చోరీసొత్తుపై స్పష్టత కరువు

ABN , First Publish Date - 2020-04-26T10:34:37+05:30 IST

పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌స్టేషన్‌ (కేటీపీఎస్‌)చోరీ ఘటనల్లో లభ్యమవుతున్న సొత్తులో స్పష్టత కొరవడుతోంది. కేటీపీఎస్‌ ఏడోదశ పాత బీహెచ్‌ఈఎల్‌

చోరీసొత్తుపై స్పష్టత కరువు

  •  కేటీపీఎస్‌ ఏసీ జాన్‌పై వేటుకు రంగం సిద్ధం ?
  • ఎస్‌పీఎఫ్‌ సిబ్బందిని తప్పించేందుకు బేరసారాలు


కేటీపీఎస్‌,(పాల్వంచ), ఏప్రిల్‌ 25: పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌స్టేషన్‌ (కేటీపీఎస్‌)చోరీ ఘటనల్లో లభ్యమవుతున్న సొత్తులో స్పష్టత కొరవడుతోంది. కేటీపీఎస్‌ ఏడోదశ పాత బీహెచ్‌ఈఎల్‌ స్టోర్‌లో రూ.63లక్షల విలువైన 29రకాల సామగ్రి చోరీకి గరైనట్టు స్టోర్‌ ఏఈ రజితారాణి ఇటీవల పాల్వంచ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాము మాయమైనట్లు ఫిర్యాదు చేసిన సామగ్రిలో కొంత స్టోర్‌లోనే ఉందని, పొరపాటున పోయినట్లు సమాచారం ఇచ్చామని మరో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అయితే పోయిన సామగ్రి, కొత్తగా లభ్యమైన  సామగ్రిని కలిపి మరో స్టేట్‌మెంట్‌ తయారు చేసినట్టు సమాచారం. అయితే తాము పనిచేసే ప్రదేశంలో ఉన్న, పోయిన సామగ్రిపట్ల ఇంజనీర్లకు అవగాహన లేకపోవటం శోచనీయమని పలువురు పేర్కొంటున్నారు. అయితే కరకవాగులో లభ్యమైన సామగ్రి మణుగూరులో నిర్మాణంలో ఉన్న భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (బీటీపీఎస్‌)కు సంబంధించిన కాపర్‌, అల్యూమీనియం, ఇతర యంత్ర పరికరాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.


కాగా కేటీపీఎస్‌లో మాయమైన కలపకు సంబందించి కేటీపీఎస్‌ ప్రత్యేక భద్రతాదళం(ఎస్‌పీఎఫ్‌)అసిస్టెంట్‌ కమాండెంట్‌ జాన్‌ను ఉన్నతాధికారులు మెడికల్‌ లీవ్‌లో పంపించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన స్థానంలో రిజర్వ్‌బ్యాంక్‌  అసిస్టెంట్‌ కమాండెంట్‌గా ఉన్న కోటేశ్వరరావును బర్తీ చేశారు. అయితే కేటీపీఎస్‌ స్టోర్‌ చోరీ, కలప చోరీ ఘటనల్లో నిందితులుగా ఉన్న మొత్తం ఎనిమిది మంది కానిస్టేబుళ్లు, అధికారులపై వేటుకు రంగం సిద్ధమైంది. వారితో పాటు కలప స్మగ్లింగ్‌లో సహకరించిన ఓ కార్పెంటర్‌ పైనా కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ విషయమై జెన్‌కో విజిలెన్స్‌ ఎస్‌పీ వినోద్‌కుమార్‌ను వివరణ కోరగా కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పాల్వంచ పోలీసులకు ఇచ్చామని కేసు నమోదు చేయాల్సిన బాధ్యత పాల్వంచ డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలపైౖనే ఉందన్నారు. పాల్వంచ సీఐ నవీన్‌ స్పందిస్తూ కేసుకు సంబందించిన సమాచారం త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.


స్ర్కాప్‌ యజమానుల రాయబారాలు 

తమ వద్ద అనేక మంది నెలవారీ మామూళ్లు తీసుకుంటూనే తమను బలిచేస్తున్నారని, తమకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కాపాడాలని కొందరు పాత ఇనుము వ్యాపారులు పలువురు ప్రజాప్రతినిధుల వద్ద మొరపెట్టుకున్నట్టు సమాచారం. తమమీద దెబ్బపడకుండా బయటకు వస్తే రూ.10లక్షలైనా ఇస్తానని ఓ వ్యాపారి బేరం పెట్టినట్టు తెలిసింది. 


ఎస్‌పీఎఫ్‌ బేరసారాలు 

కేటీపీఎస్‌లో పనిచేస్తున్న పలువురు ఎస్‌పీఎఫ్‌ సిబ్బందిపై వేటు ఖాయమైన నేపధ్యంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ కార్యాలయంలో ఉండే ఓ ఉద్యోగి మరో ప్రాంతంలో పనిచేస్తున్న ఓ ఎస్‌పీఎఫ్‌ అధికారితో బేరసారాలు నడుపుతున్నట్టు సమాచారం. ఎస్‌పీఎఫ్‌ డీజీ ఈనెలలో పదవీ విరమణ చేయనున్న నేపధ్యంలో ఆమె బాధ్యతల నుంచి తప్పుకున్న వెంటనే నిందితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటకు తీసుకువచ్చే పూచీ తనదని, అప్పటివరకూ ఓపిక పట్టాలని అభయమిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎస్‌పీఎఫ్‌ డీజీని ఈవిషయంలో మాయచేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2020-04-26T10:34:37+05:30 IST