఖమ్మంలో సంతకాల సేకరణను, కొత్తగూడెంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఖమ్మంలో తొలిసంతకం చేసిన భట్టి విక్రమార్క సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ బాపూజీ చూపిన బాటకు భిన్నంగా బీజేపీ పాలన సాగుతోందని విమర్శించారు. ఇటీవల ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. నాడు భారతదేశంలో ఈస్టిండియా పేరుతో వచ్చిన బ్రిటీష్ కంపెనీలు పోయి ఇప్పుడు బీజేపీ పాలనలో వెస్ట్ ఇండియా పేరుతో అంబాని, అదాని, అమెజాన్ లాంటి కార్పొరేట్ శక్తులు మోహరించాయన్నారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టంతో రైతులకు, వ్యాపారులకు, హామాలీలకు, వినియోగదారులకు రక్షణలేకుండాపోతుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులన్నీ కార్పొరేట్‌శక్తుల్లోకి వెళ్లి బ్లాక్‌మార్కెట్ పెరుగుతుందని, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉందని.. దీనిని ప్రజలు వ్యతిరేకించి సంతకాల సేకరణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశంలో దళితులు, బహుజనులు, మైనారిటీలు, గిరిజనులకు రక్షణ లేకుండాపోయిందని, ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న దారుణాలపై గళం విప్పిన రాహుల్‌గాంధీపై లాఠీచార్జీ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాహుల్‌గాంధీకి అందరూ అండగా నిలవాలని, పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నగర అధ్యక్షుడు జావీద్, కార్పొరేటర్లు దీపక్‌చౌదరి, బాలగంగాధర్‌తిలక్, తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రైతు వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. తొలుత ఎంజీరోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించిన అనంతరం లక్ష్మీదేవిపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి ప్రారంభమైన ప్రదర్శన మొర్రేడువాగు బ్రిడ్జి మీదుగా సూపర్ బజార్ సెంటర్, ఎంజీ రోడ్, రైల్వేస్టేషన్ వరకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ కేంద్ర వ్యవసాయ బిల్లు రైతులకు పూర్తి వ్యతిరేకమైందని, కేవలం కార్పొరేట్లకు మాత్రమే అనుకూలంగా ఉందని, అలాంటి బిల్లును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అమానవీయ ఘటనలపై స్పందించిన రాహుల్‌గాంధీ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతుంటే పోలీసులు అడ్డగించి, లాఠీచార్జ్ చేసి, అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. ఈ ర్యాలీలో టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ, మాజీ జడ్పీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత చందా లింగయ్య, జాతీయ ట్రేడ్ యూనియన్ నాయకులు గొల్లపల్లి దయానంద్ , కాంగ్రెస్ సీనియర్ నాయకులు దోర్నాల పాపారావు, ఏనుగుల అర్జునరావు, రాయల శాంతయ్య, ఎస్‌ఏ. జలీల్, తోటదేవి ప్రసన్న, కే. నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.