మలివిడతకు కట్టుదిట్టంగా..

ABN , First Publish Date - 2020-11-30T04:53:37+05:30 IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను పాటిస్తూ.. నిర్ధారణ పరీక్షలు, ఐసోలేషన్‌ సెంటర్లను నిర్వహిస్తోంది.

మలివిడతకు కట్టుదిట్టంగా..

కరోనా సెకండ్‌వేవ్‌ను తట్టుకునేలా పకడ్బందీ చర్యలు

తొలివిడత అనుభవాలు, లెక్కలను బేరీజు వేసుకుంటున్న వైద్యశాఖ అధికారులు 

ఉమ్మడిఖమ్మంలో మున్ముందు పెరగనున్న పరీక్షల సంఖ్య

కొవిడ్‌ పరీక్షలకు ఆర్‌బీఎస్‌కే వాహనాల వినియోగం

డైరెక్టర్‌ అఫ్‌ హెల్త్‌ నుంచి అందిన ఆదేశాలు 

ఖమ్మంసంక్షేమవిభాగం, నవంబరు 29: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను పాటిస్తూ.. నిర్ధారణ పరీక్షలు, ఐసోలేషన్‌ సెంటర్లను నిర్వహిస్తోంది. ఇంతవరకు బాగానే ఉండగా.. డిసెంబర్‌ నుంచి కొవిడ్‌ సెకెండ్‌వేవ్‌ ఉంటుందని అంచనా వేసిన రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అధికారులు.. దానిని కూడా ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన చర్యలతో ముందుకుసాగాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తొలివిడత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల వారీగా ఉన్న జనాభా, ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల శాతాన్ని లెక్కలు తీశారు. రెండో విడతలో పకడ్బందీగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని, పల్లెలు, తండాలు, గూడేలకు వెళ్లి నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో  రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులకు కరోనా పరీక్షల పెంపుపై మార్గదర్శకాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో కరోనా పరీక్షలు పెంచేందుకు మౌళిక సౌకర్యాల్లో బాగంగా ఆర్‌బీఎస్‌కే ఉద్యోగులు, వాహనాలను వినియోగించాలని సూచించారు. 

ఇప్పటి వరకు 3,34,134మందికి పరీక్షలు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10,69,261 జనాబా ఉండగా ఇప్పటి వరకు 1,73,609మందికి అంటే 16శాతం మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఇప్పటి వరకు 17,953మందికి పాజిటివ్‌లు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో 14,01,639 జనాభా ఉండగా వారిలో 1,60,525 మందికి అంటే 11శాతం మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరిలో 23,863మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఇలా అవసరం మేరకు నిర్వహించిన పరీక్షలతో ఇప్పటి వరకు కొవిడ్‌ నియంత్రణలో ఉమ్మడిజిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉంది. అయితే జిల్లా సరిహాద్దుల్లోని ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూలీ పనులకు వచ్చిన కార్మికులు, సింగరేణి సంబంధీకులతో కొవిడ్‌ ప్రభావం ఉందని భావించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహించి కరోనా పరీక్షలు చేశారు. ఆయా ప్రాంతాల్లో 18శాతం వరకు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తర్వాత దశలో ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం పట్టణాల్లోని వ్యాపారులు, దుకాణాల్లో పనిచేసేవారికి ప్రతీ పక్షం రోజులకు పరీక్షలు చేయించుకోవాలని ప్రచారం చేశారు. కానీ కేవలం 4శాతం మంది వ్యాపారులు మాత్రమే కరోనా పరీక్షలు చేయించుకున్నారు. 

ప్రజల వద్దకే కరోనా పరీక్షలు

కొవిడ్‌ నివారణకు ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీటింగ్‌ నినాదంతో పనిచేయాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు అధికారులకు ఆదేశాలిచ్చారు. జిల్లాలో ఉన్న జనాభాకు సాధ్యమైన మేరకు కరోనా లక్షణాలున్నా లేకున్నా.. కోరిన వారికి గ్రామంలోనే పరీక్షలు నిర్వహించేలా కార్యాచరణ చేశారు. ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రోజుకు 50పరీక్షలకు తగ్గకుండా కార్యాచరణ ప్రకటించారు. వైద్యఆరోగ్యశాఖలోని ఉద్యోగులు క్షేత్రస్థాయిలోనే పరీక్షలు చేసేలా ఆదేశాలిచ్చారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాల స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. ఇకపై రోజుకు 3వేల వరకు పరీక్షల లక్ష్యంతో ఆర్‌బీఎస్‌కే వాహనాలను వినియోగించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ డైరెక్టర్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైద్యఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో ఖమ్మం జిల్లాలోని 11ఆర్‌బీఎస్‌కే వాహనాలు, భద్రాద్రి జిల్లాలోని ఆర్‌బీఎస్‌కే వాహనాలను వినియోగించనున్నారు. 

కరోనా పరీక్షలకు ఆర్‌బీఎస్‌కే వాహనాలు.. 

డాక్టర్‌ అలివేలు, ఖమ్మం జిల్లా ఆర్‌బీఎస్‌కే ఇన్‌చార్జ్‌ 

కరోనా కట్టడిలో భాగంగా కొవిడ్‌ పరీక్షలను పెంచేందుకు ఆర్‌బీఎస్‌కే వాహనాలను వినియోగించాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు నుంచి ఆదేశాలొచ్చాయి. దీంతో జిల్లాలోని 11ఆర్‌బీఎస్‌కే వాహనాలను కొవిడ్‌ పరీక్షలకు ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించాం. ప్రతీ వాహనంలో ఇద్దరు వైద్యులు, ఒక ఏఎన్‌ఎం, ఒక ఔషధ ఉద్యోగితో పాటు స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం అధికారులు కరోనా పరీక్షలకు వెళ్లేలా సూచనలు చేశాం. 


Updated Date - 2020-11-30T04:53:37+05:30 IST