అక్రమానికి అడ్డేదీ ?

ABN , First Publish Date - 2020-05-18T10:04:39+05:30 IST

లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులతో నిర్మాణ రంగం ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లాలో వివిధ రూపాల్లో ఇసుక దందా మళ్లీ ప్రారంభమైంది.

అక్రమానికి అడ్డేదీ ?

ఉమ్మడి జిల్లాల్లో యథేచ్ఛగా ఇసుక దందా

నదులు, వాగులనుంచి అక్రమంగా తరలింపు

అడుగంటుతున్న భూగర్భ జలలు

ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులు

పట్టించుకోని అధికారులు


కరకగూడెం/దుమ్ముగూడెం/ఖానాపురం, మే 17: లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులతో నిర్మాణ రంగం ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లాలో వివిధ రూపాల్లో ఇసుక దందా మళ్లీ ప్రారంభమైంది. నిర్మాణదారుల అవసరాలనే ఆసగా చేసుకొని ఇసుకాసురులు దాందా సాగిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలోని వాగులను ఆధారంగా చేసుకొని ఇసుక దందా జోరుగా సాగుతోంది. కరకగూడెం మండల కేంద్రంలోని పెద్దవాగు నుంచి రాత్రి పగలు తేడలేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా సాగుతోంది. మండల కేంద్రం నుంచే ఈ అక్రమ రవాణా సాగుతున్నా అధికారులు పట్టించుకోపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


మండల పరిధిలోని గొళ్లగూడెం, అనంతారం, చొప్పాల, మోతే, చిరుమళ్ల, రేగుళ్ల, కలవలనాగారం, భట్టుపల్లి నుంచి ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఇష్టానుసారంగా ఇసుక తోడుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి సమస్య ఏర్పడుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబందిత అధికారులు స్పందించి ఇసుక అక్రమ అక్రమ రవాణాను అడ్డుకోవాలని కోరుతున్నారు. దీనిపై కరకగూడెం తహసీల్దార్‌ విల్సన్‌ను వివరణ కోరగా ఇసుక అక్రమ  రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అక్రమంగా ఇసుక, మట్టి తోలకాలకు పాల్పడితే ట్రాక్టర్‌ యాజమనిపైౖ కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతులు ఉన్నా రాత్రి వేళల్లో ఇసుక తోలకాలు చేయకూడదన్నారు.  


అవసరాన్ని బట్టి బాదేస్తున్నారు 

దుమ్ముగూడెం మండలం గుబ్బలమంగివాగు, సీతారాంపురం, తూరుబాక, సింగారం, పైడిగూడెం ప్రాంతాల్లో గోదావరి నుంచి నిత్యం ఇసుక అక్రమ తరలింపు జోరుగా సాగుతోంది. అధికారులు దాడులు చేసి పట్టుకొని జరిమానాలు విధించిన ప్రతిసారి స్మగ్లర్లు ఇసుక రేటును అమాంతం పెంచేస్తున్నారు. ఒకప్పుడు ట్రాక్టరు ట్రక్కు ఇసుక వెయ్యి రూపాయలుండగా తాజాగా రూ.2వేల నుంచి రూ.3వేల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలా అక్రమంగా ఇసుక తరలించడంతో ప్రభుత్వ ఆధాయానికి కూడా భారీగా గండిపడుతోంది. స్థానిక అవసరాల కోసం ఇసుక రవాణా విధానాన్ని రూపొందిస్తే,  ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ప్రజలకు నిర్మాణ వ్యయం తగ్గుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


 ఖమ్మంలో ట్రాక్టర్‌ ఇసుక రూ.10వేల పైనే

టీఎస్‌ఎండీసీ ఆన్‌లైన్‌ ద్వారా ఇసుక కూపన్లు ఇస్తున్నా ఇసుకదందా మాత్రం ఆగడంలేదు. ఖమ్మంలోని ఇసుకడిపోలో ఇసుక అందుబాటులో ఉన్నా రోజుకు 30ట్రాక్టర్లకే కూపన్లు ఇస్తుండడంతో ఇసుకాసులు రెచ్చిపోతున్నారు. ఇసుక డిపో పక్కనే అక్రమంగా డంపింగ్‌ చేసి ట్రాక్టర్‌ బాడీలెవల్‌ ఇసుకను రూ.10వేల నుంచి 12వేల వరకు అమ్ముతున్నారు.


ఇసుక డిపోలో పూర్తిస్థాయిలో విక్రయాలు జరిపితే ఈ పరిస్థితి ఉండదని నిర్మాణదారులు వేడుకుంటున్నా పట్టించుకోకుండా అధికారులు ఇసుక అక్రమ రవాణదారులకు పరోక్షంగా సహకరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గోదావరి నుంచి వచ్చే ఇసుకను లారీ యజమానులు ఖమ్మం బైపాస్‌రోడ్డులో డంప్‌చేసి టన్ను రూ.2500ల నుంచి 3వేల వరకు విక్రయాలు కొనసాగిస్తున్నారు. టీఎస్‌ఎండీసీ ఇసుకను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తే టన్ను రూ.1,500నుంచి రూ.1,800వరకు అందుబాటులోకి వస్తుందని గృహనిర్మాణదారులు కోరుతున్నారు.  

Updated Date - 2020-05-18T10:04:39+05:30 IST