గోదావరి వరదలను ఎదుర్కొంటాం

ABN , First Publish Date - 2020-07-15T11:26:04+05:30 IST

రాబోయే గోదావరి వరదలను సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని నీటిపారుదలశాఖ ఎస్‌ఈ వెంకటకృష్ణ

గోదావరి వరదలను ఎదుర్కొంటాం

నీటిపారుదల శాఖ ఎస్‌ఈ వెంకటకృష్ణ వెల్లడి


భద్రాచలం, జూలై14: రాబోయే గోదావరి వరదలను సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని నీటిపారుదలశాఖ ఎస్‌ఈ వెంకటకృష్ణ పేర్కొన్నారు. భద్రాచలంలో మంగళవారం గోదావరి కరకట్టకు ఉన్న స్లూయిస్‌లను పరిశీలించారు.  ప్రస్తుతం వర్షాకాల ప్రభావంతో ఎగువ నుంచి రానున్న గోదావరి వరదలకు భదాచ్రలం డివిజన్‌ వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవుతాయని అన్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే లోతట్టు ప్రాంతాలతో పాటు ముఖ్యంగా భద్రాద్రి పట్టణంలోకి కూడా గోదావరి నీరు కరకట్ల స్లూయిస్‌ కాలువల ద్వార లోపలికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.


ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడి స్లూయిస్‌ కాలువ మోటార్ల పనితీరు పని చేస్తున్న మోటార్లతో పాటు మరో రెండు మోటార్లు సహాయంతో ఈసారి గోదావరి నీరు పట్టణంలోకి రాకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. లోతట్టు ప్రాంతాలను కూడా సందర్శించి ఆయా ప్రాంతాల్లో వరద ముంపునకు గురి కాకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. భద్రాచలం, దుమ్ముగూడెం, తాలిపేరు ప్రాజెక్టు ప్రాంతాల్లో వరద ముంపు ప్రాంతాలను కూడా సందర్శించి వరదల కారణంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే గోదావరి 20 అడుగుల వద్దకు చేరి మళ్లీ క్రమంగా తగ్గి ప్రస్తుతం 11 అడుగుల వద్ద ప్రవహిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నీటిపారుదల శాఖ ఈఈ రాం ప్రసాద్‌, డీఈ పవన్‌ చౌదరి, జేఈలు ఎ.వెంకటేశ్వర్లు, డి.వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-07-15T11:26:04+05:30 IST