లాక్‌డౌన్‌ సక్సెస్‌

ABN , First Publish Date - 2020-03-24T12:20:01+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ ప్రభావం ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించగా సోమవారం ప్రజలు ఇళ్లకే పరిమితం

లాక్‌డౌన్‌ సక్సెస్‌

జిల్లాలో నిర్మానుష్యంగా రహదారులు 

తిరగని ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ప్రైవేట్‌ వాహనాలు 

నిత్యావసర వస్తువుల కోసం ఎగబడుతున్న జనం  


ఆంధ్రజ్యోతి, కొత్తగూడెం :  జిల్లాలో కరోనా వైరస్‌ ప్రభావం ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించగా సోమవారం ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. 31తేదీ వరకు ఆంక్షలు విధించడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట బస్టాండ్‌లు నిర్మానుష్యంగా కనిపించాయి.  రైళ్ల రాకపోకలు కూడా రద్దుచేశారు. ఆర్టీసీ సంస్థకు జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల నుంచి రూ.40లక్షల  నష్టం వాటిల్లింది. ఒడిసా,  ఛత్తీ్‌సగఢ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దులు మూశారు.  చర్ల, అశ్వారావుపేట, చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు.  కూరగాయల ధరలు   మండి పోతున్నాయి. ఉదయం వేళ ద్విచక్రవాహనాలు, కొన్ని వాహనాల కదలికలు కనిపించడంతో పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమై బారికేడ్లను ఏర్పాటు చేసింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు జన సంచారం కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 


కొనసాగిన బొగ్గు ఉత్పత్తి

సింగరేణి సంస్థ అత్యవసర సర్వీసుల కింద ఉండటం వల్ల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగలేదు.  సోమవారం సంస్థ జిల్లా వ్యాప్తంగా అన్ని బొగ్గు బావులు పనిచేశాయి.  కార్మిక సంఘాలు మాత్రం ఉత్పత్తి నిలిపివేసి సెలవులు ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమకు లాక్‌డౌన్‌ వర్తించదని  యాజమాన్యం ప్రకటించింది. 


సకలం మూత..

 మండల కేంద్రాల్లో, పట్టణాల్లో  వ్యాపార సంస్థలు మూతబడ్డాయి.  బడ్డీ కొట్లు, పాన్‌షాపులు, చిరు వ్యాపారులు బంద్‌ చేశారు.  ఉపాధి పనులు నిర్వహించే కూలీలు, భవన నిర్మాణ కార్మికులు సైతం ఇళ్లకే పరిమితమయ్యారు.  వ్యవసాయ కూలీలు కొరత ఉండటంతో పలు పంటలపై కూడా ఈ ప్రభావం పడింది. దినసరి కూలీలకు సైతం కరోనా బంద్‌ ప్రభావంతో మరింత ఇబ్బందులు పడక తప్పలేదు. ప్రార్థన మందిరాలు మూతబడ్డాయి. పెళ్లిళ్లు, శుభ కార్యాలు వాయిదా పడ్డాయి.  

 


Updated Date - 2020-03-24T12:20:01+05:30 IST