స్వచ్ఛత లోపించింది
ABN , First Publish Date - 2020-12-14T04:47:22+05:30 IST
జిల్లాలో వివిధ మునిసిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణ పడకేసింది. పారిశుధ్యం మెరుగునకు చర్యలు తీసుకోవడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వేధిస్తున్న పారిశుధ్య కార్మికుల కొరత
కంపుకొడుతున్న మునిసిపాలిటీలు
కొత్తగూడెం టౌన్, డిసెంబరు 13: జిల్లాలో వివిధ మునిసిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణ పడకేసింది. పారిశుధ్యం మెరుగునకు చర్యలు తీసుకోవడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వచ్ఛ భారత్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రచారం నిర్వహిస్తున్న క్షేత్రస్ధాయిలో అమలు కావడం లేదు. ఇంటింటా చెత్త సేకరణ కార్యక్రమం అటకెక్కింది. పాలకుల నిర్లిప్తత అధికారుల భాధ్యతారహిత్యం, పారిశుధ్య కార్మికుల కొరతతో వీధులు కంపుకొడుతున్నాయి. మురికివాడల్లో నివాసముంటున్న ప్రజలు పరిస్థితి దయనీయంగా మారింది. కంపు భరించలేక భోజనం చేసేందుకు ముద్ద దిగడం లేదు. డంపింగ్‌యార్డులకు కేటాయించిన స్థలాలు వివాదాలతో చెత్తను ఎక్కడికి తరలించాలో తెలియని పరిస్థితి నెలకొంది. కొత్తగూడెం పట్టణానికి డంపింగ్‌యార్డుకు స్థలం మంజూరైన నేటివరకు ఆచరణలో పెట్టలేని నిస్సహయ స్థితిలో పాలకులు, జిల్లా అధికార యంత్రాంగం ఉంది.
అటకెక్కిన చెత్తసేకరణ..
మునిసిపాలిటీల్లో చెత్త సేకరణ కార్యక్రమం అటకెక్కింది. నిత్యం కొత్తగూడెంలో 80, పాల్వంచలో 31, మణుగూరులో 20, సత్తుపల్లిలో 21, మధిరలో 10.4, ఇల్లెందులో 16.5తో పాటు ఖమ్మం కార్పొరేషన్‌లో 150 మెట్రిక్ టన్నుల్లో చెత్త ఉత్పన్నమవుతుంది. స్వచ్ఛ పట్టణాల్లో భాగంగా ఇంటి నుంచి సేకరించిన చెత్తను ఎక్కడపడితే అక్కడ కాకుండా డస్ట్‌బిన్స్‌లో వేసి డంపింగ్‌యార్డుకు తరలించాలి. ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి, వైరా, మధిర పట్టణాల్లో పూర్తిస్థాయిలో చెత్త్త సేకరణ జరగటం లేదు.
సరిపోను కార్మికులేరీ?
ప్రభుత్వ నిబంధనలప్రకారం జనభాలో ప్రతి పదివేలమందికి తప్పనిసరిగా 28మంది పారిశుధ్య కార్మికులుండాలి. కానీ ఏ పురపాలకంలో ఈ దమాషా ప్రకారం కార్మికులు లేరు. పట్టణాలలో కార్మికుల కొరతతో చెత్త సేకరణ జరగటం లేదనే వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు పురపాలకాలు, ఒక నగరపాలక సంస్థలో దాదాపుగా 1,340 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంకా మరో వంద మంది కార్మికులు అవసరం ఉందని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఖమ్మం నగరపాలక సంస్థలో 706మంది రెగ్యులర్, కాంట్రాక్ట్ కార్మికులున్నారు. ఇక శానిటరీ ఇన్‌స్పెక్టర్లలో ఇద్దరు మినహా రెగ్యులర్ కాగా మధిర, మణుగూరులో మేస్త్రీ ఇన్‌చార్జ్‌లుగా పనిచేస్తున్నారు. నగరపాలక సంస్థ, పురపాలకాలలో మరో కొంతమంది కార్మికులను నియమిస్తే తప్పా పరిస్థితి మెరుగుపడదు. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి, మధిరలో 634 మంది మాత్రమే రెగ్యులర్, కాంట్రాక్ట్ సిబ్బంది పనిచేస్తున్నారు.
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రకారం చెత్త సేకరణ
షాహిద్ మసూద్, మునిసిపల్ ఆర్డీ
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనల ప్రకారం ప్రతీఇంటి నుంచి చెత్త వ్యర్ధాల సేకరణ చేసి స్వచ్ఛ పట్టణాల మార్పునకు కృషి చేయాలి. తడి చెత్తను వర్మీ కంపోష్టు, పొడిచెత్తను డిస్పోల్ చేసి రిసైకిల్ చేయాలి. ప్రతి నివాస, వాణిజ్య సముదాయాల నుంచి చెత్తవ్యర్థాలను సేకరించి కంపోస్టు యార్డుకు తరలిస్తాం. తప్పనిసరిగా చెత్త సంపద కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రతి మునిసిపాలిటీకి డీఅర్‌సీసీ కేంద్రాలు, డంపింగ్‌యార్డులను ఏర్పాటు చేసుకోవాలి. ఇంటింటి చెత్త సేకరణ, పారిశుధ్యం మెరుగునకు చర్యలకుపక్రమించనున్నాం. డిస్టిక్ర్ మినరల్ ట్రస్టీ ఫండ్ నిధుల ద్వారా స్వచ్ఛ వాహనాలు సమకూర్చుకున్నాం. డంపింగ్‌యార్డు లేని ప్రాంతాల్లో మునిసిపాలిటీలు స్థలాన్ని చూసుకునితహసీల్దార్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి.