మళ్లీ స్థలాల గొడవ
ABN , First Publish Date - 2020-12-01T05:30:00+05:30 IST
గతంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో పేదలు నిర్మాణాలు చేపట్టకపోవటంతో సదరు స్థలాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొంటున్నారు.

నిర్మాణాలు చేపట్టకపోవటంతో అధికారుల స్వాధీనం
తహసీల్దార్ వాహనాన్ని అడ్డుకున్న మహిళలు
ఖమ్మంటౌన్, డిసెంబరు 1: గతంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో పేదలు నిర్మాణాలు చేపట్టకపోవటంతో సదరు స్థలాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొంటున్నారు. వేరే పేదలకు కేటాయిస్తున్నారు. స్థలాలు కోల్పోయిన వారు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మంగళవారం పలువురు మహిళలు ఈ విషయమై అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తహసీల్దార్ బయటకు వెళుతుంటే వాహనాన్ని అడ్డుకున్నారు. అదే సమయానికి అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన అసిస్టెంట్ కలెక్టర్ మధుసూదన్ వాహనం కూడా ఆగిపోవాల్సి వచ్చింది. అసిస్టెంట్ కలెక్టర్‌కు కూడా తమ గోడు వినిపించారు.
2009లోనే స్థలాలు ఇచ్చారు
నగరానికి చెందిన పలువురు పేదలకు నగరంలోని ఆరో డివిజన్ వైఎస్సార్ కాలనీలో 2009లోనే ఇంటి స్థలాలు ఇచ్చారు. అయితే వివిధ కారణాలతో వారిలో కొందరు ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. ఒకరిద్దరు షెడ్లు వేసుకున్నారు. రెవెన్యూ అధికారులు వైఎస్సార్ కాలనీలో తనిఖీలు నిర్వహించి స్థలం ఇచ్చినా, ఇళ్లు నిర్మించుకోని వారి వివరాలు సేకరించారు. కాగా ఎన్నెస్పీ కాలువ అభివృద్ధి పనుల్లో భాగంగా వేణుగోపాల్ నగర్, ఎన్నెస్పీ కాలువ కట్ట వద్ద నివాసాలు ఉంటున్నవారిని అధికారులు ఇటీవల తొలగించారు. సదరు పేదలకు వైఎస్సార్ నగర్ కాలనీలో స్థలాలు కేటాయించారు. వాటిల్లో నిర్మాణాలను చేపట్టని వారికి చెందిన స్థలాలను వేణుగోపాల్ నగర్‌కు చెందిన వారికి కేటాయించారు. ఈ క్రమంలో స్థలాలు పొందిన మహిళలు మంగళవారం మధ్యాహ్నం అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. అదే సమయంలో అసిస్టెంట్ కలెక్టర్ మధుసూధన్ కూడా అర్బన్ కార్యాలయానికి వచ్చారు. తహసీల్దార్, అసిస్టెంట్ కలెక్టర్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను చూసేందుకు వెళుతుండగా మహిళలు ఆయన కారును అడ్డుకున్నారు. దీంతో అసిస్టెంట్ కలెక్టర్ వాహనం కూడా ఆగిపోవాల్సి వచ్చింది. తమకు న్యాయం చేయాలని మహిళలు దండంపెట్టి బతిమిలాడారు. తరువాత నిర్మాణాలకు అనుమతి ఇచ్చేవరకు కదలనివ్వమని అలాగే నిలుచున్నారు. అసిస్టెంట్ కలెక్టర్ మధుసూధన్‌కు విషయం తెలియచేశారు. దీనికి సంబంధించి దరఖాస్తు ఇవ్వమని తహసీల్దార్ తేళ్ల శ్రీనివాసరావు సూచించటంతో మహిళలు అడ్డుతప్పుకున్నారు.