మందగించిన మలేరియా

ABN , First Publish Date - 2020-12-28T04:52:52+05:30 IST

గత ఏడాదితో పోలిస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఏడాది మలేరియా కేసుల పెరుగుల వేగం మందగించింది. 2019లో 604 మలేరియా కేసులు నమోదు కాగా ఈసారి కేవలం 356 మలేరియా కేసులు మాత్రమే నమోదు కావడం విశేషం.

మందగించిన మలేరియా
చండ్రుగొండ మండలంలోని బెండలపాడు వలస గ్రామంలో మలేరియాపై అవగాహన కల్పిస్తున్న డీఎంవో(ఫైల్‌ఫోటో)

భద్రాద్రి జిల్లాలో కేసులు  తగ్గుముఖం

ఈ సీజన్‌లో 356 నమోదు

ఆ శాఖ పోస్టుల భర్తీలో మళ్లీ నిరాశే

భద్రాచలం, డిసెంబరు 27: గత ఏడాదితో పోలిస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఏడాది మలేరియా కేసుల పెరుగుల వేగం మందగించింది. 2019లో 604 మలేరియా కేసులు నమోదు కాగా ఈసారి కేవలం 356 మలేరియా కేసులు మాత్రమే నమోదు కావడం విశేషం. జనవరి నుంచి డిసెంబరు వరకు మలేరియా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా ఆ శాఖలో అధికారులు సిబ్బంది పోస్టుల భర్తీలో మళ్లీ నిరాశే మిగిలింది. మలేరియా స్ర్పేయింగ్‌ గ్రామాల సంఖ్యను సైతం గత ఏడాది మీద ఈ ఏడాది తగ్గించారు. అయితే కరోనా వైరస్‌ నేపధ్యంలో ఈ ఏడాది మార్చి నుంచి ప్రజలు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండటం ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికే పరిమితం కావడంతో పాటు మలేరియా శాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల మలేరియా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గిందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచిభారీగా రాకపోకలు లేకపోవడంతో మలేరియా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.  

ఈ ఏడాది 356 పాజిటివ్‌ కేసులు మాత్రమే

జిల్లాలోని 29 పీహెచ్‌సీల పరిధిలో 356 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు మలేరియా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది 444 గ్రామాలను మలేరియా తీవ్ర ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేకంగా మలేరియా కేసులనుఅదుపు చేసేందుకు పిచికారి చేసినట్లు తెలిపారు. దీంతో గత ఏడాది 604పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 356 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. కాగా స్ర్పేయింగ్‌ ఇతరత్రా పనుల కోసం రూ.40లక్షలతో బడ్జెట్‌ను రూపొందించి ఉన్నతాధికారులకు పంపగా అందుకు సంబంధించిన నిధులు సైతం వచ్చినట్లు అధికారులు తెలిపారు.  

క్రమంగా తగ్గుతున్న మలేరియా కేసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మలేరియాపాజిటివ్‌ కేసులు ఏటా తగ్గుముఖం పడుతున్నాయి. 2015లో 1,600 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 2016లో 1,081, 2017లో 726, 2018లో 447, 2019లో 604, 2020లో డిసెంబరు 22వరకు 356 కేసులు నమోదయ్యాయి. దీంతో గతంతో పోలిస్తే జిల్లాలో మలేరియా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా  ఈ ఏడాది మార్చి నుంచి కొవిడ్‌ కేసులు జిల్లాలో నమోదు అవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో వారు వైద్య పరీక్షలు చేయించుకోవడంతో ఎటువంటి సమస్య ఏర్పడలేదని అధికారులు పేర్కొంటున్నారు.  

పోస్టుల భర్తీలో మళ్లీ నిరాశే

జిల్లాలో మలేరియాశాఖలో పోస్టుల భర్తీలో మళ్లీ నిరాశే మిగిలింది. 2020 సంవత్సరం ముగుస్తున్నా గతంలో మాదిరే మలేరియా శాఖలో కీలక పోస్టుల భర్తీపై ప్రభుత్వం ఏ మాత్రం దృష్టి కేంద్రీకరించకపోవడం పట్ల సర్వత్రా ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో జిల్లామలేరియా అధికారి పోస్టు ఒకటి మంజూరు కాగా ఇంత వరకు భర్తీ చేయలేదు. దీంతో ఇన్‌చార్జ్‌గా నర్సాపురం వైద్యులు వ్యవహరిస్తున్నారు. ఏవో పోస్టు ఒకటి మంజూరు కాగా అది ఖాళీగా ఉంది. సబ్‌ యూనిట్‌ ఆఫీసరు పోస్టు ఒకటి, ఎంపీహెచ్‌ఎస్‌(పురుషులు) 15, ఎంపీహెచ్‌ఎస్‌(స్త్రీ)ఒకటి ఖాళీగా ఉన్నాయి. హెల్త్‌ అసిస్టెంట్‌(పురుషులు) పోస్టులు 36 ఖాళీ ఉండగా, హెల్త్‌ అసిస్టెంట్‌(మహిళలు) 71 ఖాళీగా ఉన్నాయి. ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు ఎనిమిది, ఆశాలు 35, డీవీబీడీ కన్సల్‌టెంట్‌ పోస్టు ఒకటి, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టు ఒకటి ఖాళీగా ఉంది. ఈ నేపధ్యంలో నూతన సంవత్సరంలో అయినా ఈ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాలని గిరిజనులు కోరుతున్నారు. 


Updated Date - 2020-12-28T04:52:52+05:30 IST