మూసివేతకు కుదిరిన ముహూర్తం

ABN , First Publish Date - 2020-03-12T06:48:11+05:30 IST

720 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించిన పాల్వంచలోని కేటీపీఎస్‌ పాతప్లాంటును ఈనెల 31తో

మూసివేతకు కుదిరిన ముహూర్తం

31తో కేటీపీఎస్‌ పాతప్లాంటు మూత  

720 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి కోత

కార్మికుల బదిలీపై కసరత్తు 

నేడో రేపో జాబితా...కార్మికుల్లో ఉత్కంఠ


కేటీపీఎస్‌(పాల్వంచ), మార్చి11: 720 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించిన పాల్వంచలోని కేటీపీఎస్‌ పాతప్లాంటును ఈనెల 31తో మూసి వేస్తున్నారు. తెలుగురాష్ట్రాల్లో మొదటిగా నిర్మించిన ఈ ప్లాంటు అనేక మైలు రాళ్లను దాటింది. ఇప్పటికే కర్మాగారంలోని నాలుగు యూనిట్లను మూసివేయగా, మిగిలిన నాలుగుయూనిట్లను మూసివేసి కేటీపీఎస్‌ పాతప్లాంటు చరిత్రను కాలగతిలో కలపనున్నారు. ఫలితంగా 720మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి కోతపడనుంది. 


ఇదీ కేటీపీఎస్‌ ప్రస్థానం

1966జూలై 4న ఏస్టేషన్‌ 1వయూనిట్‌లో 60మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో ప్రారంభమైంది. కేటీపీఎస్‌ ప్రస్థానం720మెగావాట్ల వరకు సాగింది. కేటీపీఎస్‌ ఏస్టేషన్‌లో 1, 2, 3, 4యూనిట్ల నుంచి 240మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగింది. బిస్టేషన్‌లోని 5,6యూనిట్ల నుంచి 240మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగింది. సీస్టేషన్‌లోని 7, 8యూనిట్ల నుంచి 240 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. 1966జూలై నుంచి 1978జనవరి 10 వరకు 8యూనిట్లను నిర్మించారు.  పలు సాంకేతిక కారణాల నేపథ్యంలో కర్మాగారంలోని 60 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 1,3 యూనిట్‌లను ఇటీవల మూసివేయగా, 120 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యంతో పనిచేసే 6,8 యూనిట్లను ఆరునెలల క్రితమే మూసివేశారు. 


ఎందుకు తొలగిస్తున్నారు?

 అత్యధిక కాలుష్యం వెలువరిస్తున్న, కాలం చెల్లిన యూనిట్ల తొలగింపుకు సీఈఈఏ ఐదేళ్ల క్రితమే ఆదేశాలిచ్చింది.  2014లో కేటీపీఎస్‌ ఏడోదశ నిర్మాణానికి సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఈఏ) అనుమతి కోరింది. ఈ నేపఽథ్యంలో సంస్థ జపాన్‌ టెక్నాలజీతో తయారుచేసిన కేటీపీఎస్‌ వోఅండ్‌ ఎంలోని 4యూనిట్లు, స్వదేశీ పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన 4యూనిట్లు తొలగిస్తేనే కేటీపీఎస్‌ 7వదశకు అనుమతిస్తామని కేంద్ర పర్యావరణ శాఖ కూడా మెలిక పెట్టింది. కేటీపీఎస్‌కు అనుబంధంగా 7వదశను ఏర్పాటు చేయాలని జెన్‌కో భావించిన నేపథ్యంలో కేటీపీఎస్‌ పాతప్లాంటు మూసివేత అంశం తెరపైకి వచ్చింది. 26 నెలల రికార్డుస్థాయి నిర్మాణం అనంతరం 800మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని 2018 డిశంబర్‌ 26న సీవోడీ చేయటంతో ఇచ్చిన హామీ మేరకు యూనిట్ల తొలగింపుకు టీఎస్‌ జెన్‌కో రంగం సిద్ధం చేసుకుంది. 


కార్మికుల బదిలీల సందడి

 కేటీపీఎస్‌ తొలగింపు అనంతరం కర్మాగారంలోదశాబ్దాలుగా పనిచేస్తున్న కార్మికులు, ఇంజనీర్లు, ఆర్టీజన్‌ల బదిలీలు తప్పనిసరయింది. తాజాగా కర్మాగారంలో పనిచేసే ఇంజనీర్లను బదిలీచేయగా ఇక్కడ పనిచేస్తున్న 1500 మంది కార్మికులు, 700మంది ఆర్టీజన్ల బదిలీ తప్పనిసరయింది.అయితే కర్మాగారంలో పనిచేసే కార్మికులను ఎక్కడెక్కడికి బదిలీచేస్తారోననే ఆందోళన కార్మికుల్లో నెలకొంది.  ఇప్పటికే మూసివేసిన యూనిట్లకు సంబందించిన సిబ్బందిని కేటీపీఎస్‌ ఏడోదశలో భర్తీచేయగా కొందరిని మణుగూరులో నిర్మాణంలో ఉన్న భద్రాద్రి ధర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (బీటీపీఎస్‌) కు బదిలీ చేశారు. తాజా బదిలీలు ఎక్కడికి జరుగుతాయోననే ఉత్కంఠతో కార్మికులు ఉన్నారు. కొందరు కార్మికులు తమను కేటీపీఎస్‌ కాంప్లెక్స్‌లోనే ఉంచాలనే అభ్యర్ధన ఎక్కువవుతుంది.  ఒకటి రెండు రోజుల్లో బదిలీల జాబితా విడుదల కానుంది. 

 


Updated Date - 2020-03-12T06:48:11+05:30 IST