మిడతల కలకలం

ABN , First Publish Date - 2020-05-30T10:26:08+05:30 IST

మిడతల దండు దాడిచేయబోతోందన్న ప్రచారంతో అందరూ ఆందోళన

మిడతల కలకలం

సత్తుపల్లి, మధిర ప్రాంతాల్లో కనిపించిన వైనం

‘జిల్లేడు’ మిడతలుగా గుర్తింపు


సత్తుపల్లిరూరల్‌/మధిర రూరల్‌, మే 29:  మిడతల దండు దాడిచేయబోతోందన్న ప్రచారంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలోనే పలుచోట్ల కనిపిస్తున్న మిడతలు కలవరం రేపుతున్నాయి. అవి వలస వచ్చే దండులోని మిడతలేమోనని రైతులు భయపడుతున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా గోదావరి పరివాహక జిల్లాలపై మిడతల దండు ప్రభావం చూపించవచ్చని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో శుక్రవారం ఖమ్మంజిల్లా మధిర, సత్తుపల్లి ప్రాంతాల్లో రహదారుల పక్కన ఉన్న జిల్లేడు, ఇతర మొక్కలు, చెట్లపై మిడతలు కనిపించాయు.


సత్తుపల్లి పట్టణం జేవీఆర్‌పార్కు వద్ద కూడా రోడ్డు పక్కన జిల్లేడు చెట్లపై సుమారు300మిడతలు కనిపించడంతో వెంటనే వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళ్లారు. మధిర మండలం ఆత్కూరు గ్రామంలో ఒక చెట్టుపై కనిపించిన మిడతల్లో ఒక దానిని పట్టుకున్న స్థానికులు వ్యవసాయ అధికారికి చూపించగా అవి స్థానికంగా కనిపించేవని, వాటి వల్ల హాని ఉండదని తెలిపారు. అయితే ఇవి రోజూ మనకు కనిపించే జిల్లేడు మిడతలని వైరాలోని ఖమ్మం జిల్లా కృషి విజ్ఞానకేంద్రం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ హేమంత్‌కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఇవి ఎక్కువగా జిల్లేడు చెట్లపై కనిపిస్తాయని, వీటివల్ల ఎలాంటి పంటనష్టం ఉండదని ఆయన వివరించారు. 

Updated Date - 2020-05-30T10:26:08+05:30 IST