ముగిసిన అధ్యాయం

ABN , First Publish Date - 2020-04-01T11:08:26+05:30 IST

ఐదు దశాబ్ధాల పాటు ప్రజానీకానికి వెలుగులు పంచిన పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌స్టేషన్‌ (కేటీపీఎస్‌) ఆధ్యాయం మంగళవారంతో ముగిసింది.

ముగిసిన అధ్యాయం

కేటీపీఎస్‌ పాతప్లాంట్‌ మూత 

పూజలు నిర్వహించి 4, 7యూనిట్లను నిలిపివేసిన సీఈ

కార్మికుల తీవ్ర ఆవేదన 

బంకర్లకు బొగ్గు సరఫరా నిలిపివేత

విలేకరులకు అనుమతి నిరాకరణ  

ఏడోదశలో మళ్లీ ఆగిన విద్యుత్‌ ఉత్పత్తి


కేటీపీఎస్‌ (పాల్వంచ), మార్చి 31: ఐదు దశాబ్ధాల పాటు ప్రజానీకానికి వెలుగులు పంచిన పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌స్టేషన్‌ (కేటీపీఎస్‌) ఆధ్యాయం మంగళవారంతో ముగిసింది. కర్మాగారంలో విద్యుత్‌ ఉత్పత్తిలో ఉన్న 4, 7 యూనిట్లను కేటీపీఎస్‌ ఓఅండ్‌ఎం చీఫ్‌ ఇంజనీర్‌ జాటోత్‌ సమ్మయ్య పూజలు నిర్వహించిన అనంతరం మూసివేస్తున్నట్టు ప్రకటించారు. అంతకు ముందు కోల్‌ప్లాంటులోని అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. మంగళవారం యూనిట్ల మూసివేత అధికారికంగా ప్రకటించటంతో సోమవారం సాయంత్రమే బంకర్లకు బొగ్గు సరఫరా నిలిపివేశారు. దీంతో సాయింత్రం జనరల్‌ షిఫ్టు ముగిసే సమయానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. తీవ్రమైన వాయు కాలుష్యానికి కారణమవుతున్న కేటీపీఎస్‌ పాతప్లాంటు మూసివేతకు సీఈఏ గత ఏడాదే ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో యూనిట్ల మూసివేత అనివార్యమైంది. యూనిట్ల మూసివేత అనంతరం కేటీపీఎస్‌ ప్రధాన ద్వారం వద్ద చివరి మజిలీగా సెల్ఫీలు తీసుకున్నారు. కార్మికసంఘాల నాయకులు గ్రూప్‌ ఫోటోలు దిగారు.


చివరి కార్యక్రమానికి కార్మిక సంఘాలకు చెందిన నాయకులను పరిమిత సంఖ్యలో అనుమతించారు. వార్త కవరేజీకి వెళ్లిన విలేకరులకు అవకాశం ఇవ్వలేదు. ఐదు దశాబ్దాలుగా సంస్థ అభివృద్ధిపై వార్తలు రాసిన విలేకరుల కు అనుమతి ఇవ్వకపోవటంతో పలువురు విలేకరులు అస ంతృప్తి వ్యక్తం చేశారు. తమకు బతుకునిచ్చిన కర్మాగారం మూతపడటం జీర్ణించుకోలేక పోతున్నామని పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. టీఎన్‌వీకేఎస్‌ రాష్ట్ర నాయకులు బొల్లేపల్లి కోటేశ్వరావు తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. యూనిట్‌ మూసివేతకు సంకేతంగా చీఫ్‌ ఇంజనీర్‌ సమ్మయ్య ప్రధాన ద్వారానికి తాళాలు వేయటంతో అక్కడకు వచ్చిన కార్మికులు గేటుకు నమస్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ దశాబ్దాల పాటు వెలుగులు పంచిన కర్మాగారం తన హయాంతో మూతపడటం కొంత బాధ కలిగిస్తున్నా ఎప్పటికైనా మూసివేత తప్పదన్నారు. కార్యక్రమంలో కేటీపీఎస్‌ వివిధ విభాగాల ఎస్‌ఈలు, డీఈలు, ఏడీఈలు, కార్మికసంఘాల నాయకులు రాధాకృష్ణ, కటుకూరి రవి, కట్టా మల్లికార్జున్‌, బొల్లేపల్లి కోటేశ్వరావు, చారుగండ్ల రమేష్‌, తోట కోటేశ్వరావు, అంజంరాజు, బూర్గుల బాచి తదితరులు పాల్గొన్నారు. 


మొదటికొచ్చిన ఏడోదశ.. ఉత్పత్తిలో మళ్లీ అంతరాయం

పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీ ఎస్‌)ఏడోదశ కథ మళ్లీ మొదటికొచ్చింది. 120 రోజలుపాటు మరమ్మతులు నిర్వహించినా యూనిట్‌లో పురోగతి లేదు. యూనిట్‌ టర్బైన్‌ నాలుగో బేరింగ్‌లో మళ్లీ సమస్య తలెత్తింది. వైబ్రేషన్స్‌ భారీగా వస్తుండటంతో అధికారులు మరోసారి  ఉత్పత్తిని నిలిపేశారు. సాంకేతిక సమస్యను అదిగమించేందుకు యూనిట్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 800 మెగావాట్ల నుంచి 500 మెగావాట్లకు తగ్గించినా సమస్య కొలిక్కిరాలేదు.


120 రోజుల వార్షిక మరమ్మతుల అనంతరం శనివారం ఉత్పత్తిని పునరుద్దరించగా టర్బైన్‌ బేరింగ్‌ సమస్యతో విపరీతమైన వైబ్రేషన్స్‌ వస్తుండటంతో ఏంచేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకున్నారు. కరోనా సమస్యను సైతం పట్టించుకోకుండా నిపుణులు పనిచేసినా ఫలితం లేకపోవటంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ యూనిట్‌లో సమస్య పరిష్కారం కావాలంటే మరో నెలరోజులు పట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. వేసవి కాలం, కరోనా సమస్యల నేపధ్యంలో విద్యుత్‌ ఎంతో అవసరమైన ప్రస్తుత తరుణంలో కేటీపీఎస్‌ పాతప్లాంటు మూతపడగా ఏడోదశ నుంచి ఉత్పత్తికి విఘాతం కలగటం జెన్‌కోపై తీవ్ర భారం పడనున్నది. 

Updated Date - 2020-04-01T11:08:26+05:30 IST